కడుపునిండా పీఆర్సీ | prc to the telangana employees | Sakshi
Sakshi News home page

కడుపునిండా పీఆర్సీ

Published Fri, Feb 6 2015 1:40 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

కేసీఆర్‌కు స్వీట్ తినిపిస్తున్న శ్రీనివాస్‌గౌడ్, మమత - Sakshi

కేసీఆర్‌కు స్వీట్ తినిపిస్తున్న శ్రీనివాస్‌గౌడ్, మమత

43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన కేసీఆర్
 వచ్చే నెల నుంచే ప్రభుత్వోద్యోగులకు కొత్త వేతనాలు
 గత జూన్ 2 నుంచి వర్తింపు, జీపీఎఫ్‌లో బకాయిల జమ
 సర్కారుపై ఏటా రూ. 6,500 కోట్ల అదనపు భారం
 ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సుదీర్ఘ భేటీ
 మండలి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆకస్మిక నిర్ణయం
 తెలంగాణలో తొలి పీఆర్‌సీగా మీడియాకు ప్రకటించిన కేసీఆర్
 ఇతర అంశాలపై ప్రదీప్ చంద్ర కమిటీ సంప్రదింపులు
 ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను సరళీకృతం చేస్తామని హామీ

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 43 శాతం ఫిట్‌మెంట్‌తో వచ్చే నెల నుంచి పీఆర్‌సీ అమలుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ర్టం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి ఈ ప్రయోజనాలను వర్తింపజేయనుంది. అప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలు ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమవుతాయి. అలాగే, 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకు పీఆర్‌సీని నోషనల్‌గా వర్తింపజేస్తారు. శాసన మండలి ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో పీఆర్‌సీ అమలుపై సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన అత్యవసరంగా సమావేశమై 2 గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం సమావేశంలో ఉద్యోగ నేతల కరతాళధ్వనుల మధ్య పీఆర్‌సీ అమలు నిర్ణయాన్ని సీఎం ప్రకటించారు. ఉద్యోగులకు 8.5 శాతం వడ్డీ వస్తుందనే కారణంగా పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. మార్చి నెల జీతం కొత్త పీఆర్‌సీతోనే వస్తుందన్నారు. గత ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేసిన తెలంగాణ ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. లక్ష్మీవారమైన శుక్రవారం నాడు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేస్తుందన్నారు. సంబంధిత ఫైల్‌పై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారమే సంతకం చేశారు. మండలిలోని ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి, సహాయ అధికారులను సూచించాలని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వస్తే అవి ముగిసేవరకు ఇబ్బం దులు ఏర్పడతాయన్న కారణంతో పీఆర్‌సీ అమలుపై సత్వర నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో  ఈటెలతో పాటు పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్,  టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవోల అధ్యక్షురాలు మమత, పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
 
 ప్రదీప్ చంద్ర కమిటీ కొనసాగింపు
 
 ఉద్యోగుల పే స్కేళ్లలో వ్యత్యాసాలు, పీఆర్‌సీకి సంబంధించిన ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించినప్పటికీ సమయాభావంతో నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ‘పీఆర్‌సీ అంశాలు చాలా ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో పరిశీలించలేం. ఫిట్‌మెంట్ శాతం, అమలుకు కటాఫ్ తేదీ చెప్పేస్తే మిగతాది సులువవుతుంది. పీఆర్‌సీ అమలు ప్రక్రియ ప్రారంభమైనట్లే. మండలి ఎన్నికల నోటిఫికేషన్ కూడా అడ్డురాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రదీప్‌చంద్ర కమిటీ కొనసాగుతుందని, దాంతో చర్చించి పే స్కేళ్లలో వ్యత్యాసాలను సరిచేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. నిర్ణీత కాల వ్యవధిలోనే కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. దేనికీ వెరవకుండా సకల జనుల సమ్మె నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగులు అగ్రభాగాన నిలిచార న్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులపై వే దింపులు, అనవసర బదిలీలు, మెమోలు, బెదిరింపులు, కేసులు పెట్టినా వెరవకుండా ఉద్యమంలో పురోగమించారన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు కాబట్టే.. ఉన్నంతలో ఆర్థిక వెసులుబాటు చేసుకుని పీఆర్‌సీపై సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించిందన్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి రాజేందర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి తదితరులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఇతర లోటుపాట్లపై ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర నేతృత్వంలోని కమిటీ సంప్రదింపులు జరిపిందన్నారు. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ అమలు మార్గాలను సూచిస్తూ ప్రదీప్‌చంద్ర కమిటీ బుధవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించిందని కేసీఆర్ చెప్పారు.
 
 ఉద్యోగుల సూచనల మేరకు సర్వీస్ రూల్స్
 
 ఒకే శాఖలో పలు వ్యత్యాసాలతో వందల స్కేళ్లు ఉంటే ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సర్వీసు రూల్స్ కూడా భారీ పుస్తకాలుగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉద్యోగులు చీటికిమాటికి కోర్టుకు వెళ్లకుండా సర్వీసు రూల్స్‌ను సరళీకృతం చేస్తామన్నారు. తమది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమైనందున వారి సమస్యలపై అభిప్రాయాలు తీసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని సర్వీస్ రూల్స్‌లో పొందుపరుస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణతో ప్రభుత్వంపై అదనంగా రూ. 6500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఆ మాత్రం వెసులుబాటు సర్కారుకు ఉంటుందన్నారు. ఒక గంట ఎక్కువ పనిచేసైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం కోరారు. ‘‘ముఖ్యంగా ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖలు కొంచెం కష్టపడాలి. జీతాలు పెంచుకోవడమే కాదు.. దాన్ని నిలబెట్టుకోవాలి. బకాయిల వసూలు.. ఆదాయం పెంచుకునేందుకు కష్టపడాలి. ఉద్యోగులు ఆ హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి ఆదాయాన్ని పెంచుకుంటాం. ఈ మాత్రం భారాన్ని మా ప్రభుత్వం భరించగలుతుంది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 ఇది గ్రేట్ పీఆర్‌సీ..
 
 2013 జనవరి నుంచి పీఆర్‌సీ అమలు కావాల్సి ఉన్నా.. అప్పడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం లేదని కేసీఆర్ అన్నారు. గత జూన్ 2 తర్వాతే రాష్ర్టం ఏర్పాటైనందున అప్పటి నుంచే పీఆర్‌సీ అమలుకు నిర్ణయించామన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన తొలి పీఆర్‌సీ ఇది. పాత రాష్ట్రం, పాత పీఆర్‌సీతో సంబంధం లేదు. ఇది గ్రేట్ పీఆర్‌సీ’ అని సీఎం వ్యాఖ్యానించారు. పీఆర్‌సీ సిఫారసుల కంటే ఎక్కువ ఇచ్చిన ఉదంతాలు గతంలో చాలా ఉన్నాయన్నారు. సిఫారసులకు కట్టుబడి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే అన్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని పరిస్థితులను, ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఎంతో కొంత కలిపి ఇస్తుంటాయని, ఆ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement