ఐటీ ఈ-ఫైలింగ్ షురూ...
న్యూఢిల్లీ: కొన్ని రకాల పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అదేవిధంగా పన్ను చెల్లింపు లెక్కలను సులువుగా సరిచూసుకోవడం కోసం కొత్త ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను రేట్లలో మార్పుచేర్పులకు అనుగుణంగా కాలిక్యులేటర్‌లోనూ మార్పులు చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. జీతాలు, వడ్డీ రూపంలో ఆదాయం లభించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్-1(సహజ్), ఇతర వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబాలు), భాగస్వామ్య సంస్థల కోసం ఐటీఆర్-4ఎస్(సుగమ్) ఈ-ఫైలింగ్‌ను ఆరంభించినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి చెప్పారు.
త్వరలోనే ఇతర ఐటీఆర్‌లను కూడా ఐటీ శాఖ పోర్టల్(http://incomtaxindiaefiling.gov.in) లో ఉంచుతామని తెలిపారు. ఐటీఆర్ ఫారాల్లో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలన్న నిబంధనను గతేడాది ఐటీ శాఖ కొత్తగా విధించడంతో వివాదం చెలరేగడం తెలిసిందే. దీంతో సరళీకరించిన ఐటీఆర్ ఫారాలను ప్రవేశపెట్టారు. ఈసారి మార్చి 30నే కొత్త ఐటీఆర్ ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకూ గడువు ఉంటుంది.