న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణాలు మాఫీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న నిర్ణయం పాక్షికమే అయినా.. ఇది సరైన ముందడుగేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశంసించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న రైతులకు ఇదేవిధంగా ఊరట కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ విషయంలో బీజేపీ రాష్ట్రాల మధ్య వివక్ష చూపించడం సరికాదన్నారు. రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.
చిన్న, సన్నకారు రైతులు రూ. లక్ష కన్నా తక్కువగా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు మంగళవారం తన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూపీ రైతులు బ్యాంకులలో సుమారు రూ. 62వేల కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకోగా.. అందులో సన్నకారు రైతులు తీసుకున్న రూ. 30వేల కోట్లకుపైగా రుణాలను యోగి ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రూ. 6వేల కోట్ల వసూలుకాని రుణాలను కూడా మాఫీ చేసింది.
యోగి సర్కారుపై రాహుల్ ప్రశంసలు.. కానీ!
Published Wed, Apr 5 2017 2:50 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement