సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’ రెండో దశ పోటీలను నవంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రాథమిక దశ పోటీలు పాఠశాలల్లో ముగిశాయి. 20,000 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొనగా దాదాపు 4,000 మంది రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. నిర్వాహకులు ఎంపిక చేసిన కేంద్రాల్లో రెండో రౌండ్ రాత పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు 9వ తేదీన సంబంధిత కేంద్రానికి చేరుకుని సాక్షి టీవీ లైవ్‌లో ప్రసారమయ్యే పదాలను విని రాతపరీక్ష రాయాలి. బీ మాస్టర్ విక్రమ్ 30 పదాలను ఉచ్చరిస్తారు. ఒక్కో పదాన్ని ఆయన మూడుసార్లు పలుకుతారు. విద్యార్థులు జాగ్రత్తగా విని స్పెల్లింగ్ రాయాలి. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది. పరీక్షకు స్కూల్ యూనిఫామ్‌లోనే రావాలి.
కలం లేదా పెన్సిల్, పరీక్ష రాసేందుకు ప్యాడ్, పరీక్షలో పాల్గొనేందుకు ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలి. టిఫిన్, త్రాగునీరు విద్యార్థులే ఏర్పాటు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్షా కేంద్రం చిరునామా, ఇతర వివరాల కోసం సాక్షి జిల్లా కార్యాలయాలను సంప్రదించవచ్చు.
9న పరీక్షా షెడ్యూల్ ఇదీ
కేటగిరీ - 1 వారికి: ఉదయం 10.15 గంటలకు
కేటగిరీ - 2 వారికి: మధ్యాహ్నం 12.15 గంటలకు
కేటగిరీ - 3 వారికి: మధ్యాహ్నం 2.15 గంటలకు
కేటగిరీ - 4 వారికి: సాయంత్రం 4.15 గంటలకు