వేడెక్కిన మున్సిపల్ రాజకీయం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపోల్స్ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రత్యర్థులను చిత్తు చేసి ఎలాగైనా ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగానే ఏ వార్డు నుంచి ఎవరికిస్తే బాగుంటుందంటూ ఇప్పటికే వివరాలు సేకరించాయి. కానీ ప్రత్యర్థి పార్టీలు ఎవరిని బరిలో దించుతాయో తెలియక తమతమవుతున్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీలో తలెత్తింది. నామినేషన్‌ల పర్వం ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేకపోయాయి. మైనార్టీ వర్గాల మద్దతు బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూసి ఆతర్వాత ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయిస్తామని ఆయా పార్టీల నేతలు వారి అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది.
విజయమే లక్ష్యంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ తరఫున నిలిపేందుకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే కార్యకర్తల ద్వారా వివరాలను సేకరించారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక బీజేపీ సోమవారం 9 వార్డుల్లో పోటీ చేయనున్న వారి జాబితాను ప్రకటించగా, ఇప్పటికే సీపీఐ 6 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఒక కౌన్సిలర్ స్థానాన్ని దక్కించుకున్న సీపీఎం ఈ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లోనైనా పోటీ చే సేందుకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
ప్రకటిస్తే...తిరుగుబాటు తప్పదా!
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడే కౌన్సిలర్‌గా పోటీచేసే వారి జాబితా ప్రకటిస్తే టికెట్ దక్కని వారు తిరుగుబాటు చేస్తారని ఆ పార్టీ భావిస్తోంది. అందువల్లే నామినేషన్ స్వీకరణకు చివరిరోజున బీఫారాలు అందజేయనున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ సైతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. నేతల మధ్య నెలకొన్న విభేదాల వల్ల ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది. దీంతో పలువురు టీఆర్‌ఎస్ నేతలు తామే అభ్యర్థులమంటూ ప్రచారం ప్రారంభించారు. ఇక టీడీపీ మాత్రం అభ్యర్థుల వేటలో ఉంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో మిగతా పార్టీల నుంచి వచ్చే వారిపైనే ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అవసరమైతే వైఎస్సార్ సీపీకి మద్దతు
ఈ ఎన్నికల్లో గెలుపు, ఓటములను శాసించే ఎంఐఎం స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. అయితే బలంగాలేని చోట మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ పార్టీ పట్టణ కమిటీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ను ఓడించాలంటే వైఎస్సార్ సీపీకి మద్దతు ఇవ్వడం వల్లనే సాధ్యమవుతుందనే భావనలో ఎంఐఎం ఉంది. అందుకోసం ఇప్పటికే 12 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగితా చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులతో పాటు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించనున్నందున అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఆ పార్టీపైనే పడిందని చెప్పవచ్చు.
జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా శ్రవణ్‌కుమార్‌రెడ్డి
త్వరలో జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా దుబ్బాకకు చెందిన డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డిని నియమించింది.
వైఎస్సార్ సీపీపైనే నజర్
Published Tue, Mar 11 2014 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement