బలమైన బంధానికి మరింత సహకారం
- జపాన్ ప్రధానితో మోదీ చర్చలు
- నేడు ఒబామాతో భేటీ
వియంతైన్: ఉగ్రవాద వ్యతిరేక పోరు, పౌర అణు సహకారం వంటి రంగాల్లో పరస్పర సహకారంతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం లావోస్ చేరుకున్న మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని..ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని అబే చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపైనా వీరిద్దరిమధ్య చర్చలు జరిగాయి.
పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచ మార్కెట్‌కోసం వస్తువుల ఉత్పత్తి జరగాలని కూడా నిర్ణయించారు. జపాన్‌కు సాంకేతిక బలముంటే.. భారత్‌కు యువశక్తి బలం, భారీ మార్కెట్ ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు, పౌర అణుసహకార ఒప్పందం పురోగతిపై సమీక్ష జరిపారు. భారత్‌లో మౌలికవసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికవృద్ధి విషయాల్లో తమ సహకారం ఉంటుందని అబే తెలిపారు. అటు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ప్రధాని మోదీ లావోస్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ సమావేశమవుతారని వైట్‌హౌస్ తెలిపింది.