సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాల క్రమబద్ధీకరణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని క్రయ, విక్రయ లావాదేవీల్లో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వాటిని కూడా పరిశీలించి నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా దరఖాస్తులను తీసుకోవద్దని.. గతంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అయితే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో ఉన్న మండలాల్లో మాత్రం కొత్తగా దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించాలని సూచించింది. ఇందుకు కేవలం 15 రోజులు మాత్రమే గడువిచ్చింది.
స్టాంపు డ్యూటీ కట్టాల్సిందే..
రాష్ట్రంలో తెల్ల కాగితాలు, అధికారిక రిజిస్ట్రేషన్ జరగని స్టాంపుపేపర్ల మీద జరిగిన క్రయ, విక్రయ లావాదేవీలు (సాదాబైనామాలు) లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించాలన్న డిమాండ్ మేరకు గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐదెకరాలకుపైగా భూములకు సంబంధించిన వాటిని మాత్రం క్రమబద్ధీకరణ నుంచి మినహాయించింది. మొత్తంగా 11 లక్షలకుపైగా దరఖాస్తులురాగా.. ఈ ఏడాది జూన్, జూలై వరకు వాటిని పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం 6 లక్షలకుపైగా దరఖాస్తులను (34.39 శాతం) ఆమోదించింది. మిగతా దరఖాస్తులను తిరస్కరించింది. ఇందులో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న సాదాబైనామాల దరఖాస్తులు సుమారు 80 వేలకుపైగా ఉన్నట్లు అంచనా. ఇప్పుడు వాటిని పరిశీలించి క్రమబద్ధీకరించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో జరిగిన సాదాబైనామాల క్రమబద్ధీకరణలో స్టాంపు డ్యూటీని మినహాయించారు. కానీ తాజాగా ఐదెకరాలకన్నా ఎక్కువ భూములను క్రమబద్ధీకరించుకునే పెద్ద రైతుల నుంచి మాత్రం స్టాంపు డ్యూటీ వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎలా క్రమబద్ధీకరిస్తారు?
సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఆరు దశల్లో జరుగుతుంది. తొలుత ఫలానా సర్వే నంబర్‌లోని భూమిని సాదాబైనామా కింద క్రమబద్ధీకరించాలని రెవెన్యూశాఖకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని ఫారం–10 క్లెయిమ్ అంటారు. ఈ క్లెయిమ్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ ఫారం–11, 12లను జారీచేస్తారు. ఫారం–11 ప్రకారం అమ్మిన, కొన్న రైతులను పిలిపించి విచారణ జరుపుతారు. తర్వాత సదరు భూమి క్రమబద్ధీకరణలో ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ ఫారం–12 ద్వారా గ్రామంలో ప్రదర్శిస్తారు. అనంతరం ఫారం–13 (ఏ) ప్రకారం సదరు భూమి మార్కెట్ విలువ ఎంత ఉందో చెప్పాలని సబ్ రిజిస్ట్రార్లను కోరుతారు. ఆ వివరాలను తీసుకుని మార్కెట్ ధరకు అనుగుణంగా స్టాంపుడ్యూటీ కట్టించుకుంటారు. 13 (బీ) సర్టిఫికెట్ ద్వారా ఆ భూమిని అధికారికంగా క్రమబద్ధీకరిస్తారు. తర్వాత తిరిగి 13 (సీ) ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు వివరాలు పంపడం, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుంది.