చర్చ లేదు.. తీర్మానం లేదు..
సాక్షి, సంగారెడ్డి: చర్చ లేదు.. తీర్మానం లేదు..ఏదో జరపాలంటే జరపాలన్నట్టు జెడ్పీ స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించేశారు. సుదీర్ఘవిరామం అనంతరం నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులు డుమ్మాకొట్టి సిబ్బందిని పంపడంతో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. మొక్కుబడిగా సాగిన ఈ సమావేశాల్లో సభ్యులు ముఖ్యమైన సమస్యలేవీ ప్రస్తావించలేదు.
జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, వైస్‌చైర్మన్ సారయ్య అధ్యక్షత వ్యవసాయం, జి. సుమన అధ్యక్షతన స్త్రీ శిశు సంక్షేమం స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. మూడు స్థాయీ సంఘ సమావేశాల్లో శాఖల వారీగా సమగ్ర చర్చలు జరగలేదు. ప్రజలు, రైతులు ఇతర వర్గాలు వారు ఎదుర్కొంటున్న కరెంటు కరువు, సామాజిక పింఛన్‌లు, ఆహారభద్రత కార్డుల జారీ తదితర సమస్యలను లేవనెత్తి వాటిపై లోతుగా చర్చించలేకపోయారు. సమావేశంలో ఎలాంటి తీర్మానాలు సైతం చేయలేదు.
కరువు ప్రకటనే లేదు
వర్షాభావం, కరెంటు కోతల కారణంగా పంట నష్టాన్ని చవిచూస్తున్న రైతులు, మెతుకు సీమను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ కరువు ప్రకటనపై పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. అయితే మంగళవారం జరిగిన వ్యవసాయ స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు రైతులు సమస్యలను పెద్దగా ప్రస్తావించలేదు. కరువు ప్రకటనపై కనీసం మాట్లాడలేదు. కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రైతులకు సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలనీ, రబీలో విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులకు రుణాలు ఇవ్వటం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో వైస్ చైర్మన్ సారయ్య స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని, రైతులకు అన్ని చేస్తున్నామని తెలిపారు. దీంతో అసహనానికి గురైన జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తాను రైతుల సమస్యలు లేవనెత్తానని, వాటిని సద్విమర్శలుగా తీసుకోవాలని హితవు పలికారు. ఇదిలావుంటే స్థాయీ సంఘ సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులు పలువురు గైర్హాజరయ్యారు. డీఆర్‌డీఏ పీడీ, హౌసింగ్ పీడీ, డీఐసీ జీఎం, డీసీఓ, మార్కెటింగ్ ఏడీ ఇలా పలువురు అధికారులకు సమావేశానికి డుమ్మా కొట్టారు.
ఆయా శాఖల అధికారులు తమ శాఖల కింది స్థాయి అధికారులను స్థాయీ సంఘ సమావేశాలకు పంపారు. దీంతో వారు సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు ఎవరూ రాలేదు. దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్పందిస్తూ, స్థాయీ సంఘ సమావేశాలకు ఇకపై జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోండి
పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ రాములుగౌడ్ కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన జరిగిన గ్రామీణాభివృద్ది స్థాయీ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పటాన్‌చెరు ప్రాంతంలో పరిశ్రమల కారణంగా జల, వాయు కాలుష్యం అధికమవుతోందని, కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి పథకాల నిర్వహణకు తమ వాటా కింద విడుదల చేయాల్సిన నిధులు అందేలా చూడాలన్నారు. సమావేశానికి కాలుష్యనియంత్రణ మండలి అధికారులు హాజరు కాకపోవడంతో జెడ్పీసీఈఓ ఆశీర్వాదం మాట్లాడుతూ, జెడ్పీ, సమావేశాలకు కాలుష్యనియంత్రణ మండలి అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న డ్వామా పీడీ, డీపీఓ ఇతర అధికారులు తమశాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
విత్తనాలు సరఫరా చేయండి
రబీలో రైతులకు అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. జెడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య అధ్యక్షతన జరిగిన వ్యవసాయ స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విత్తనాలతో పాటు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని తాను పలుమార్లు కోరినా అధికారులు స్పందించటం లేదన్నారు. జేడీఏ హుక్యా నాయక్ స్పందిస్తూ, రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనంతరం డీఎఫ్‌ఓ సోనిబాలదేవి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొక్కల పెంపకానికి 453 నర్సరీలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటనున్నట్లు వివరించారు. స్త్రీ శిశు సంక్షేమం స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు ముక్తార్, సంగమేశ్వర్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.