నల్లగొండలో టీడీపీ బంద్ పాక్షికం | Partial bandh in Nalgonda TDP | Sakshi
Sakshi News home page

నల్లగొండలో టీడీపీ బంద్ పాక్షికం

Published Thu, Oct 23 2014 1:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

నల్లగొండలో టీడీపీ బంద్ పాక్షికం - Sakshi

నల్లగొండలో టీడీపీ బంద్ పాక్షికం

అగ్రనేతలు రాకుండా అడ్డుకున్న పోలీసులు
ఎర్రబెల్లి, రేవంత్, ఎల్.రమణ, మోత్కుపల్లి, రమేశ్‌రాథోడ్ తదితరుల అరెస్టు
ఎస్పీ అనుమతితో నల్లగొండకు వచ్చి పార్టీ కార్యాలయం పరిశీలన

 
నల్లగొండ: టీడీపీ జిల్లా కార్యాలయంపై టీఆర్‌ఎస్ దాడికి నిరసనగా నల్లగొండ జిల్లాలో టీడీపీ శ్రేణులు బుధవారం నిర్వహించిన బంద్ పాక్షికంగా జరిగింది. టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ బంద్‌ను అడ్డుకునేందుకు యత్నించడం.. అవాంఛనీయ ఘటన లు జరగకుండా పోలీసులు తీసుకున్న చర్యలతో కొంత ఉద్రికత్తల నడుమ బంద్ ప్రశాంతంగానే ముగిసింది. బంద్ నుంచి ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇవ్వడంతో అవి నడవగా, ఉదయం కొంతసేపు మినహా అన్ని దుకాణసముదాయాలు, ఇతర కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి. మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్, భువనగిరి, మునుగోడులతో పాటు జిల్లా కేంద్రమైన నల్లగొండలో కూడా బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం టీడీపీ నేతలు కొద్దిసేపు వాణిజ్య సముదాయాలను మూసివేయించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా ర్యాలీలు నిర్వహించారు.

అయితే, అగ్రనేతలు నల్లగొండకు వచ్చేందుకు ప్రయత్నించడం.. వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పార్టీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రమేశ్‌రాథోడ్ తదితరులను మార్గమధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రబెల్లి, రమణ, మోత్కుపల్లిలను చిట్యాల వద్ద అరెస్టు చేసి రామన్నపేట పీఎస్‌కు తరలించగా, రేవంత్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్‌లను రంగారెడ్డి జిల్లా శివార్లలోని కొత్తగూడ గ్రామం వద్దే అదుపులోకి తీసుకుని భూదాన్‌పోచంపల్లి పీఎస్‌కు తరలించారు. అయితే, ఎర్రబెల్లి తదితరులు నల్లగొండకు వస్తున్న క్రమంలో చిట్యాల వద్ద టీఆర్‌ఎస్ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ సమయంలో కొందరు టీడీపీ నేతల వాహనాలపై రాళ్లు రువ్వడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సమన్వయపరిచి టీడీపీ నేతలను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు అనుమతితో ఎర్రబెల్లి బృందం నల్లగొండ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు.  

బాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

విభజన బిల్లుకు విఘాతం కలిగిస్తూ తెలంగాణలో అలజడులు సృష్టిస్తున్నాడని ఆరోపిస్తూ బుధవారం హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలకరాజు అజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన కరెంటు వాటాను ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని, తెలంగాణలో టీడీపీ నాయకులను రెచ్చగొట్టి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 మా నేతలపై దాడులను అడ్డుకోవాలి
 
 డీజీపీకి టీడీపీ ఎమ్మెల్యేల వినతి
 సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో టీఆర్‌ఎస్ దౌర్జన్యాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని అక్రమ కేసులు బనాయించారని ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ లో టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులకు పాల్పడుతున్న వారి ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బుధవారం తమ పార్టీ నల్లగొండ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి బయలుదేరిన నేతలను అరెస్టు చేయడం, తమ నాయకుల వాహనాలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంపై టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశా రు. ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సిం హులు, సి.కృష్ణయాదవ్‌లను చిట్యాలలో, రేవంత్‌రెడ్డి, రమేష్ రాథోడ్‌లను పోచంపల్లి దగ్గర అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.  
 
 మేం తల్చుకుంటే  మీ ఆఫీసే ఉండదు
 
 టీటీడీపీ నేతలకు మంత్రి మహేందర్‌రెడ్డి హెచ్చరిక        
 
 సాక్షి, హైదరాబాద్: ‘మేం తల్చుకుంటే హైదరాబాద్‌లో టీడీపీ ఆఫీసు ఉంటదా? రాత్రికి రాత్రే మాయం అయితది’ అని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారమిక్కడ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చేస్తామంటున్న టీటీడీపీ నేతలకు దమ్ముంటే తెలంగాణభవన్ గేటుకాడికి రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. విద్యుత్‌లో తెలంగాణకు న్యాయం గా రావాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీటీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలన్నారు.   బాబుకు తెలంగాణ పేరును పలికే నైతిక అర్హత కూడా లేదన్నారు. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ కూర్చోవాలన్నారు. చంద్రబాబుకు ఇక్కడి కార్యాలయంలో పనేమిటని ప్రశ్నిం చారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని మంత్రి కోరారు.
 
 ‘నిజం నిరూపిస్తే..  ముక్కు నేలకు రాస్తాం’
 
 నల్లగొండ: విద్యుత్ సమస్య గురించి చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని, ఈ భేటీలో చంద్రబాబుదే తప్పు అని రుజువైతే తాము ముక్కు నేలకు రాస్తామని, కేసీఆర్ కాళ్ల సందుల్లోంచి దూరుతామని తెలంగాణ టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. బుధవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతపై దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, ‘నీ అయ్య.. తాత తరం కూడా కాదు’ అని సీఎంను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరుమాసాల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ కార్యకర్తల బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ   నేతలు మోత్కుపల్లి నర్సింహులు విలేకరులతో మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement