చైనాలా వాన కురిపించాలి!
వాయుసేన సాయంతో మేఘమథనం
పర్యావరణవేత్త కె.పురుషోత్తమ్ రెడ్డి
హైదరాబాద్: వాతావరణం మారిపోతోంది. గత రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల పరిస్థితులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నడి వేసవిలో కుండపోత వర్షాలు, వానాకాలంలో మాడుపగిలే ఎండల్ని ఈ ఏడాది చూస్తున్నాం. ఈ పరిస్థితికి కారణమేమిటి? ఈ దుష్ర్పభావాలను తగ్గించుకోలేమా? రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు పెరుగుతున్న నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డుల పనితీరు ఎలా ఉండాలి? చాలామందిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమరెడ్డి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయం నుంచి ఇప్పటిదాకా అనేక పర్యావరణ సంబంధిత అంశాలపై ఉద్యమాలు నడిపిన ఆయన ఇటీవలే జస్టిస్ కుల్‌దీప్ సింగ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేపిటల్ ఫౌండేషన్ సంస్థ దేశంలో పర్యావరణ ఉద్యమకారులకు అందించే ఈ మేటి అవార్డును అందుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు..
దేశంలో భిన్నమైన పరిస్థితి
‘వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులను దశలవారీగా ఉపసంహరించడం, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో సౌర, పవన శక్తి వంటివి ఎక్కువగా వాడటం ఇలాంటివే. అయితే మనదేశంలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అందరూ వద్దనుకుంటున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులను మనం ఇప్పుడు పెద్ద ఎత్తున చేపడుతున్నాం. దీంతోపాటు మన వ్యవసాయ పద్ధతులు కూడా అంత బాగాలేవు. ఇంకోవైపు వాహనాలు విచ్చలవిడిగా పెరిగిపోతుండడం వల్ల నగరాల్లో హీట్ ఐలాండ్స్ ఏర్పడి ఉష్ణోగ్రతలు భరించలేనంత స్థాయికి చేరుకుంటున్నాయి’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా తరహాలో..
‘ఈ ఏడాది అటు రాయలసీమ, ఇటు దక్షిణ తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి పరిస్థితి ఉంటోంది. వీటిని ఆదుకునేందుకు వెదర్ మాడిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, వాటి ఆధ్వర్యంలో మేఘమథనం చేపట్టాలని మేం ఎప్పటినుంచో సూచిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జాతీయస్థాయిలో ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయాలి. రుతుపవనాల సీజన్‌లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మబ్బులు ఉంటాయి. మేఘమథనంతో వీటిద్వారా వానలు కురిపించాలి. చైనా ఈ విషయంలో ఎన్నో విజయాలు సాధించింది కూడా. దాదాపు 55 వేల మంది సిబ్బంది, యుద్ధవిమానాలు, రాకెట్ లాంచర్లను ఉపయోగించి వీరు మేఘమథనం జరుపుతున్నారు. మనం కూడా భారత వాయుసేన సాయంతో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలి. వ్యవసాయ, ఇరిగేషన్ నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఈ ప్రాజెక్టును చేపట్టాలి’ అని పురుషోత్తమ్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.