కరెంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం
నల్లగొండ : తెలంగాణలో కరెంటు కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు నెలల పసిపాపగా ఉందని, కరెంటు కోతలతో సంబంధం లేదన్నారు. రైతులు కేసీఆర్ దిష్టిబొమ్మలకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్నారు.
విద్యుత్ కోతల కారణంగా రైతులు ధర్నాలు చేస్తే పోలీసులు లాఠీలు ఎత్తవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇళ్లు, రేషన్‌కార్డులలో అవినీతికి పాల్పడ్డారని, వారి పాపాలను టీఆర్‌ఎస్ మోయవద్దనే ఉద్దేశంతోనే విచారణలు చేపడుతున్నట్టు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జానారెడ్డి మంత్రిగా అధికారంలో ఉన్నా ఫ్లోరైడ్ విముక్తి కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసుశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ 340 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
చంద్రబాబు, వెంకయ్యనాయుడు అన్యాయం చేశారు..
ఖమ్మం జిల్లాలోని ఏడు గిరిజన మండలాలను ఆంధ్రా ప్రాంతంలో కలిపి చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు అన్యాయం చేశారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడేళ్లు వర్షాలు లేక రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. ప్రస్తుతం కూడా ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇక్కడే తిష్టవేసి ఉన్నందువల్లనే వర్షాలు రావడం లేవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి : మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డివిద్యుత్ విషయంలో ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బఫూన్‌లాగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. విద్యుత్ విషయంలో రైతాంగం ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.