* రూ.35 వేల కోట్ల ప్రణాళికా వ్యయంతో బడ్జెట్
* ఎన్నికల హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ రూపకల్పన
* ప్రణాళికేతర వ్యయం తగ్గించే దిశగా కసరత్తు
* సమగ్ర సర్వే వివరాలతో తేలనున్నఅర్హులు, అనర్హుల సంఖ్య
* ఆ ప్రకారమే నిధుల కేటాయింపు.. ఫలితంగా తగ్గనున్న ప్రణాళికేతర వ్యయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. హడావుడిగా కాకుండా ఎన్నికల హామీలను తీర్చడమే లక్ష్యంతో బడ్జెట్ రూపొందించాలని స్థూలంగా నిర్ణయించారు. ఈ మేరకు భారీగానే కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ జాప్యం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రణాళికేతర వ్యయాన్ని కట్టడి చేయడంతోపాటు అభివృద్ధికి కేంద్ర బిందువైన ప్రణాళికా వ్యయాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయానికి రూ.35 వేల కోట్లు కేటాయించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందులో సాగునీటి రంగానికి రూ.4 వేల కోట్లు కేటాయించనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులను కూడా ఈసారి రాష్ట్ర వార్షిక ప్రణాళికలోనే చూపించనున్నారు. మరోవైపు ప్రణాళికేతర వ్యయాన్ని భారీగా తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే ఇందుకు కీలకం కానుంది.
ఎన్నికల హామీల మేరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచాల్సి ఉంది. వీటితోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీకి కేటాయింపులన్నీ కూడా ప్రణాళికేతర వ్యయం కిందకే వస్తాయి. సమగ్ర సర్వే వివరాలు వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులెవరో, అనర్హులెవరో తేలిపోతుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య కూడా తెలుస్తుంది. అప్పుడు పింఛన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్, సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీలకు ఎన్ని నిధులు అవసరమవుతాయో పక్కాగా లెక్క తేలుతుంది.
అలాగే ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్న గృహాలకు అర్హులెంత మందో కూడా సర్వే ద్వారా నిర్ధారితమవుతుంది. దీంతో ఈ లెక్కలన్నీ తేలాక వాటికి ఎంతమేరకు నిధులు అవసరమవుతాయో, అంతమేరకే బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారు. దీనివల్ల ప్రణాళికేతర వ్యయం భారీగానే తగ్గుతుందని చెబుతున్నారు. ఇక్కడ వ్యయం తగ్గడంతో మిగిలిన నిధులను అభివృద్ధి పథకాలకు ప్రణాళికా వ్యయంలో కేటాయింపులు చేస్తారు.
ఒక్క కార్డుతోనే అన్ని సదుపాయాలు..
ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్ కార్డులనేవి వేర్వేరుగా ఉండవు. పేదలకు బీపీఎల్ అని రాసి ఉన్న గులాబి రంగు కార్డును, పేదలు కాని వారికి ఏపీఎల్ అని రాసిన గులాబి రంగు కార్డును ఇస్తారు. బీపీఎల్ అని రాసి ఉన్న కార్డుతోనే రేషన్, పింఛన్, ఆరోగ్యశ్రీ సదుపాయాలను పొందవచ్చు. అలాగే కీలక రంగాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీలు.. ఆయా రంగాల్లో అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నాయి.
ఆ ప్రణాళికల ద్వారా ఇప్పటి నుంచి వచ్చే ఐదేళ్లలో అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. హమీలను నెరవేర్చడానికి నిధులు కొరత రాకూడదంటే సంక్షేమానికి వెచ్చించే నిధులు అర్హులైన పేదలకు మాత్రమే చేరాలని, అనర్హులను సంక్షేమ పథకాల నుంచి తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధి నిధిని కొనసాగించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి అధికార వర్గాలు ఫైలు పంపించాయి.
పక్కాగా ‘ప్లాన్’!
Published Mon, Sep 8 2014 12:51 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement