లౌకికవాదం.. సామ్యవాద ఆర్థిక విధానం
* ఇదే నెహ్రూయిజం: సోనియా
* కాంగ్రెస్ పునాదులు వీటిపైనే ఉన్నాయి
* ప్రస్తుతం కొందరు ఈ సిద్ధాంతానికి సవాలు విసురుతున్నారు
న్యూఢిల్లీ: సుదృఢ లౌకికవాదం, సామ్యవాద ఆర్థిక విధానాలే కాంగ్రెస్ పునాదులని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. ఈ పునాదులపైనే నెహ్రూయిజం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొందరు ఈ సిద్ధాంతానికి సవాలు విసురుతున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 50వ వర్ధంతి సందర్భంగా యమునా నది ఒడ్డున ఉన్న ‘శాంతివన్’లో ఆయనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహ న్‌సింగ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు పార్టీ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నాలుగు స్తంభాలపై నెహ్రూయిజం నిర్మితమైంది. ఒకటి.. ప్రజాస్వామ్య వ్యవస్థలు. రెండు.. సుదృఢ లౌకికవాదం. మూడు.. సామ్యవాద ఆర్థిక విధానాలు. నాలుగు.. అలీన విదేశాంగ విధానం. కాంగ్రెస్ సిద్ధాంతాలు కూడా వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది. కానీ ఈరోజు వీటికి కొందరు సవాళ్లు విసురుతున్నారు’’ అని అన్నారు.
అలాగని కాంగ్రెస్ 50 ఏళ్ల కిందటి నెహ్రూ సంప్రదాయక సిద్ధాంతాలను పట్టుకొని కూర్చోలేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతోందని వివరించారు. ‘‘ఈ దేశం ప్రజలందరిదని నెహ్రూ నమ్మారు. దేశ నిర్మాణం, వికాసం, చరిత్ర, నాగరకతలో పాలుపంచుకున్న వారందరికి ఈ దేశం చెందుతుందని విశ్వసించారు. దేశంలో మైనారిటీల హక్కులు కాపాడుతూ, వారి బాగోగులను చూడడం మెజారిటీ ప్రజల బాధ్యత అని చెప్పారు.