టమాటాలతో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు
- స్పెయిన్ ‘టొమాటినో ఫెస్ట్’కు పోటెత్తిన పర్యాటకులు
బునోల్(స్పెయిన్): ఏడాదికోసారి జరిగే టొమాటినో ఫెస్ట్‌కు జనం పోటెత్తారు. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో బుధవారం ప్రారంభమైన వేడుక పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఇటీవల కాటలోనియాలో జరిగిన దాడుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఉదయం 11 గంటలకు సైరన్ మోగిన వెంటనే దాదాపు గంటపాటు అర్థనగ్నంగా టొమాటోలతో కొట్టుకున్నారు. ఇందుకోసం దాదాపు 160 టన్నుల టమాటాలను ట్రక్కుల్లో తరలించారు. సుమారు 22వేల మంది ఈ ఏడాది టొమాటినో ఫెస్ట్‌లో పాల్గొన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశీ పర్యాటకులే కావటం గమనార్హం. విదేశీయులు మాత్రం పండుగలో పాల్గొనేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
72 ఏళ్లుగా జరుగుతున్న ‘టొమాటినో’ ప్రపంచంలో అతిపెద్ద పంటల పండుగ అనే భావన ఉంది. ఈ పండుగను చూసి కొలంబియా, కొస్టారికా, చిలీ, అమెరికా దేశాల్లోనూ ఇలాంటి ఉత్సవాలే జరుపుకుంటున్నారు. బునోల్‌సిటీ హాల్‌లో జరిగే ఈ పండుగ ప్రశాంతంగా జరుగటానికి పోలీసులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొవటానికి అంబులెన్స్‌లు, ఫైర్ ఫైటర్లు, పోలీసులను సిద్ధంగా ఉంచారు. వాహనాల రాకపోకలపై పూర్తి నిఘా ఉంచారు.