న్యూఢిల్లీ: భారత్ -పాకిస్తాన్ ల ఎంఎఫ్ఎన్ (అత్యంత అనుకూల దేశం) అంశం కాస్తా వివాదాలకు దారితీస్తోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి ‘ఇరు దేశాలకు సమాన అవకాశాలు లభించే పరిస్థితి’ ఏర్పడాల్సి ఉందని పాకిస్తాన్ తాజాగా స్పష్టం చేసింది. మార్కెట్ ప్రవేశ సౌలభ్యం, పన్నులు, పన్నేతర అడ్డంకుల విషయంలో తమ ఆందోళనలపై భారత్ సానుకూల హామీ ఇవ్వాలని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇండియా- పాకిస్తాన్ జాయింట్ బిజినెస్ ఫోరం సమావేశం అనంతరం పాకిస్తాన్ హై కమిషన్ ఈ ప్రకటన విడుదల చేసింది.
భారత్‌కు పాకిస్తాన్ ‘అత్యంత అనుకూల దేశం హోదా ఇవ్వాల్సిన అంశంపై పాక్‌పై విధంగా స్పందించింది. అయితే, పాక్ వాదనను భారత్ తిప్పికొట్టింది. పాక్‌కు 1996లోనే భారత్ ఆ హోదా ఇచ్చిందని గుర్తుచేసింది. వాణిజ్య రంగంలో పరస్పర వృద్ధికి ఇప్పుడు ముందడుగు వేయాల్సింది పాకిస్తానేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా పాకిస్తాన్‌తో ఈ నెల 25న జరగనున్నాయని భావిస్తున్న విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విదేశాంగ కార్యదర్శిని పాక్‌కు పంపించడం వెనక భూమిక ఏమిటని ప్రశ్నించింది.