జెడ్పీ ఎన్నిక ఏకగ్రీవం
నల్లగొండ :జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని ఉదియాదిత్య భవనంలో జెడ్పీ పాలక వర్గానికి ఎన్నిక నిర్వహించారు. జిల్లాలోని 59జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 43స్థానాల్లో కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీ సాధించింది. దీంతో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ 30మంది సభ్యులు కాగా కాంగ్రెస్‌కు మరో 13 స్థానాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు శనివారం జరిగిన పాలకవర్గం ఎన్నికకు టీడీపీకి చెందిన ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, సీపీఐ జెడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.
తొలుత కో ఆప్షన్ పదవులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. వీరిలో సిరాజ్‌ఖాన్, శౌరయ్య నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ.. షేక్ బాషామియా, గోపు రాజారెడ్డిలకు బీఫాం జారీ చేసింది. దీంతో ఏవైపు నుంచి కూడా పోటీ లేకపోవడంతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు కో ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. జిల్లా పరిషత్ తొలి చైర్మన్ జీఎస్ రెడ్డి తనయుడు గోపు రాజారెడ్డికి క్రిస్టియన్ మైనార్టీ కోటా కింద కోఆప్షన్ హోదా కల్పించారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు ఎన్నికల అధికారి జెడ్పీటీసీ సభ్యులను తెలుగు అక్షర క్రమంలో వేదిక మీదకు ఆహ్వానించి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం పాలక వర్గాల ఎన్నికను ప్రారంభించారు.
చైర్మన్‌గా బాలూనాయక్.. వైస్‌చైర్మన్‌గా కర్నాటి
జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బాలూనాయక్, వైస్ చైర్మన్ అభ్యర్థిగా కర్నాటి లింగారెడ్డి పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పాటు బీఫాం జారీ చేసింది. దీంతో బాలూనాయక్ పేరును దామరచర్ల జెడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్ ప్రతిపాదించగా, గుండాల జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి బలపర్చారు. అదే విధ ంగా వైస్ చైర్మన్ లింగారెడ్డి పేరును దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ ప్రతిపాదించగా..మఠంపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు నీల బలపర్చారు. ఈ పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు పాలక వర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాలూనాయక్, వైస్ చైర్మన్‌గా కర్నాటి లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి, రవీంద్రనాయక్, భాస్కర్‌రావు, వేముల వీరేశం, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సన్మానాలు.. సంబురాలు
జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డిలను కలెక్టర్ చిరంజీవులు, జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలూనాయక్‌ను ఎంపీ గుత్తా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులకు, ఎన్నికైన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. సభా ప్రాంగణం బయట పార్టీ కార్యకర్తలు, శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.