కుక్కలను బంధించారని.. ఉద్యోగాలు పీకేశారు!
కుక్కలను బంధించి, చిత్రహింసలు పెట్టి బలవంతంగా అవి ఉన్నచోటు నుంచి వేరే చోట వదిలేసినందుకు ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోయాయి. జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్) అనే కార్పొరేట్ రియాల్టీ సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జంతు హక్కుల కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకుంది. పీపుల్స్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అనే సంస్థకు చెందిన నిరాలి కొరాడియా అనే మహిళ ఈ విషయాన్ని గుర్తించారు. జేఎల్ఎల్ నిర్వహణలో ఉన్న ఒక వాణిజ్య ప్రాంగణంలో ఉండాల్సిన కొన్ని కుక్కలు కనిపించడం లేదని ఆయేషా లో బో అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమె జంతువులకు ఆహారం ఇస్తుంటారని తెలిపారు. ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులే వాటిని బంధించి, చిత్రహింసలు పెట్టి వాటిని వేరే చోటుకు తీసుకెళ్లి వదిలేసినట్లు తేలింది.
దాంతో సంస్థ ఉద్యోగులు జూలియస్, జీకే జగతప్, కె. క్రునాల్ అనే ఇద్దరిపై తాము 15 రోజుల క్రితం అంధేరి పోలీసులకు ఫిర్యాదు చేశామని కొరాడియా చెప్పారు. ఈ విషయం గురించి జేఎల్‌ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా చెప్పామన్నారు. వెంటనే స్పందించిన సదరు కంపెనీ.. జూలియస్, జగతప్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించిందని, క్రునాల్ నేరుగా బాధ్యుడు కాడు కాబట్టి అతడిని వదిలిపెట్టారని అన్నారు. జంతువులను హింసించి లేదా హతమార్చినా ఏమీ కాదనుకునేవారికి ఇది గుణపాఠమని కొరాడియా తెలిపారు. వాళ్లు చిత్రహింసలు పెట్టిన కుక్కలు రెండూ చాలా ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా అయిపోయి, రేబిస్ వాక్సిన్లు కూడా వేశారని చెప్పారు. అవి మరీ అరిచేవి కూడా కాదని.. అయినా చదువుకున్న వాళ్లు కూడా ఇలా జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు.