సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీఆర్‌ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరికి స్థానచలనం కలగవచ్చు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో మంచిర్యాల మినహా, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్ శుక్రవారం అభ్యర్థులను ప్రకటించారు. బోథ్ (ఎస్టీ) ఎమ్మెల్యే అభ్యర్థిగా గోడం నగేష్ పేరును ఖరారు చేశారు.
కానీ ఆయన ఎంపీగా బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బోథ్ నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన ఎంపీగానే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ విషయంలో తాను నిర్ణయం తీసుకోలేదని నగేష్ ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.
నామినేషన్ మాత్రం ఈనెల 9న వేస్తానన్నారు. నగేష్ ఎంపీగా బరిలోకి దిగితే.. ఖాళీ కానున్న బోథ్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి పేరును పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు రాథోడ్ బాపురావు నామినేషన్ వేశారు.
ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రాములు నాయక్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. సిర్పూర్ స్థానానికి కావేటి సమ్మయ్య అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన పేరు ఖరారైంది. అయితే ఇక్కడ ఆ పార్టీ మహిళా నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో నామినేషన్ వేయించారు.
సిర్పూర్ అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని ఆమె టీఆర్‌ఎస్ అగ్ర నాయకుల్లో ఒకరైన హరీష్‌రావును శనివారం కలిసి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిర్పూర్ టిక్కెట్‌ను తన కుమారునికి కేటాయించాలని కోరినట్లు సమాచారం. బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య పేరును అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వినోద్ కొనసాగారు.
ఆయన ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో చిన్నయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అయితే దుర్గం చిన్నయ్యపై ఆయన వ్యతిరేక వర్గీయులు టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చిన్నయ్యపై గతంలో నమోదైన ఓ కేసును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అధినేత అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఆదివారం రాత్రి వరకు బీ-ఫారాలు మాత్రం ఇవ్వలేదు.
మంచిర్యాలపై వీడని ఉత్కంఠ
మంచిర్యాల నుంచి బరిలోకి దిగనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడటం లేదు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధినేత కేసీఆర్ మంచిర్యాల అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు.
దీంతో అనేక ఊహాగానాలు తెరలేచినట్లయింది. ఈ టిక్కెట్‌పై నడిపెల్లి దివాకర్‌రావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ మొదటి జాబితాలో ఆయన పేరును ప్రకటించక పోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
గులాబీ దళంలో మార్పులు!
Published Mon, Apr 7 2014 1:43 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement