సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2018–19లో గణనీయ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపింది. గతేడాది 82.75 శాతం పీఎల్‌ఎఫ్‌తో 8,698 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. అందులో 8,211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసింది. ఒక ఏడాది ఓ విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిపిన విద్యుదుత్పత్తిని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) అంటారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సరఫరా చేసిన 8 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు అనగా సెప్టెంబర్ 2018, ఫిబ్రవరి 2019లో 100 శాతానికి పైగా పీఎల్‌ఎఫ్ సాధించింది. 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు పలు మార్లు నూరుశాతం పైబడి పీఎల్‌ఎఫ్ సాధించాయి.
యూనిట్–2 గత ఆర్థిక సంవత్సరంలో 5 సార్లు అనగా జూలై, సెప్టెంబర్, అక్టోబర్‌లతో పాటు 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నూరుశాతం పీఎల్‌ఎఫ్ సాధించింది. స్టేషన్‌లో గల యూనిట్–1 గత ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు అనగా సెప్టెంబర్ 2018, నవంబర్ 2018, ఫిబ్రవరి 2019లో నూరుశాతం పీఎల్‌ఎఫ్ సాధించడం విశేషం. 2018–19లో ప్లాంటులోని మొదటి యూనిట్ 4,455.09 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దీనిలో 4,203.42 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది.
రెండో యూనిట్ 4,243.39 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దీనిలో 4,007.60 మిలియన్ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకూ 22,523.11 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా దానిలో 21,161.17 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందించింది. ఈ క్రమంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2017–18లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకును సాధించింది. 2018–19లో స్టేషన్ సాధించిన ప్రగతిపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
సింగరేణి పీఎల్‌ఎఫ్ 82.75 శాతం!
Published Wed, Apr 3 2019 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment