‘పుర’పోరుకు కసరత్తు | Municipal Election Fight In Adilabad | Sakshi
Sakshi News home page

‘పుర’పోరుకు కసరత్తు

Published Fri, Mar 8 2019 11:27 AM | Last Updated on Fri, Mar 8 2019 12:05 PM

Municipal Election Fight In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: మున్సిపాలిటీ పాలక వర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో మూడు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ డైరెక్టర్, కమిషనర్‌ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు ముసాయిదా జాబితా తయారీకి ఆదేశించింది. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఈ నెల 16న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. 27న తుది జాబితాను విడుదల చేస్తారు. 28న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు.

వార్డుల పెంపుపై స్పష్టత కరువు 
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే మొదటి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసి మే 31లోగా పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైనా గ్రామ పంచాయతీలను అధి కారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరో ఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్‌ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖకు విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు  విధివిధానాలు..
మున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు విని యోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితాలను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది.

విలీన గ్రామాలపై తేలని నిర్ణయం..
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతేడాది పట్టణానికి సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. మావల పంచాయతీ, బట్టిసావర్‌గాం, రాంపూర్, అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌లను మున్సిపాలిటీలో కలిపేశారు. సీడీఎంఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు విలీన జీపీలు, కాలనీలను సమీప మున్సిపాలిటీ వార్డుల్లో విలీనం చేశారు. దీంతో 32వ వార్డులో రాంపూర్‌ గ్రామాన్ని కలిపారు. 13వ వార్డులో అనుకుంట, 27వ వార్డులో బట్టిసావర్‌గాం జీపీలోని టైలర్స్‌కాలనీ, వివేకానంద, ఎన్‌హెచ్‌బీ కాలనీ, అగ్రజా టౌన్‌షిప్, ఆదర్శకాలనీ, భగత్‌సింగ్‌ కాలనీలను విలీనం చేశారు.

3వ వార్డులో బేల్లూరి, నిషాన్‌ఘాట్, 19వ వార్డులో మావల మేజర్‌ గ్రామ పంచాయతీలోని దస్నాపూర్, దర్గానగర్, కేఆర్‌కేకాలనీ, పీహెచ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, అటెండర్‌ కాలనీలను విలీనం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 36 వార్డులు ఉండగా మరో ఐదు వార్డులను పెంచి మొత్తం 41 వార్డులు చేస్తారని మున్సిపల్‌ పాలకవర్గం భావిస్తూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులు పెంచుతారా..లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీలలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే అశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement