వలసల్ని దాచేస్తాం! | Underground network readies homes to hide undocumented immigrants | Sakshi
Sakshi News home page

వలసల్ని దాచేస్తాం!

Published Thu, Mar 2 2017 6:24 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

వలసల్ని దాచేస్తాం! - Sakshi

వలసల్ని దాచేస్తాం!

ట్రంప్‌ ముప్పు నుంచి అక్రమ వలసలకు అమెరికన్ల అభయం
- వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో కొత్త ‘నెట్‌వర్క్‌’
- వలసలకు డిపోర్టేషన్‌ నుంచి రక్షణ కల్పించేందుకు కృషి
- దేశవ్యాప్తంగా ప్రతిఘటన.. ‘ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం’ ఆవిర్భావం
- ఆశ్రయం ఇచ్చేందుకు ఇళ్లు, అంతస్తులు నిర్మిస్తున్న వైనం


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. దేశ ప్రజల నుంచి తీవ్ర ‘ప్రతిఘటన’ ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసలుగా జీవిస్తున్న వారికి అండగా నిలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను బలవంతంగా వారి దేశాలకు తిప్పిపంపే చర్యలకు ట్రంప్‌ సర్కారు ఉపక్రమించడంతో.. అటువంటి వారికి రహస్యంగా ఆశ్రయం కల్పించేందుకు నడుంకట్టింది.

ఆ లక్ష్యంతో వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ టీం’ అనే విభాగం ఏర్పాటయింది. మూవ్‌ఆన్‌.ఆర్గ్, ద ఇన్‌డివిజిబుల్‌ గైడ్‌, రెసిస్టెన్స్‌ క్యాలెండర్‌ వంటి సంస్థలు వందలాది ఇతర ప్రగతిశీల, మానవ హక్కుల సంఘాలు ఇందులో భాగమవుతున్నాయి. అక్రమ వలసలకు ఆశ్రయం ఇవ్వడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమైనా సరే.. తాము మంచి పని చేస్తున్నామని, దేనికైనా సిద్ధమని వారు తేల్చిచెప్తున్నారు.

 

అమెరికాలో పుట్టకపోయినా ఎన్నో ఏళ్ల కిందట వలసవచ్చి అక్కడే జీవితం గడుపుతున్న వారిలో సరైన పత్రాలు లేని వారిని గుర్తించి.. వారు శాంతియుతంగా జీవిస్తున్నా, వారిపై ఎలాంటి నేరాభియోగాలు లేకున్నా.. బలవవంతంగా వారి దేశాలకు తిప్పిపండం లక్ష్యంగా అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించడం ప్రారంభించింది. ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు, తమ పిల్లలకు దూరమవ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులూ దాపురిస్తున్నాయి. ఇటువంటి వలసవారిని ఇమిగ్రేషన్‌ అధికారుల కంట పడకుండా దాచిపెట్టి రక్షించడానికి గల మార్గాలను అన్వేషించడానికి ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ ప్రణాళిక రచించి కృషిచేస్తోంది.

మత సంస్థల్లోనూ సోదాలు చేసే అవకాశం: 1980ల్లో కూడా అమెరికాలో ఇటువంటి ఆశ్రయ ఉద్యమం సాగింది. తమ సొంత దేశాల్లో హింసను తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చిన సెంట్రల్‌ అమెరికా వలసలకు చాలా మత సంస్థలు ఆశ్రయం కల్పించాయి. ఇప్పుడు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ మరొక అడుగు ముందుకు వేసి ప్రయివేటు ఇళ్లలో ఆశ్రయం కల్పించేందుకు నడుం కట్టింది. దీనికి ఓ ముఖ్య కారణం ఉంది. ఫెడరల్‌ చట్టం ప్రకారం.. చర్చిలు, ప్రార్థనామందిరాలలో కూడా పోలీసు విభాగాల వారు సోదాలు నిర్వహించవచ్చు.

అయితే.. మత సంస్థలపై ఐసీఈ చర్యలపై పరిమితులు విధిస్తూ 2011లో హోంశాఖ విభాగం ఒక విధానాన్ని అమలులోకి తెచ్చింది. పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు వంటి సున్నిత ప్రదేశాలలోకి ప్రవేశించరాదని ఆదేశించింది. కానీ.. ట్రంప్‌ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వర్జీనియా రాష్ట్రంలోని అలెక్జాండ్రియాలో రైజింగ్‌ హోప్‌ మిషన్‌ చర్చ్ వద్ద ఆశ్రయం పొందతున్న కొందరు లాటినో పురుషులను డజను మంది ఫెడరల్‌ ఏజెంట్లు అకస్మాత్తుగా చుట్టుముట్టి, వారిని గోడలకు అదిమిపట్టి వారి వలస హోదాను తనిఖీ చేయడంతో.. వారు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయారు.

వారెంట్‌ ఉంటేనే ఇంట్లో సోదా..: ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేని వలసలు దాక్కునేందుకు వీలుగా కొత్త ఇళ్లు కొనడం, తమ సొంత ఇళ్ల మీద అంతస్తులు నిర్మించడం. ఎందుకంటే.. ప్రయివేటు ఇళ్లలోకి ప్రవేశించాలన్నా, సోదాలు చేయాలన్నా ఐసీఈ లేదా పోలీసు విభాగాల వారికి వారెంట్లు అవసరం. ఆ వారెంట్లు తీసుకుని వచ్చేలోగా ఆ ఇంట్లో తలదాచుకున్న వలసలను వేరొక చోటుకు తరలించేందుకు సమయం కూడా లభిస్తుంది. కానీ.. సరైన పత్రాలు లేని వలసలకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే.. ఈ కార్యకర్తలు కఠిన జరిమానాలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అలా అక్రమ వలసలకు ఆశ్రయం ఇవ్వడం మనుషులను అక్రమ రవాణా చేయడంతో సమానం. చట్ట రీత్యా నేరం. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని న్యాయనిపుణులు చెప్తున్నారు. అయితే.. ఆ విషయం తమకు పూర్తిగా తెలుసునని, అయినా భయపడబోమని లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన పాస్టర్‌ అదా వాలియెంటి పేర్కొన్నారు.

‘ఇది సరైన పని అని నమ్మి మేం చేస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. దక్షిణ కాలిఫోర్నియాలో వేలాది మంది వలసలకు (సరైన పత్రాలు లేని వారికి) ఆశ్రయం ఇవ్వడం లక్ష్యంగా లాస్‌ ఏంజెలెస్‌ మత పెద్దలు ఒక వ్యవస్థగా ఏర్పడి కొత్తగా ఇళ్లు కొంటూ, వాటిపైన మళ్లీ అంతస్తులు కూడా నిర్మిస్తున్నారు. వారిలో పాస్టర్‌ అదా వాలియెంటి ఒకరు. ఒక యూదు వ్యక్తి తన ఇంట్లో అదనంగా ఉన్న పడకగదిని ఇలాంటి వలస వారికి కేటాయించారు. ‘యూదులు నిజంగా ప్రమాదంలో ఉన్నపుడు తమ తలుపులు తెరిచి ఆదుకుని తాము కూడా ముప్పును ఎదుర్కొన్న వారి గురించీ, అలా చేయని వారి గురించీ ఆలోచించకుండా ఉండటం ఒక యూదుకు చాలా కష్టం. అలా తలుపులు తెరిచి ఆదుకున్న వారిలా మేమూ ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

విచ్ఛిన్నమయ్యే కుటుంబాలకు ప్రాధాన్యం..: ప్రధానంగా బలవంతంగా తిప్పిపంపించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వడంపై తాము దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు వివిధ మత విశ్వాసాల సంగమ సంస్థ ఎల్‌ఏ వాయిస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ రెవరెండ్‌ జాక్‌ హూవర్ పేర్కొన్నారు. ఇక హాలీవుడ్‌లోని టెంపుల్‌ ఇజ్రాయెల్‌లో స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. సరైన పత్రాలు లేని వలసలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు అందించడంతో పాటు.. వారిని బలవంతంగా తిప్పిపంపించేందుకు అధికారులు ప్రయత్నించే సందర్భంలో వారికి రక్షణగా సదరు ఇంటర్వ్యూలకు తోడు వెళ్లడం, ఉచితంగా న్యాయ సలహాలు అందించడం వంటి పనులను ‘ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం’ నిర్వహిస్తోంది. ఇదే నిజమైన అమెరికా స్ఫూర్తి అని చాలా మంది ప్రశంసిస్తున్నారు.

 

ఒక వలస తల్లి కథ!

జీనెట్‌ విజ్‌గ్వెరా సరైన పత్రాలు లేని వలస. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌ నగరంలో నివసిస్తున్నారు. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు ల్యూనా (12), రోబెర్టో (10), ఆరేళ్ల జ్యూరీ ఉన్నారు. పిల్లలు ముగ్గురూ అమెరికాలోనే పుట్టారు. కాబట్టి వారికి జన్మతః అమెరికా పౌరసత్వం ఉంది. కానీ.. ఆమెకు పౌరసత్వం లేదు. ఆమెను ఆమె దేశం తిప్పిపంపించడంపై ఉన్న నిలుపుదల ఉత్తర్వులకు ఫిబ్రవరి రెండో వారంతో గడువు తీరిపోయింది. అమెరికాలో ఉండేందుకు ఆమెకు గల దారులన్నీ మూసుకుపోయాయి. అంటే.. ఆమె తన పిల్లలను వదిలేసి స్వదేశానికి తిరిగివెళ్లిపోవాలి. అంతకుముందు వారంలో మరొక తల్లి గ్వాడాలూప్‌ గార్సియా డి రేయాస్‌ ఆరిజోనాలో నిర్బంధించి బలవంతంగా ఆమె స్వదేశానికి తిప్పిపంపించేశారు. దీంతో జీనెట్‌, ఆమె పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

మెక్సికో దేశానికి చెందిన జీనెట్‌.. తన భర్త, పెద్ద కూతరు తానియాతో కలిసి 1997లో చాలా మంది లాగానే మెరుగైన జీవితం వెదుక్కుంటూ అమెరికాకు వలస వచ్చారు. అయితే.. అక్రమ వలసల పిల్లలుగా అమెరికా వచ్చిన వారు అక్కడ నివసిస్తూ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అమెరికా చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. దీంతో తానియా అక్కడ స్థిరపడ్డట్లే. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు పన్నెండేళ్ల పాటు పెద్ద ఇబ్బందులు లేకుండా హోటళ్లలో, ఇళ్లలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవించిన జీనెట్‌.. అక్రమ వలస అన్న విషయం 2009లో అనుకోకుండా అధికార యంత్రాంగానికి తెలిసింది. దీంతో తనను బలవంతంగా తిప్పిపంపకుండా ఉండాలని ఆమె మూడున్నరేళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. వలసల హక్కుల సంఘాల సాయం తీసుకున్నారు.

అయితే.. 2012లో మెక్సికోలోని తన తల్లి మృతి చెందడంతో చివరి చూపు కోసం తిరిగి ఆ దేశానికి వెళ్లారు. ఏడాది వయసున్న బిడ్డతో సహా పిల్లలను వదిలి కొన్ని నెలలు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మళ్లీ స్మగ్లర్లకు డబ్బు చెల్లించి అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ టెక్సాస్‌ వద్ద సరిహద్దు గస్తీ దళాలు ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ఆమెకు అండగా కొలరాడో వలస సంఘం అండగా నిలబడింది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజకీయ నాయకుల వద్ద లాబీయింగ్‌ కూడా చేశారు. ఎట్టకేలకు ఆమెను బలవంతంగా తిప్పిపంపించడంపై స్టే లభించింది. ఇప్పుడు ఆ స్టే గడువు ముగియడంతో ఇక తిప్పిపంపించడం ఖాయమని ఆమె భావించారు. గత నెలాఖరులో కొలరాడో చర్చిలో ఆశ్రయం కోరారు. అక్కడ ఆమెకు చాలా మద్దతు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement