ఓ సెక్సువల్ అసాల్టర్!
నీ పేరేమిటో నాకు తెలియదు, అందుకే ఇలా సంబోధిస్తున్నా. నీ జీవితంలో ఎవరెవరున్నారో తెలియదు. నీ గురించి అసలు ఒక్క విషయం కూడా తెలియదు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు. నీవు లైంగికంగా నాపై దాడి జరిపేందుకు నన్ను చిత్ర హింసలు పెట్టావు. జుట్టుపట్టుకొని లాగావు. మోకాళ్లపై కూలేశావు. రక్షణ కోసం అరవొద్దంటూ నా తలను నేలకేసి కొట్టావు. నొసటి నుంచి రక్తం కారింది. నా బ్రాను చింపేశావు. ఇంకేమో చేయాలనుకున్నావు. ఇంతలో వీధిలో అలజడి మొదలైంది. భయపడి నీవు పారిపోయావు. మరో 20 నిమిషాల తర్వాత మరో అమ్మాయి వెంటబడి సీసీటీవీ కె మేరాల ద్వారా దొరికిపోయావు. నీపై కేసు దాఖలైంది. నీ పై విచారణ కొనసాగుతోంది.
వాస్తవానికి నీవు ఆరోజు లైంగికంగా దాడి జరిపింది నా ఒక్కదానిపైనే కాదు. నేనో కూతురుని. నేనో స్నేహితురాలిని. గర్ల్‌ఫ్రెండ్‌ను. నేనో శిష్యురాలిని. కజిన్‌ని. మేన కోడలిని. పొరుగింటిదాన్ని. నగరం నడిబొడ్డున కాఫీ షాప్‌లో చాయ్ అందించేదాన్ని. మేమంతా కలిసి ఒక కమ్యూనిటీ అవుతాం. మా అందరిలో ప్రతి ఒక్కరిపైనా నీవు లైంగిక దాడి జరిపావు. కానీ నేను, నాకు ప్రాతినిధ్యం వహించే వారు ఎదురు తిరిగి పోరాడతామన్న వాస్తవాన్ని నీవు విస్మరించావు.
నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డవాళ్లకన్నా మంచివాళ్లదే మెజారిటీ. చీకటి పడ్డాక ఇంటికి రావడం క్షేమదాయకం కాదని నా కమ్యూనిటీ అసలు భావించదు. మేము అభద్రతా భావంలో బతకదల్చుకోలేదు. ఎంత చీకటైనా సరే మేము మా వీధుల్లో ఒంటరిగానే నడుస్తాం. ఆఖరి రైలు పట్టుకొని ఇంటికొస్తాం. ఒకరోజు మేమంతా ఒక సైన్యంలా ఒక్కటవుతాం. మాలో ఎవరికి ఏమైనా మేము పోరాడతాం. మీలాంటి వాళ్లతో పోరాడతాం. అంతిమ విజయం మాదే.
-ఇట్లు
లోన్ వెల్స్
(ఏప్రిల్ 11వ తేదీన లండన్‌లో రైలుదిగి ఒంటరిగా ఇంటికెళుతున్న లోన్ వెల్స్ అనే 20 ఏళ్ల అమ్మాయిపై 17 ఏళ్ల యువకుడు అత్యాచారా యత్నానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన గురించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ పత్రిక ‘చెర్‌వెల్’కు బహిరంగ లేఖ రూపంలో లోన్ వెల్స్ దీన్ని రాసింది. ఈ లేఖను ‘నాట్ గిల్టీ’ కాలం కింద ఏప్రిల్ 24వ తేదీన ప్రచురించింది. ఇలాంటి దారుణ అనుభవాలు ఎవరికైనా ఉంటే పంపించండి ఈ కాలం కింద ప్రచురిస్తామంటూ ఆ పత్రిక తెలపడంతో అనేక మంది బాధితులు లేఖలు రాస్తున్నారు.)