మోదీకి ఒబామా కితాబు
హాంగ్జౌ: ప్రస్తుతమున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్‌టీ) సాహసోపేత విధానమని అమెరికా అధ్యక్షుడు ఒబామా కితాబిచ్చారు. పన్నుల సంస్కరణకు కృషి చేసిన మోదీకి అభినందనలు తెలిపారు. జీ20 సమావేశాల సందర్భంగా ఒబామాతో మోదీ కాసేపు భేటీ అయ్యారు. క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సాహసోపేత సంస్కరణలకు జీఎస్‌టీ మార్గదర్శకంగా ఉంటుం దని ఒబామా కొనియాడారు. అంతకు ముందు మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సౌదీ అరేబియా యువరాజు సాల్మన్‌ను కలిశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సంస్కరణ, నావిక, మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై మాట్లాడారు. మరిన్ని శాశ్వత సభ్యత్వాలతో యూఎన్‌ఎస్‌సీని బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు.
ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు మద్దతు
మోదీకి ఆసీస్ ప్రధాని హామీ
హాంగ్జౌ: కీలకమైన అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ హామీ ఇచ్చారు. జీ20 సమావేశాల సందర్భంగా మోదీ టర్న్‌బుల్‌తో భేటీ అయ్యారు. ఎన్‌ఎస్‌జీలో మద్దతు ఇస్తామన్న టర్న్‌బుల్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. వేళ్లూనుకొంటున్న ఉగ్రవాదం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం సంబంధాలపై కూడా ఈ సమావేశంలో మోదీ, టర్న్‌బుల్ చర్చించినట్టు స్వరూప్ తెలిపారు. ‘ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసి ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భారత్ పొరుగు దేశాల పాలనా వ్యవస్థపై ఇది ప్రభావం చూపుతోంది. రష్యా, చైనా, అఫ్గనిస్తాన్‌లకు కూడా ఉగ్రవాద ముప్పు ఉంది.’ అని మోదీ టర్న్‌బుల్‌కు చెప్పారు.