- రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: పెట్రోలియం శాఖతో పాటు మరికొన్ని శాఖలనుంచి రహస్యపత్రాలు బయటకు తరలిపోయిన అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ, వివిధ శాఖలనుంచి కార్పొరేట్ కంపెనీలకు రహస్య పత్రాలను లీక్ చేశారన్న వ్యవహారంలో ఇప్పటివరకు కేవలం జూనియర్ స్థాయి అధికారులను మాత్రమే అరెస్టు చేశారని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో బడా బాబులను కాపాడుతోందని ఆరోపించారు.
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ, అగర్వాల్ లేవనెత్తిన అంశంతోపాటు మిగతా విషయాలపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, కార్పొరేట్ గూఢచర్యం బయటపడిన డిపార్ట్‌మెంట్‌లతో సహా కీలక మంత్రిత్వ శాఖల్లోని అధికారిక కంప్యూటర్లు, సిబ్బందికి చేసే భద్రతా పరీక్షలపై కేంద్రం ఆడిట్‌కు ఆదేశించింది. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ నేతృత్వంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శాఖ, డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ల రక్షణాధికారిగా నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.