సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. అలాగే చీఫ్‌విప్, విప్ పదవులను కూడా భర్తీ చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని భావిస్తున్న ఐదుగురిని అందుబాటులో ఉండాలని కూడా ఇప్పటికే సూచించినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం), కొండా సురేఖ(వరంగల్), ఎ.ఇంద్రకరణ్ రెడ్డి(ఆదిలాబాద్), జూపల్లి కృష్ణారావు(మహబూబ్‌నగర్), అజ్మీరా చందూలాల్(వరంగల్)కు మంత్రివర్గంలో బెర్త్‌లు ఖాయమని తెలుస్తోంది. కాగా, మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్లు, మంత్రి పదవుల హామీ పొంది ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన వారు తమ ప్రయత్నాలను తీవ్రం చేశారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాడే 12 మందితో(సీఎంగా కేసీఆర్ సహా) రాష్ర్ట మంత్రివర్గం ఏర్పాటైంది. తొలి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని ఆశించిన పలువురు సీనియర్లకు మంత్రివర్గ విస్తరణ ద్వారా అవకాశం కల్పిస్తామని అప్పుడే(ఆరు నెలల క్రితమే) సీఎం హామీనిచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమాల సందర్భంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేశామని, తమకే కేబినెట్‌లో అవకాశం కల్పించాలని పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అత్తెసరు సీట్లతో ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి తమను పార్టీలోకి ఆహ్వానించారని, ఆ సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు వాదిస్తున్నారు. తెలుగుదేశం నుంచి చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ పార్టీ మారిన దృష్ట్యా సాంకేతికంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యంకాదంటున్నారు. అయితే, కేబినెట్ పదవికి సమాన హోదా ఉండే మరో పదవి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మరో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి హెచ్‌ఎండీఏ వైస్‌చైర్మన్ పదవి ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రేసులో ఉన్నదెవరు?
ఆరు మంత్రి పదవుల భర్తీకి అవకాశముండగా ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావుకు అవకాశం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వెంకట్రావుకు విప్ పదవితో సరిపెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటిదాకా మంత్రివర్గంలో చోటులేదు. ఈ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సిలకా్ష్మరెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లా నేతల్లో మహిళగా తనకు అవకాశమిస్తారని కొండా సురేఖ విశ్వాసంతో ఉండగా.. ఇదే జిల్లా నుంచి చందూలాల్, డి.వినయ్‌బాస్కర్ కూడా పదవులు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ పోటీపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లానుంచి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నల్లాల ఒదేలు, మహిళా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, రేఖా నాయక్ ప్రయత్నిస్తున్నారు. ‘పార్టీ ఆవిర్బావం నుంచి ఎన్నోత్యాగాలు చేసి, విశ్వాసంగా పనిచేసిన నాకు మంత్రివర్గంలో అవకాశం రాకుంటే అంతకన్నా అవమానం ఉంటదా? నాకు చోటు రాకుంటే ఈ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా’ అని ఒక సీనియర్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో వ్యాఖ్యానించడం గమనార్హం.
త్వరలో కేబినెట్ విస్తరణ!
Published Wed, Dec 10 2014 2:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement