ముప్పుతిప్పలు పెడుతున్న మూడు వైరస్‌లు | Three Viruses In Country Are Causing People A Lot Of Trouble | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పలు పెడుతున్న మూడు వైరస్‌లు

Published Mon, Apr 27 2020 2:16 AM | Last Updated on Mon, Apr 27 2020 10:38 AM

Three Viruses In Country Are Causing People A Lot Of Trouble - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మూడు రూపాల్లో విరుచుకుపడుతూ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఊపిరాడనివ్వకుండా ముప్పేట దాడి చేస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా వ్యాపిస్తూ మానవాళిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో కాస్త తక్కువగా ఉంది. కొన్నిచోట్ల వైరస్‌తో చనిపోయేవారి శాతం అధికంగా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీని బారినపడిన వారు వేగంగా కోలుకుంటుంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా కోలుకుంటున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో కరోనా కేసుల్లో మరణాల రేటు 4.23 శాతంగా ఉంది. పైగా అక్కడ అత్యధికంగా 7,628 కేసులు నమోదయ్యాయి. కేరళలో మరణాల రేటు 0.88 శాతమే. తెలంగాణలో 2.62%గా ఉంది. మేఘాలయలో తక్కువ కేసులున్నా మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా 8.33 శాతం ఉంది. ఆ తర్వాత పంజాబ్‌లో 5.70 శాతం ఉంది. (బయట తిరిగితే క్వారంటైన్కే ! )

21 శాంపిళ్ల జన్యు నమూనాలు.. 
చైనాలోని వూహాన్‌లో కరోనా పురుడుపోసుకుంది. ఆ తర్వాత ప్రపంచదేశాలకు పాకి వణికిస్తోంది. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలో ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంది. కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా, మరికొన్ని దేశాల్లో ఇంకో విధంగా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు 1,563 శాంపిళ్ల నుంచి కరోనా వైరస్‌ జీనోమ్‌ (జన్యు నిర్మాణం)లను రూపొందించారు. వాటి ఆధారంగా మన దేశంలో 21 శాంపిళ్ల నుంచి వైరస్‌ జీనోమ్‌లను తయారు చేశారు. వాస్తవంగా మన దేశంలో 303 కేసులను 41కు కుదించి, వాటి నుండి 21 శాంపిళ్ల జన్యు నమూనాలు రూపొందించారు. అందులో వూహాన్‌కు చెందినవి రెండు ఉండగా, ఇటలీ, ఇరాన్‌ దేశాలకు చెందినవి 19 ఉన్నాయి. ఈ 21 శాంపిళ్లలో కామన్‌ లక్షణాలను గుర్తించారు. వాటి మధ్య సారూప్యత 99.97 శాతంగా ఉంది. ఇలా కరోనా వైరస్‌ జీనోమ్‌లపై పరిశోధనలు జరిగాయి. నెక్టŠస్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ పద్ధతిలో ఈ పరిశోధనలు జరిగాయి. చదవండి: వందేళ్ల క్రితం ఏం జరిగింది..? 

5 రకాలు.. 3 గ్రూపులు
పరిశోధనలో భాగంగా 21 శాంపిళ్లను శాస్త్రవేత్తలు ఐదుగా విభజించారు. 
– ఉహాన్‌ నుంచి వచ్చిన భారతీయులు.. వీరిలో కేరళకు చెందిన వారున్నారు.
– ఇరాన్‌లో ఉండే భారతీయులు.. వీరి శాంపిళ్లను సేకరించారు.
– ఇటలీ వెళ్లొచ్చిన భారతీయులు. వీరు ఇటలీ వాళ్లను కలవడం వల్ల వచ్చిన పాజిటివ్‌ కేసులు.
– ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన పర్యాటకులు. వారు రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల్లో తిరిగారు.
– ఆగ్రాలో నమోదైన కేసులు. వీరు ఇటలీ వెళ్లొచ్చారు. వారి కుటుంబసభ్యుల శాంపిళ్లను సేకరించారు.

పై ఐదు రకాలను ‘ఇటలీ, వూహాన్‌ (చైనా), ఇరాన్‌’అనే మూడు గ్రూపులుగా విభజించారు. ఈ మూడు దేశాలకు చెందిన 21 జీనోమ్‌లకు కోడ్‌ కేటాయించారు. వూహాన్‌కు ‘వీ’, ఇటలీకి ‘జీ’, ఇరాన్‌కు ‘ఎస్‌’అనే కోడ్‌ ఇచ్చారు. ఇక జీ (ఇటలీ) గ్రూపులోనూ రెండు ఉప గ్రూపులను గుర్తించారు. వాటిలో ఒక గ్రూపు.. భారతదేశానికి వచ్చిన ఇటాలియన్‌ టూరిస్టులు. వీరిలో వూహాన్‌ వైరస్‌ ఉండటంతో పాటు స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లండ్‌కు దగ్గరగా వీళ్ల జీనోమ్‌లు ఉన్నట్లు గుర్తించారు. మరో ఉప గ్రూపు.. ఆగ్రాతో కాంటాక్ట్‌ అయినవారు. వీరి జీనోమ్‌ను పరిశీలించగా బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌ జీనోమ్‌లకు దగ్గరగా ఉన్నాయి.

ఇరాన్‌కు చెందిన ‘ఎస్‌’కోడ్‌లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా సహా ఆగ్నేయాసియా దేశాల జీనోమ్‌లకు దగ్గరగా ఉన్నాయి. ఇటలీ, వూహాన్‌ జీనోమ్‌ల్లో దగ్గరి పోలికలు ఉన్నాయి. వాటి మధ్య తేడా 0.01 శాతంగా ఉంది. ఇరాన్‌ జీనోమ్‌కు, వూహాన్‌కు 0.024 శాతం తేడా ఉంది. ఈ తేడా ఎక్కువ ఉండటం వల్ల ఇరాన్‌ జీనోమ్‌ వల్ల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఎక్కువ దేశాల్లోని కేసులు ఇటలీ జీనోమ్‌కు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో మాత్రం ఇరాన్‌ జీనోమ్‌తో ఎక్కువగా ప్రభావితమైంది. అమెరికా కూడా అదే జీనోమ్‌తో ప్రభావితమైంది. ఇరాన్‌తోనే మర్కజ్‌ కేసులు వచ్చాయని, దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇరాన్‌లో మొదట్లో అధికంగా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.
 
కరోనాలో మొత్తం 9,860 ఎమినోయాసిడ్స్‌
ప్రపంచంలో 30 రకాల కోవిడ్‌–19 వైరస్‌లున్నాయి. అందులో మన దేశంలో మూడు రకాలున్నాయి. అయితే వాటి మధ్య కొద్దిపాటి తేడాలున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వైరస్‌ వ్యాప్తి, మరణాలు, రికవరీ రేట్లు ఉన్నాయి. జీనోమ్‌లో జీన్స్‌ ఉంటాయి. జీన్స్‌లో ప్రొటీన్‌ ఉంటుంది. కరోనా వైరస్‌లో 27 రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ప్రొటీన్‌లో ఎమినోయాసిడ్స్‌ ఉంటాయి. కరోనా వైరస్‌లో మొత్తం 9,860 ఎమినోయాసిడ్స్‌ ఉన్నాయి. ఎమినోయాసిడ్స్‌ వల్లనే శరీరంలో మార్పులు వస్తాయి. ఎమినోయాసిడ్స్‌ జీన్స్‌లో ఉండే స్థితినిబట్టి వాటిని మూడు రకాల వైరస్‌లుగా ఇండియాలో గుర్తించారు. ఈ పరిశోధనలను ఇంకా కొనసాగించాల్సి ఉంటుందని, ఈ మూడు రకాల వైరస్‌ల కారణంగానే దేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాపి, మరణాలు, రికవరీ రేటులో తేడా కనిపిస్తోందని నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదల విశ్లేషించారు. 

దేశంలో 3 రకాల వైరస్‌ల దాడి
కరోనా వైరస్‌ ఒక్కోచోట ఒక్కోవిధంగా వ్యాపించడానికి గల కారణాలను భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ప్రపంచవ్యాప్తంగా 30 రకాల విభిన్న లక్షణాలున్న కరోనా వైరస్‌లుంటే, భారతదేశంలో మూడు రకాల వైరస్‌లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఒక వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తుందని గుర్తించారు. అందుకు సంబంధించి ఎన్‌ఐవీ, ఐసీఎంఆర్, ఎయిమ్స్‌లు ఇటీవల కరోనా వైరస్‌పై సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. పరిశోధన వివరాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐజేఎంఆర్‌) రెండ్రోజుల క్రితం ప్రచురించింది. చదవండి: సంపన్నులపై ‘కరోనా’ పన్ను! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement