బాసుమతితో బాగుపడదాం!
అందరూ మక్కువగా ఆరగించే బాసుమతి సాగు చలి తీవ్రంగా ఉండే ఉత్తరాదికే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఖరీఫ్, రబీలలోనూ పండిస్తున్నారు. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా ఎకరాకు 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. బాసుమతి రైస్ మిల్లుల నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పడితే మేలంటున్నారు దాసరి ఆళ్వార్‌స్వామి.
వరి వంగడాల్లో రారాజైన బాసుమతి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. బాసుమతి బియ్యం మన దేశంలో 55 లక్షల టన్నులు పండుతుంటే.. 40 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. పదేళ్లక్రితం సంపన్నులు మాత్రమే సువాసనలు వెదజల్లే బాసుమతి బియ్యాన్ని విందుభోజనాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు మధ్యతరగతి వారు సైతం ఏ చిన్న శుభకార్యం జరిగినా కిలోకు రూ.150 చెల్లించడానికీ వెనకాడటం లేదు. బాసుమతి వరి ధాన్యాన్ని మంచు, చలి ఎక్కువగా ఉన్న రోజుల్లోనే, ఉత్తరాదిలోనే సాగు చేయాలని అపోహపడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్టాల్లో కూడా సాగులోకి రావటమే కాకుండా మంచి దిగుబడినిస్తుండటం విశేషం.
ఏ సీజన్‌లోనైనా 30 బస్తాల దిగుబడి
తెలంగాణ జిల్లాల్లోనూ, కృష్ణా జిల్లాలోనూ గత మూడేళ్లుగా ఖరీఫ్‌లోనే కాదు, రబీలోనూ బాసుమతిని సాగుచేసి 35 బస్తాలకు మించి దిగుబడి సాధించిన అభ్యుదయ రైతులున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటితే ఏప్రిల్ నెల్లో కోతకు వస్తుంది. మండు వేసవిలో కోతకోసి, నూర్పిళ్లు చేసినా ఎకరానికి 35 బస్తాల దిగుబడి వస్తోంది. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. మంచి ధర కూడా వస్తోంది. ఉత్తరప్రదేశ్ వెళ్లొచ్చాక 2014లో కృష్ణా జిల్లా కుందేరులోని మా పొలంలో బాసుమతి సాగు ప్రారంభించాను. నత్రజని ఎరువు తక్కువగా వాడి, నీరు తక్కువగా పెట్టాను. రసాయనిక పురుగుమందులు వాడలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించా. బాసుమతి సాగుపై నాకున్న అనుమానాలన్నీ తీరిపోయాయి.
ఒక్కో మొక్కే నాటాలి
బాసుమతి సాగు చేపట్టాలనుకునే రైతులు విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 20 రోజుల నారు నాటుకోవాలి. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గుతుంది. చదరపు మీటరుకు 20 మొక్కలు నాటడం శ్రేయస్కరం. దగ్గరగా నాటితే పిలకల సంఖ్య తగ్గటంతోపాటు, సూర్యరశ్మి, గాలి, వెలుతురు మొక్కలన్నింటికీ సోకక కొన్ని పిలకలు చనిపోతాయి. ఒక్కో మొక్కని, భూమి పైభాగంలో నాటాలి. ఒక మొక్క నాటితే పొలంలో వెన్నుల సంఖ్య, దిగుబడి తగ్గుతుందనే భయం రైతులకు సహజం. ఒకే మొక్కను నాటినా, 15 పిలకలు పెడుతుంది. 30 నుంచి 40 పిలకలు పెట్టే అవకాశాలూ ఉంటాయి. ప్రతి దుబ్బు నుంచి 15 కంకులొస్తే మంచి దిగుబడులు వస్తాయి. బాసుమతికి నత్రజని ఎరువులు తగ్గించి వాడాలి. డి.ఎ.పి. లేదా 10:26:26 లాంటి కాంప్లెక్స్ ఎరువులను తగు మాత్రంగా వాడాలి. ఊడ్చిన వారం, పది రోజుల్లోపలే కాంప్లెక్స్ ఎరువులు వేయటం శ్రేయస్కరం. నాటు సమయం నుంచి పొట్ట ఏర్పడే వరకు దఫదఫాలుగా పొటాష్ అందించడంతో దిగుబడి పెరిగింది. పొటాష్ వాడకం వల్ల చీడ-పీడల బెడద గణనీయంగా తగ్గుతుంది.
పది రోజులకోసారి ఎండగట్టాలి!
బాసుమతి వరికి సాధ్యమైనంత వరకు తక్కువ నీరందించాలి. పొలంలో 2 అంగుళాల లోతుకు మించి నీరు పెట్ట కూడదు. నాట్లు వేసినప్పటి నుంచి కోతలు పూర్తయ్యే వరకు ఇంతే. ఎక్కువ లోతు నీరు నిల్వ ఉంచినపుడు లేత పిలకలు కొన్ని నీటిలో కుళ్లిపోవటం గమనించాను. బయటకు వచ్చిన పిలక సజావుగా ఎదగాలంటే, నీటిలో మునగ కూడదు. వారం, పది రోజుల వ్యవధిలో పొలాన్ని ఆరబెట్టాలి. వీలైతే పొలం భూమి నైట్టే వరకు ఎండ బెట్టాలి. దీనివల్ల పిలకల సంఖ్య గణనీయంగా పెరిగి.. మంచి దిగుబడి వచ్చింది.
బాసుమతి మిల్లుల్లేక అవస్థలు
ఉత్తర భారతంలో సాధిస్తున్న బాసుమతి దిగుబడులు మనమూ సాధించగలం. అయితే, బాసుమతిని అమ్ముకోవటానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న వసతులు మనకు లేవు. అక్కడకు తీసుకెళ్లి అమ్ముకోవటం వీలు కాదు. మనక్కూడా బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు అందుబాటులో లేక రైతులు అవస్థ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బాసుమతి మిల్లులు ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతులకు లాభం చేకూరుతుంది.
(వ్యాసకర్త.. రైతు,
ఫ్రీలాన్స్ జర్నలిస్టు,
మొబైల్: 93938 18199)
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి),
సాక్షి టవర్‌స, 6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com