అగ్నిప్రమాదం : 23 మంది సజీవ దహనం
కైరో : ఈజిప్టు కాల్బియ్యా ప్రావిన్స్ ఎల్ ఎబోర్ నగరంలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా బుధవారం వెల్లడించింది. క్షతగాత్రులు నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. ఫర్నీచర్ తయారీకి మండే స్వభావం గల పదార్థాలను ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. దాంతో మంటలు సెకన్ల కాలవ్యవధిలో ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయని తెలిపారు.
అయితే మంటలు ఆర్పడానికి 23 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని... భారీగా ఎగసి పడుతున్న అగ్నికీలలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయని ఈజిప్టు హోం శాఖ మంత్రి వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆదేశ హోం శాఖ మంత్రి వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల చోటు చేసుకుందని భద్రత అధికారులు వెల్లడించారని స్థానిక మీడియా పేర్కొంది.