నితీశ్ మోసాల్లో మాస్టర్ | Nitish is a fraud Master | Sakshi
Sakshi News home page

నితీశ్ మోసాల్లో మాస్టర్

Published Mon, Oct 5 2015 1:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

నితీశ్ మోసాల్లో మాస్టర్ - Sakshi

నితీశ్ మోసాల్లో మాస్టర్

బిహార్ సీఎంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ధ్వజం
 
 పట్నా: బిహార్ తొలిదశ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎన్డీయే, మహా కూటమి పక్షాలు ప్రత్యర్థులపై విమర్శలను తీవ్రం చేశాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం జరిగిన  సభల్లో ఇరుపక్షాల నేతలు పాల్గొన్నారు. స్కామ్‌లకు, ఆటవిక పాలనకు ఆలవాలమైన కాంగ్రెస్, ఆర్జేడీలను భుజాలపై మోస్తూ బిహార్‌ను అభివృద్ధి చేయడం జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘యూపీఏ హయాం నాటి రూ. 12 లక్షల కోట్ల అవినీతితో కాంగ్రెస్, 15 ఏళ్ల ఆటవిక పాలనతో ఆర్జేడీ ఉన్నాయి. వాటిని మోస్తూ నితీశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలడు?’ అని ప్రశ్నించారు. మోసపూరిత రాజకీయాల్లో నితీశ్ నిపుణుడని, రామ్‌మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ, తాజాగా జతిన్ రామ్ మాంఝీలను ఆయన  మోసం చేశారని ఆరోపించారు.

నితీశ్, లాలూ ప్రసాద్‌ల మహాకూటమి అధికారంలోకి రావడమంటే రాష్ట్రంలో జంగిల్ రాజ్-2 ప్రారంభమయినట్లేనని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, అందువల్ల బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే బిహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందన్నారు. హిందువులు కూడా గోమాంసం తింటారన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై నితీశ్‌కుమార్, సోనియాగాంధీ తమ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ డిమాండ్ చేశారు. గోవుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. లాలూ వ్యాఖ్య యదు వంశీయులను(యాదవులు) అవమానించడమేనని బీజేపీ ఎంపీ హుకుందేవ్ ధ్వజమెత్తారు.

 బీజేపీని ఓడించండి: రాం జఠ్మలానీ
 పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆ పార్టీ మాజీ నేత, ప్రముఖ  న్యాయవాది రాం జఠ్మలానీ బిహారీలను కోరారు. ప్రధాని మోదీ సైనిక దళాలను, ప్రజలను మోసం చేశారని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీని ఓడించి, తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నితీశ్ సీఎం కావడం కోసం మహాకూటమిని గెలిపించాలన్నారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’కు డిమాండ్ చేస్తున్న మాజీ సైనికులను ఆయన ఆదివారమిక్కడ కలుసుకుని మద్దతిచ్చారు. ‘మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీల ఆటలో బలయ్యాను. ఎన్నికలకు ముందు వారికి మద్దతిచ్చి తప్పుచేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. నల్లధనవంతుల పేర్లు బయటికి రావాలంటే, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, అరుణ్‌జైట్లీలను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement