రాష్ట్రంలో తుగ్లక్ పాలన
హైదరాబాద్: రాష్ట్రంలో అనైతిక, తుగ్లక్ పాలన కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతోనే రాష్ట్ర మంత్రివర్గం నిండిపోయిందన్నారు. మిగిలిన పదవులను టీడీపీ నేతలతోనూ, తెలంగాణ వ్యతిరేకులతోనూ నింపేశారని మండిపడ్డారు. ఆదివారం టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, తమ ఆకాంక్షలను నెరవేరుస్తారనే ఆశతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కుటుంబసభ్యులకే మంత్రి పదవులు ఇచ్చుకున్నారని.. మిగిలిన పదవులను టీడీపీ నేతలతో, తెలంగాణ వ్యతిరేకులతో నింపేశారని ఉత్తమ్ మండిపడ్డారు. కేబినెట్‌లో ఒక్క కేసీఆర్ కుటుంబానికే 40 శాతం పదవులు దక్కాయన్నారు. కేసీఆర్‌కు తన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తప్ప మాదిగలు, మాలలు, మహిళల్లో సమర్థులే కనిపించలేదా? అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ సర్కారు నమ్మక ద్రోహం..
రాష్ట్రంలో అనైతిక, తుగ్లక్ పాలన సాగుతోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నాయకులను ప్రలోభపెట్టి, డబ్బులిచ్చి పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎక్కడా ఇలాంటి ఘోరమైన, అనైతిక పాలన చూడలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు పింఛన్లు, రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్... ఇప్పుడు నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని, రెండు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా కొత్త కమిటీలను వేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
భారీ ర్యాలీ.. గన్‌పార్కులో నివాళి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున వాహనాల ర్యాలీని నిర్వహించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలు పొన్నాల, జానారెడ్డి, డీఎస్, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్‌తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ర్యాలీ అసెంబ్లీ ముందుకు చేరుకున్నాక గన్‌పార్కులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజలను మోసగిస్తున్నారు: భట్టి
రాష్ట్రాన్ని నలుగురు కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా పాలిస్తూ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని.. తెలంగాణ ఇచ్చినందుకే కాంగ్రెస్‌పై కేసీఆర్ కక్షగట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో విశ్వాసం, నమ్మకం, అభిమానం ఉన్నాయని భట్టి చెప్పారు. కొత్త నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
అంతా ఐక్యంగా పనిచేస్తే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం నెరవేరుతుందని సీనియర్ నేత డి.శ్రీనివాస్ అన్నారు. కొత్త నాయకులకు అన్ని వర్గాల నేతలు సహకరించాలని మరో సీనియర్ నేత జైపాల్‌రెడ్డి సూచించారు. అనంతరం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, మల్లు భట్టి విక్రమార్కను మహిళా కాంగ్రెస్ నేతలు సన్మానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు ఆర్.సి.కుంతియా, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్, బలరాం నాయక్, సర్వే, సుఖేందర్‌రెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ, సునీ తాలక్ష్మారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.