బంగారం దిగివచ్చేఛాన్స్....!
పసిడి దిగుమతి ఆంక్షలపై సమీక్ష
మార్చికల్లా చేపడతామన్న చిదంబరం
క్యాడ్ కట్టడిపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటన
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యంలో భాగంగా పసిడి దిగుమతులపై విధించిన ఆంక్షలను మార్చి నెలాంతానికల్లా సమీక్షిస్తామని ఆర్థికమంత్రి పీ చిదంబరం వెల్లడించారు. అయితే క్యాడ్ కట్టడి విషయంలో ఏర్పడే భరోసా ప్రాతిపదికననే దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని సైతం ఆయన స్పష్టం చేశారు. కస్టమ్స్ డేను పురస్కరించుకుని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం పన్ను శాఖ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఈ కీలక అంశాన్ని వెల్లడించారు. సుంకాలను తగ్గిస్తే... ఆ మేరకు దేశంలో బంగారం ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఒత్తిళ్ళు పనిచేస్తున్నాయ్..?
పసిడి దిగుమతులపై దేశంలో ఉన్న 10 శాతం కస్టమ్స్ సుంకం వల్ల అంతర్జాతీయ ధరతో పోల్చి చూస్తే... ఇక్కడ ధర 10 గ్రాములకు దాదాపు రూ.3 వేల వరకూ అధికంగా ఉంది. దీనివల్ల స్మగ్లింగ్ కార్యకలాపాలు అధికమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన ఆభరణాల తయారీదారులు తీవ్ర పోటీని ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది. పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనీ, పసిడి దిగుమతులను ఎగుమతులతో ముడిపెడుతున్న నిబంధనను సవరించాలన్న ఆభరణాల ఎగుమతిదారుల విజ్ఞప్తిని పరిశీలించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశారు. అంతకుముందు బంగారం దిగుమతిపై 10 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 2 శాతానికి తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపార సమాఖ్య సోనియాకు రాసిన ఒక లేఖలో కోరింది. అలాగే 80:20 నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేసింది. 80:20 నిబంధన ప్రకారం అంతకుముందు దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని ఎగుమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు.
స్మగ్లింగ్ సమస్య నిజమే...
దిగుమతుల సుంకాల పెంపు వల్ల దేశంలోకి బంగారం స్మగ్లింగ్ పెరుగుతున్న మాట నిజమేనని ఆర్థికమంత్రి సోమవారం అంగీకరించారు. అయితే క్యాడ్ కట్టడి ఆవశ్యకత నేపథ్యమే సుంకాల పెంపునకు కారణమని వివరించారు.
బంగారం లెక్కలు ఇవీ...
ఏప్రిల్, మేలలోనే దేశంలోకి ఏకంగా దాదాపు 300 టన్నుల బంగారం దిగుమతయ్యింది. దీనితో ఆందోళన చెందిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఈ విలువైన మెటల్ దిగుమతుల ఆంక్షలను కఠినతరం చేశాయి. దీనితో పసిది దిగుమతుల పరిమాణం దిగి వచ్చింది. ఏప్రిల్‌లో 142.47 టన్నులు, మేలో 161.38 టన్నులు జరిగిన దిగుమతులు... తదుపరి నెలలు జూన్ (31.46 టన్నులు), జూలై (47.75 టన్నులు), ఆగస్టు (3.38 టన్నులు), సెప్టెంబర్ (11.16 టన్నులు), అక్టోబర్ (23.5 టన్నులు), నవంబర్ (19.3 టన్నులు)ల్లో కనిష్ట స్థాయిలకు పడ్డాయి. 2010-11లో దేశం మొత్తం దిగుమతుల పరిమాణం 970 టన్నులు. 2011-12లో ఈ పరిమాణం 1067 టన్నులకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం 845 టన్నులకు తగ్గింది. అయితే 2013-14లో ఏప్రిల్-నవంబర్ మధ్య 440.4 టన్నుల పసిడి మాత్రమే దిగుమతి అయ్యింది.