పోలీస్‌స్టేషన్‌కు చేరిన సింధు - శిరీషల ప్రేమాయణం
⇒ మేమిద్దరం కలిసే జీవిస్తాం
⇒ వెల్లడించిన ఇద్దరు యువతులు
కమాన్‌పూర్(మంథని): కొద్దినెలలుగా చర్చనీయాంశంగా మారిన ఇద్దరి యువతుల ప్రేమాయణం వ్యవహారం కమాన్‌పూర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. ఆరునెలలు దూరం ఉంటామని అంగీకరించిన వారిద్దరూ రెండునెలలు గడవకముందే ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు. తమను విడదీయొద్దని..ఒకరిని విడిచి ఉండలేమంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శిరీష, సింధు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన దాసరి శిరీష.
రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన గుర్రాల సింధు ఓ పాఠశాలలో నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో సింధు, శిరీషలకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారు ఇంట్లో చెప్పకుండానే గడపదాటారు. ఈ క్రమంలోనే ఓ తెలుగు చానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము ఇద్దరం మహిళలమైనా కలిసి బతకాలనుకుంటున్నాంమని చెప్పారు.
అయితే ఇది ప్రకృతికి విరుద్ధమని, ఆరు నెలలు విడిగా ఉంటే మార్పు వస్తుందని నిర్వాహకులు సూచించడంతో ఒప్పుకున్నారు. రెండునెలలు దూరంగా ఉన్న వీరు మరోసారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శిరీష తండ్రి శంకర్ తన కూతురు కనిపించడంలేదని గతనెల10న కమాన్‌పూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శిరీష సెంటినరీకాలనీకి చెందిన సింధూతో వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సింధూ, శిరీష ఆచూకీ కోసం పోలీసులు గాలించగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాలలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం తెలుసుకొని తీసుకొవచ్చారు.
యువతులిద్దరూ తాము కలిసే జీవిస్తామని, విడదీయొద్దంటూ పోలీసులకు విన్నవించుకున్నారు. వారు మేజర్లు కావడంతో విచారించి అవసరమైన సమయంలో మళ్లీ పిలిస్తే రావాలని సూచించారు. అందుకు వారు అంగీకారం తెలిపి ఠాణానుంచి వెళ్లిపోయారు. దీంతో కొద్ది నెలలుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్న ఈ ఇద్దరి యువతుల ప్రేమ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది.