శంషాబాద్ : పసికందుల విక్రయిస్తున్న ఓ వ్యక్తితో పాటు అతడికి సహకరిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గంగాధర్‌రెడ్డి గతంలో కమీషన్ పద్ధతిన ప్రైవేటు ఆస్పత్రులకు రోగులకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఆస్పత్రుల వారితో ఉన్న పరిచయాన్ని కాస్తా దందాగా మార్చుకున్నాడు. అధిక సంతానంతో పాటు ఆడపిల్లలను కన్నవారి సంప్రదిస్తూ వారికి ఎంతో కొంత ముట్టజెప్పి పసికందులను అక్కడి నుంచి తరలిస్తూ సంతానం లేని వారితో పాటు ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఇందుకోసం నగరంలోని బలహీనవర్గాల కాలనీల్లో నివాసముండే గృహిణిలను పరిచయం చేసుకున్నాడు. మంచిబేరం వచ్చే వరకు పిల్లల ఆలనాపాలన చూసుకునే విధంగా వారికి నగదును ఆశచూపి దందా సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో శంషాబాద్ పట్టణంలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసముండే సురేష్ భార్య మంగను పరిచయం చేసుకున్నాడు. గతంలో ఓ పసికందును తీసుకొచ్చి ఇక్కడ కొంత కాలం ఉంచినందుకు గాను వారికి రూ.10 వేలు ఇచ్చాడు. తాజాగా ఈ నెల 22 న కూడా మరో శిశువును తీసుకొచ్చి మంచి బేరం వచ్చేంతవరకు చూసుకోవాలని అప్పగించాడు. అనుమానించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వీరి గుట్టు రట్టయింది. మంగ ద్వారా ప్రధాన సూత్రధారి అయిన గంగాధర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. హుమాయునగర్, ఛత్రినాకా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో కూడా గంగాధర్‌రెడ్డి శిశువులను విక్రయించినట్లు సమాచారం. మరిన్ని వివరాలను గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment