22 మందిని పొడిచేసిన అమెరికన్ విద్యార్థి
అమెరికాలో ఓ విద్యార్థి కత్తులతో విరుచుకుపడ్డాడు. 21 మంది విద్యార్థులతో పాటు ఒక వ్యక్తిని పొడిచేశాడు. పాఠశాల సిబ్బందిపైన, విద్యార్థులపైన అతడు విరుచుకుపడినట్లు పెన్సల్వేనియాలోని ఓ హైస్కూలు సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన తర్వాత ప్రాథమిక పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటించామని, ఇతర పాఠశాలలకు భద్రత పెంచామని వెస్ట్మోర్లాండ్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ముర్రేస్విల్లెలో గల ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్ అనే 16 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు.
తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే అతడు దాడి మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి 20, 25 సెంటీమీటర్ల పొడవున్న రెండు కత్తులు తీసుకుని ఎడాపెడా పొడిచేశాడు. అతడి తలమీద చిన్నచిన్న గాయాలు ఉండటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో సమీపంలోని వైద్యకేంద్రాలకు తరలించారు. ముగ్గురికి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు, వారి బంధువులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సానుభూతి తెలిపారు.