సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధిని కొన్ని సర్కారీ విభాగాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికమొత్తంలో నిధులు కేటాయించి భారీ లక్ష్యాల్ని నిర్దేశించినప్పటికీ, వాటి అమలును పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనుల పురోగతి అంతంతమాత్రంగానే ఉంటోంది. గిరిజనుల కోసం అమల్లో ఉన్న ఉప ప్రణాళికను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2017–18 నుంచి గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.8,165.87 కోట్లు కేటాయించింది.
42 శాఖల ద్వారా ఈ నిధులు వినియోగించేలా లక్ష్యాలు నిర్దేశించింది. పక్కా ప్రణాళిక, కఠిన నిబంధనలతో ఎస్టీ ఎస్‌డీఎఫ్ అమల్లోకి తెచ్చినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు ఈ నిధిపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేటా యించిన నిధులనుంచి పైసా ఖర్చు చేయకపో వడంతో గిరిజన అభివృద్ధి మంద గించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగుస్తుండగా ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద కేవలం రూ.3,624.95 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది లక్ష్యంలో కేవలం 44.39 శాతమే పురోగతి సాధించడం గమనార్హం.
పైసా ముట్టని 15 శాఖలు..
ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి పథకం కింద ప్రాధాన్యత ఉన్న ప్రతి విభాగాన్ని ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలో 42 శాఖలను నిర్దేశిస్తూ నిధులు కేటాయించింది. అయితే నిర్దేశించిన శాఖల్లో 15 విభాగాలు పైసా కూడా ఖర్చు చేయలేదు. పంచాయతీరాజ్ (హెచ్‌ఓడీ), ఈఎన్‌సీ బిల్డింగ్ అండ్ సీఆర్‌ఎఫ్, పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, రిలీఫ్, టీఎస్‌ఐడీసీ, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, హోమ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సెక్రటరీ), మార్కెటింగ్, లేబర్, గ్రౌండ్ వాటర్, మైనర్ ఇరిగేషన్, ఫారెస్ట్ విభాగాలు కేటాయించిన నిధులను పైసా కూడా ఖర్చు చేయనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఈ శాఖలకు సుమారు రూ.160 కోట్లు కేటాయించినా.. నిధులు ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి గణాంకాలు సమర్పించలేదు.
నూరు శాతం కష్టమే...
కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద కేటా యించిన మొత్తాన్ని నూరు శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏదేనీ సందర్భంలో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చుకాకపోతే వాటిని వచ్చే ఏడాదికి వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది కేటాయించిన మొత్తంలో ఇప్పటి వరకు 44.39 శాతం మాత్రమే ఖర్చు చేశారు. మరో మూడు నెలల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. అయితే మూడు నెలల్లో పూర్తిస్థాయి నిధులు ఖర్చు చేస్తాయా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment