రూ.1,000 కోట్లు తీసుకోవాలని వ్యవసాయశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ)కు రూ. 1000 కోట్ల నాబార్డు రుణం తీసుకోవాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అయితే ఆ నిధులను ఉద్యాన సంస్థ కోసం కాకుండా సూక్ష్మ సేద్యం సబ్సిడీ కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ సబ్సిడీ ఇస్తుండడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. లక్షల దరఖాస్తులు నిధులు లేక పెండింగ్‌లో ఉన్నాయి. పైగా కేంద్రం నుంచి నిధులు తగ్గాయి. ఈ నేపథ్యంలో నాబార్డు నుంచి రూ. 1000 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. నాబార్డు నుంచి ఇంత మొత్తం రుణం నేరుగా తీసుకోవడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నందున ఉద్యాన సంస్థ ద్వారా తీసుకొని సూక్ష్మ సేద్యానికి మరలించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే నాబార్డు రుణాన్ని బడ్జెట్‌లోని సూక్ష్మసేద్యం పద్దులో ప్రస్తావించలేదని తెలిపారు. పైగా ఉద్యానాభివృద్ధి సంస్థ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో ఇంకా ఖరారు కాలేదు.