మాజీ ప్రియుడిని ముక్కలుముక్కలు చేయాలని..
- దేశీయ బాంబులతో మహిళ పథకం
మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మహిళ పక్కా ప్లాన్ వేసింది. దేశీయ బాంబులతో అతన్ని ముక్కలుముక్కలుగా పేల్చేసి పగ తీర్చుకోవాలనుకుంది. ఇందుకు మరో మాజీ ప్రియుడి సహకారం తీసుకుంది. అయితే అంతకుముందే ఓ 65 ఏళ్ల వృద్ధుడిని కిరాతకంగా హతమార్చిన వ్యవహారంలో పోలీసులకు ఆమె దొరికిపోవడంతో వారి బండారం బయటపడింది. ఆ కిలాడీ లేడి, ఆమె మాజీ ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి పథకం గురించి తెలుసుకొని నివ్వెరపోయారు. వారు తమ స్నేహితురాలి ఇంట్లో లగేజ్ పేరిట దాచిపెట్టిన మూడు దేశీయ బాంబులను స్వాధీనం చేసుకొని.. దాదాపు నాలుగు గంటలు కష్టపడి వాటిని నిర్వీర్యం చేశారు.
ఈ ఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. ఆర్తి (35), రాకేశ్ 2010లో కలిశారు. అప్పటికే పెళ్లయి, ముగ్గురు పిల్లలు ఉన్న రాకేశ్ ఆర్తి మాయలో పడి.. భార్యా పిల్లలను వదిలి వచ్చేశాడు. ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ఆరేళ్ల అనంతరం దూరపు బంధువైన బాబూలాల్ సాయంతో తిరిగి భార్య పిల్లలకు రాకేశ్ చేరువయ్యాడు. ఆర్తిని వదిలేసి తిరిగి తనవారి వద్దకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.
దీంతో రగిలిపోయిన ఆర్తి.. ఇందుకు రాకేశ్ బంధువు బాబూలాలే (65) కారణమని భావించి అతని గొంతు కోసి హతమార్చింది. ఆ తర్వాత రాకేశ్‌ను కూడా అంతం చేయాలని పథకం రచించింది. ఇందుకు మరో మాజీ ప్రియుడు ప్రదీప్ అలియాస్ దరోగా సాయం తీసుకుంది. ఈ ఇద్దరు కలిసి టపాసుల పౌడర్, గాజుముక్కలు, రాళ్లు కలిపి.. దేశీయ ముడి బాంబులను తయారుచేశారు. రాకేశ్‌ను బాంబులతో పేల్చేసేందుకు ఆర్తి అదను కోసం చూస్తుండగా.. బాబూలాల్ హత్యకేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె అడ్డంగా దొరికిపోయింది. ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.