సిద్దూకు ఆప్ షాకిచ్చిందా!
చండీగఢ్: 'స్వాతంత్ర్యదినోత్సవం నాడు (ఆగస్టు 15న) సిద్దూ అధికారికంగా చీపురు పడతారు' అని ఇన్నాళ్లూ వార్తలు విన్నాం. ఆగస్టు 15 వెళ్లిపోయింది. కానీ సిద్దూ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదు. పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని వాగ్ధానం పొందిన(!) సిద్ధూ జూన్ లో బీజేపీ రాజసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న కేజ్రీవాల్ శిబిరంలోకి చేరతారనుకున్న సిద్దూకు ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలిసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒకే టికెట్ దక్కుతుంది. అంటే పరోక్షంగా సిద్ధూ భార్యకు ఆప్ టికెట్ దక్కనట్లే. అయితే మాజీ క్రికెటర్ మాత్రం భార్య సీటు కోసం చాలా గట్టిగా పట్టుపట్టుతున్నారని, ఈ క్రమంలోనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని, గడిచిన రెండు వారాలుగా ఇరు పక్షాల మధ్య కనీసం మాటామంతీ చోటుచేసుకోలేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి.
ఆప్ వేసిన రాజకీయ గుగ్లీని తిప్పికొట్టే ప్రయత్నంలో సిద్దూ కాంగ్రెస్ లో చేరే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వినికిడి. అయితే దాదాపు గెలుపు అవకాశాలున్న ఆప్ ను కాదని, 'హస్తం'తో చేయికలపడం ఏమంత ఉపయోగం కాదని, ఈ విషయం సిద్దూకు కూడా తెలుసని, త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు తెరపడుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.