సాక్షి, హైదరాబాద్: ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకోగలరు.... అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై అచ్చమైన తెలంగాణ యాసలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ విరుచుకుపడనూగలరు... నేటి యువతరం మెచ్చే మోడ్రన్ రాజకీయ నాయకుడిగా, సామాన్యులకు నచ్చే మాస్ లీడర్‌గా ఎదిగిన ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులైన సందర్భంగా ఆయన వ్యక్తిగత, రాజకీయ నేపథ్యం క్లుప్తంగా...
అమెరికా కొలువు వదిలి ఉద్యమం వైపు...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో తన తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడంతో ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించేందుకు కేటీఆర్ 2006లో అమెరికాలో తాను చేస్తున్న ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చారు. యూపీఏ–1లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ 2006లో రాజీనామా చేసి కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దిగగా కేటీఆర్ ఆయనకు చేదోడుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అనంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేసిన తన ప్రత్యర్థిపై 171 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం 2010 జూలైలో కేటీఆర్ సహా 10 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ 68,219 ఓట్ల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని పలుమార్లు అరెస్టు అయ్యారు. ఎన్నో ఉద్యమ కేసులను ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
రాష్ట్రానికి పెట్టుబడుల్లో కీలకపాత్ర...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రిగా సమర్థంగా పనిచేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆతిథ్యమిచ్చిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులను దిగ్విజయంగా నిర్వహించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయా సదస్సుల్లో ఆయన చేసిన ప్రసంగాలకు విశేష ఆదరణ లభించింది. దేశ, విదేశాల్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదుస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టీ–హబ్ ఐటీ ఇంక్యుబేటర్ వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ఊతమిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా సైతం పని చేసి తనదైన ముద్రవేశారు. కేరళను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలనా సంస్కరణలను అమలు చేసేందుకు కృషి చేశారు. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకొని 150 స్థానాలకుగాను 99 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేశారు. అలాగే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 50 వరకు ప్రచార సభలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment