ఉద్రిక్తంగా ‘చలో హైకోర్టు’
- పలువురు న్యాయవాదుల అరెస్ట్.. విడుదల
సాక్షి, హైదరాబాద్: ‘చలో హైకోర్టు’ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. హైకోర్టు విభజన కోరుతూ ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హైకోర్టు సాధన సమితి చైర్మన్ ఎం.సహోదర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు సునీల్ గౌడ్, జావెద్, సమితి కో కన్వీనర్ గోవర్థన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చలో హైకోర్టు కార్యక్రమానికి రెండు రోజుల క్రితమే హైకోర్టు సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు.
హైకోర్టుకు వస్తున్న కింది కోర్టుల న్యాయవాదులు పలువురిని పోలీసులు మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి డబీర్‌పురా, బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ వద్ద హైకోర్టు సాధన కమిటీ చైర్మన్ ముద్దసాని సహోధర్‌రెడ్డి, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడగానే ఆర్టికల్ 214 ప్రకారం హైకోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రా హైకోర్టు ఏర్పాటు చేయాలనడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాగా, న్యాయవాదుల అరెస్ట్‌కు నిరసనగా శనివారం నాటి జాతీయ లోక్‌అదాలత్‌ను బహిష్కరించాలని సహోధర్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
విధులకు దూరంగా ఉండండి...
అలహాబాద్‌లో ఓ న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేసిన నేపథ్యంలో సోమవారం విధులకు దూరంగా ఉండాలని హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో న్యాయవాదులను కోరారు.