సిద్దిపేటలో అరుదైన శస్త్రచికిత్స | rare surgery in siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో అరుదైన శస్త్రచికిత్స

Published Sat, May 3 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

rare surgery in siddipet

 సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: వైద్యో నారాయణ అని ఊరికే అనలేదు. ప్రాణాలను రక్షించినందుకే డాక్టర్లను రోగులు దేవుడిగా కొలుస్తారు. సిద్దిపేట వైద్యులు ఆపదలో ఉన్న ఓ మహిళారైతుకు ప్రాణ భిక్ష పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన మహిళా రైతు డి. విజయ (52) తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం సిద్దిపేట మాతాశిశు సంరక్షణ కేం ద్రం పక్కన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన హైరిస్క్ సెంటర్‌కు వచ్చింది. పేద రైతు కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యసేవలను కొనుగోలు చేయలేక ప్రభుత్వ డాక్టర్లను ఆశ్రయించారు.

 వైద్యులు ఆమె కడుపు కుడి భాగాన్ని స్కానింగ్ చేయగా భారీ కణతి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యుల అనుమతితో శుక్రవారం ఆమెకు హైరిస్క్ సెంటర్‌లో ఆరోగ్య శ్రీ పథకం కింద గైనకాలజిస్ట్ డా. ఆరుణ, అనస్తిషియా డా. కృష్ణారావులు కేంద్ర ఇంచార్జ్ డా. కాశీనాథ్ నేతృత్వంలో ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి  ఐదున్నర కిలోల కణితిని బయటకు తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఆపరేషన్‌ను  చేచడం ఇదే మొదటిసారి.  దీంతో ప్రభుత్వ ఆసుపత్రులపై    భరోసా కలిగిందని చెప్పవచ్చు.

 సర్కార్ ఆసుపత్రి సరికొత్త రికార్డ్
 మెదక్ జిల్లాలో సర్కార్ ఆసుపత్రి ప్రసవాలు చేయడంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రైవేట్ ఆసుపత్రుల జోరుకు కుదేలవుతున్న సర్కార్ ఆసుపత్రులను బలోపేతం చేసి పేద రోగులకు భరోసానివ్వడానికి కలెక్టర్ స్మిత సబర్వాల్ మార్పు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సిద్దిపేటలో హై రిస్క్ కేంద్రం ప్రారంభమైంది. ఆధునిక సదుపాయాలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి తక్కువ సమయంలో ఆదరణ పొందింది. ఏప్రిల్ నెలలో 101 రిస్కీ ప్రసవాలను చేశారు. జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఈ స్థాయిలో ఆపరేషన్ చేయడం మొదటిసారి. ప్రతి రోజు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులు భారీగా  వస్తున్నారు. ఆసుపత్రి ప్రగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని అభినందించారు.  ఆసుపత్రి  ఇన్‌చార్జి డా. కాశీనాథ్ మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

 
 ఆధునిక పరికరాలు ... ఏసీ గదులు
 సిద్దిపేట హై రిస్క్ కేంద్రంలో మరో 20 బెడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 3 ఏసీ గదులను, ఈసీజీ మిషన్‌ను, డిప్రిబ్‌లేటర్, డిజిటల్ ఫీటల్ డప్లర్ ( గర్భస్థ శిశువు గుండె కదలికల నమోదు యంత్రం) పరికరాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. వీటితో పేద గర్భిణులకు మరింత మంచి వైద్య సేవలను అందించే అవకాశం కలుగుతుంది.   - డా. కాశీనాథ్, హై రిస్క్ సెంటర్ ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement