మిస్ జపాన్‌గా ప్రియాంక.. అసంతృప్తి!
భారత సంతతికి చెందిన అందాల సుందరి ప్రియాంక యోషికవా 'మిస్ జపాన్' కిరీటాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన జాతీయ అందాల పోటీలో ఆమెను ఈ కిరీటం వరించింది. అయితే, ప్రియాంక పూర్తిగా జపనీయురాలు కాదని, ఆమెకు ఎలా ఈ అందాల కిరీటాన్ని ప్రకటిస్తారని పలువురు జపనీయులు జాత్యాంహకారపూరిత వ్యాఖ్యలతో నిరసన తెలుపుతున్నారు.
గత ఏడాది కూడా ఇదేవిధంగా నల్లజాతీయురాలైన ఆరియనా మియామోటో 'మిస్ జపాన్'గా ఎంపికైంది. దీనిపై స్థానికంగా పెద్ద నిరసన వ్యక్తమైంది. జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ పలువురు అందాల పోటీలను తీరును ఖండించారు. ఆమె 'హాఫ్' జపనీయురాలంటూ, ఆమెకు 'మిస్ జపాన్' అయ్యే అర్హత లేదంటూ చెలరేగిపోయారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా విమర్శలు వస్తున్నా ప్రియాంక వాటిని లక్ష్యపెట్టడం లేదు. తనకు ముందు 'మిస్ జపాన్'గా నిలిచిన ఆరియనా తనకు ఆదర్శమని, ఆమె బాటలో సాగుతూ తాను ఈ కిరీటాన్ని దక్కించుకున్నానని ప్రియాంక స్పష్టం చేశారు.
ప్రియాంక యోషికవా టోక్యోలో పుట్టారు. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి జపనీయురాలు. బహుళ జాతుల వారసత్వం కలిగిన అమ్మాయిలు జపాన్‌లో వివక్షకు గురవుతున్నారని, ఆ సాంస్కృతిక వివక్షపై పోరాడి అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు తాను పోరాడుతానని వృత్తిరీత్య కిక్ బాక్సర్ కూడా అయిన యోషికవా తెలిపారు. తమ తండ్రి స్వస్థలం కోల్‌కతా అని, తన తాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడని ఆమె చెప్పారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో తన తాత మహాత్మాగాంధీని కోల్‌కతాలోని తన ఇంటికి ఆహ్వానించి.. రెండు రోజుల బస ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.