బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
తాండూరు: ఇటీవల వరకు రాకపోకలు సాగించిన బస్సును అధికారులు బంద్ చేయడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సోమవారం తాండూరు ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద బస్సులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈక్రమంలో ఓ బస్సు అద్దం స్వల్పంగా దెబ్బతిన్నది. సదరు బస్సు డ్రైవర్ విద్యార్థులతో వాదనకు దిగటంతో పరస్పరం తోపులాట జరిగింది. వివరాలు.. గతంలో పెద్దేముల్ మండలం నాగులపల్లికి తాండూరు నుంచి బస్సు సౌకర్యం ఉండేది. గ్రామం నుంచి సుమారు 60 మంది విద్యార్థులు నిత్యం పట్టణానికి వస్తుంటారు. ఇటీవల గ్రామానికి బస్సు సర్వీస్‌ను అధికారులు బంద్ చేశారు. దీంతో నిత్యం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సర్వీస్‌ను పునరుద్దరించాలని విద్యార్థులు, గ్రామస్తులు ఆర్టీసీ డీఎంకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో సోమవారం సాయంత్రం విద్యార్థులు తాండూరులోని బస్టాండ్ అవుట్ గేట్‌వద్ద ఆందోళనకు దిగడంతో బస్సులు ఆగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తాండూ రు అర్బన్ సీఐ వెంకట్రామయ్య సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్య ఉన్నా బస్సులను ఆపడం తప్పని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని సీఐ వారికి నచ్చజెప్పారు. ఆయనతో కూడా విద్యార్థులకు వాగ్వాదానికి దిగారు. సీఐ అధికారులతో మాట్లాడి నాగులపల్లికి బస్సు వేయించారు. దీంతో ఆందోళన విరమించారు. సమస్యను పరిష్కరిస్తామని సీఐ విద్యార్థులకు హామీ ఇచ్చారు.