దేశ విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర: ఉత్తమ్
ఘనంగా కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు.
టీఆర్‌ఎస్ కుట్రలను, అప్రజాస్వామిక పోకడలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో ఈ సందర్భంగా వాహనాల ర్యాలీని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.