నిద్ర మధ్యలో వాట్సప్ మోగితే..?
మీరు అప్పుడే నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏ చిన్న అలికిడి అయినా వెంటనే మెలకువ వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు వాట్సప్‌లో ఏదైనా సందేశం వచ్చినట్లు నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తారు? కొన్ని గ్రూప్‌ల మెసేజ్‌లైతే మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా కాంటాక్టుల నుంచి వచ్చేవైతే మాత్రం తప్పనిసరిగా మోత తప్పదు. ఎంత కాదనుకున్నా దానివల్ల నిద్రాభంగం తప్పదు. ఇలా ఒక్క వాట్సప్ మాత్రమే కాదు, అనేక రకాల యాప్స్‌ను ఫోన్లలో వేసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్ల కారణంగా సగటున ఒక్కొక్కరికి గంటన్నర చొప్పున నిద్ర ఉండట్లేదని దక్షిణభారత దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) వైద్యులు చెప్పారు. ఫేస్‌బుక్ లేదా వాట్సప్, ఇతర న్యూస్ యాప్‌లు వాడటం వల్ల రోజుకు నీసం వంద నిమిషాల నిద్ర హుష్ కాకి అవుతోందని తమ పరిశోధనలలో తేలిందన్నారు. ప్రతిరోజూ నిద్రపోయే సమయం ఆలస్యం కావడంతో పాటు.. నిద్రమధ్యలో కూడా లేస్తున్నారని, దీనివల్ల మనిషికి పూర్తిగా కావల్సినంత నిద్ర ఉండట్లేదని చెప్పారు. ఈ పరిశోధన ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమైంది. నిద్రపోయేందుకు మంచం ఎక్కిన తర్వాత కూడా సగటున కనీసం నాలుగు సార్లు తమ ఫోన్ లేదా ట్యాబ్‌లను చూసుకుంటున్నారట. ఇలా సరిగ్గా నిద్ర లేకపోతే మెదడు బాగా అలిసిపోతుందని, అది ఏమాత్రం మంచిది కాదని అన్నారు.
మరి దీనికి మందేంటి?
నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఫోన్లు స్విచాఫ్ చేసుకోవాలని, లేదా కనీసం వై-ఫై / మొబైల్ డేటా అయినా ఆఫ్ చేయాలని, ఇంకా కుదిరితే సైలెంట్ మోడ్‌లో పెట్టుకుని పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరీ అత్యవసరం అయితే ఎటూ ఫోన్ చేస్తారు కాబట్టి, వైబ్రేషన్ వచ్చినా కూడా లేవచ్చని.. అంతేతప్ప నోటిఫికేషన్లు వచ్చినప్పుడల్లా ఫోన్ వైపే చూసుకుంటూ ఉంటే ఇక అసలు నిద్ర సరిగా ఉండదని చెప్పారు. దానివల్ల ఆందోళన దగ్గర నుంచి గుండె వ్యాధుల లాంటి రకరకాల సమస్యలు వస్తాయన్నారు.
ఎంత మంది.. ఏం చేస్తున్నారు?
58.5% మంది నిద్ర సమయంలో కూడా వాట్సప్ వాడుతున్నారని, ఆ తర్వాత 32.6% మంది ఫేస్‌బుక్ వాడుతున్నారని, ఇలాంటి మెసెంజర్ అప్లికేషన్లు కాక జీమెయిల్ లాంటి వాటిని 45.3% మందే వాడుతున్నారని అన్నారు. ఇంట్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఉన్నా, వాటితో పాటు మొబైల్ కూడా ఇంటర్‌నెట్ కోసం వాడుతున్నవాళ్లు 60 శాతం మంది ఉన్నారట. ఇంటర్‌నెట్ చూసేందుకు కొన్ని పనులను వాయిదా వేస్తామని 42 శాతం మంది చెప్పారు.