కావాలనే సెక్స్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు
- గోవా రాజకీయ పార్టీలపై కేజ్రీవాల్ ఫైర్
పనాజీ: సెక్స్ టూరిజం, వ్యభిచారం, మాదక ద్రవ్యాలకు గోవా అడ్డాగా మారిపోయిందని, ఈ అక్రమాలకు రాజకీయ పార్టీల ప్రాపకం, అధికార పెద్దల మద్దతు ఉందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవి గోవా పేరు ప్రతిష్టలను దిగజారుస్తున్నా.. రాజకీయ పార్టీల మద్దతు ఉండటం వల్లే నిరాటంకంగా సాగిపోతున్నాయని విమర్శించారు.
గోవా పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ బుధవారం పనాజీలో చిన్నస్థాయి హోటళ్లు, పర్యాటక పరిశ్రమ వాటాదారులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘సెక్స్, డ్రగ్స్, వ్యభిచారం వల్ల గోవాలో పర్యాటకానికి చాలా చెడ్డపేరు వస్తున్నది. ఈ అక్రమాలకు రాజకీయ పార్టీల అండ ఉండటం వల్లే దీనికి అడ్డుకట్ట పడటం లేదు’ అని కేజ్రీవాల్ అన్నారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ‘గోవా డైలాగ్స్’ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నది. ఈ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని ఆ పార్టీ చెప్తున్నది. గోవాలో మెజారిటీ సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కేజ్రీవాల్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నది.