మోనాలిసా ముఖంలో విషాదం!
బెర్లిన్: అందమైన ముఖం... అబ్బురపరిచే నవ్వు.. ఎంత చూసిన తనివితీరని కళ్లు.. ఇవన్నీ కలగలిపిన అందాల చిత్రం మోనాలీసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రం గురించి తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అలాంటి మోనాలీసా చిత్రం వెనుక మరో అమ్మాయి బొమ్మ ఉందని ఇటీవలే ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్త చెప్పగా... మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ తమ పద్ధతుల్లో ఈ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. తాజాగా జర్మనీలోని ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా తమదైన విశ్లేషణను తెరమీదకు తెచ్చారు.
మోనాలిసా ముఖంలో అందరికీ సంతోషమే కనిపిస్తున్నప్పటికీ అందులో ఆమె బాధపడడం కూడా ఉందంటున్నారు. ఇందుకోసం మోనాలిసా పెదవుల చివరి భాగాలను కొద్ది కొద్దిగా పైకీ కిందకు వంచుతూ ఎనిమిది రకాల పెయింటింగ్స్ రూపొందించారు. వాటిని ఒరిజినల్ పెయింటింగ్స్‌తో కలిపి చూసినప్పుడు ఆశ్చర్యకరంగా మోనాలిసా బాధపడుతున్న సంకేతాలు కూడా కనిపించాయి. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలిసా నిజంగా మోనాలిసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు.