కష్టాల ఒడే బతుకు బడి! | struggle to meet the designer of innovative devices | Sakshi
Sakshi News home page

కష్టాల ఒడే బతుకు బడి!

Published Sun, Jul 13 2014 11:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కష్టాల ఒడే బతుకు బడి! - Sakshi

కష్టాల ఒడే బతుకు బడి!

రైతన్న కష్టాలను తీర్చే వినూత్న పరికరాల రూపకర్త
 
‘పంట పక్షుల పాలు పాలి కాపు అప్పుల పాలు’ అన్నారు పెద్దలు.  ఈ మాటలు పక్షుల బెడద తీవ్రతను చెప్తున్నాయి . ప్రస్తుతం ఉన్న కూలీల కొరతతో పక్షులకు కాపలా కాయడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా ఆయన పక్షులను పారదోలే పరికరాన్ని రూపొందించాడు గిరీష్.  వేసిన పంటను బట్టి దాన్ని పాడు చేసే పక్షులు, జంతువులను పారదోలేందుకు వాటి సహజ శత్రువుల ధ్వనిని రికార్డు చేసి ఒక మెమరీ కార్డులో అమర్చి పంట పొలంలో ఏర్పాటు చేస్తారు. అది సృష్టించే శబ్ధ తరంగాలతో పక్షులు, జంతువులు పారిపోతాయి. ఒక పరికరం రెండెకరాల మేరకు ప్రభావం చూపుతుంది.
 
ఇనుము కొలిమిలో పడి కాలి సమ్మెట దెబ్బలతో పదునెక్కినట్లు జీవితంలో చవిచూసిన కష్టాలు అతనిలో పట్టుదలను పెంచాయి. ఓ మామూలు రైతు బిడ్డ. రైతు బతుకులో ఒడిదుడుకులు ఎస్‌ఎస్‌ఎల్‌సీతోనే చదువుకు మంగళహారతి పాడించాయి. అయితేనేం జీవితం నేర్పిన పాఠాలు, కష్టాలకు ఎదురీదే క్రమంలో నేర్చుకున్న ప్రత్యక్ష పాఠాలు ఆయనను ఓ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాయి. పేరొందిన శాస్త్రవేత్తలే పరిజ్ఞానానికి అబ్బురపడేట్లు చేశాయి. బిజాపూ ర్‌లోని కార్వార్‌కు చెందిన గురుపాదప్ప, బసవమ్మల బిడ్డ. ఐదుగురు తోబుట్టువులతో కష్టాలు పంచుకొని పెరిగాడు.  

గురుపాదప్ప సన్నకారు రైతు. ఉన్న ఆరెకరాల పొలంతో ఏడుగురి బట్టపొట్ట గడవాలి. చదువుకుంటే బతుకు బాగుపడే మాటేమో కాని ఆకలి సావాసం మాత్రం నీడలా వెంటాడే పరిస్థితి. ఈ పరిస్థితిలో కుటుంబానికి ఆసరాగా నిలవడానికి గిరీష్ ఎస్‌ఎస్‌ఎల్‌సీతోటే చదువు ముగించాడు. చదువు మీద ఆశను చంపుకున్నాడు కానీ చిన్ననాటి శాస్త్రపరిజ్ఞానం మీద పట్టు సాధించాలనే ఆశయాన్ని మాత్రం చంపుకోలేదు. చిన్ననాడే ఇంట్లో   పాడయిన ఎలక్ట్రిక్ పరికరాలను పట్టుపట్టి బాగుచేసి, పట్టు సాధించాడు.

బోరు మోటరే తొలి గురువు

గిరీష్ పొలంలో  ఓ బోరు బావి ఉండేది. అయితే అది అస్తమానం  తిప్పలు పెట్టేది. దాన్ని రిపేర్ చేయించడానికే చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. తండ్రి కష్టాన్ని కండ్లారా చూసిన గిరీష్ బోరు సంగతేదో తేల్చాలనుకున్నాడు. ప్రతి రోజు బోరు దగ్గరకెళ్లి పరిశీలించేవాడు. ఏదేదో చేసేవాడు. ఇది చూసిన వాళ్లంతా గిరీష్‌కి పిచ్చెక్కిందని వెక్కిరించేవారు. బోరులో సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలన్నది నా ప్రయత్నం. అందుకోసమే నిత్యం బోరు దగ్గర కూర్చుని అందులో ఉన్న వైర్లు వాటి పనితీరు ఇలా అన్నింటిని గమనించేవాణ్ని. ఇది చూసిన వాళ్లంతా నాకు పిచ్చిపట్టింది అని అనేవారు. ఆఖరుకు అమ్మనాన్న కూడా ఇరుగుపొరుగు మాటలతో భయపడి నన్ను ఆ బోరు దగ్గర కెళ్లొద్దని మందలించారు. అయినా ఆగలేదు. ఎవరికీ తెలియ కుండా రాత్రిళ్లు లాంతరు పట్టుకొని బోరు దగ్గరకెళ్లే వాణ్ని. అలా మా బోరుబావి మోటార్ నాకు గురువుగా మారింది. ఆ పాఠాలే నేటి నా ఆవిష్కరణలకు స్ఫూర్తయ్యాయి అని గిరీష్ తన జీవన ప్రస్థానాన్ని వివరించారు.

తన ఆశలకు రూపం ఇవ్వడానికి  ఊరొదిలిన గిరీష్ బెంగళూరు చేరి తన ఆలోచనలకు పదును పెట్టుకున్నాడు. వాటిని  ‘నాబార్డ్’ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.  నాబార్డ్ ప్రతినిధులను గిరీష్ తపన, ప్రతిభ ఆకట్టుకుంది. వారందించిన ఆర్థిక సహకారంతో ఒక బోర్‌వెల్ స్కానర్, బర్డ్ రిపెల్లెంట్‌లను రూపొందించాడు. వీటిని పరీక్షకు పెట్టగా పరిశీలనకు వచ్చిన రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంతృప్తి చెంది కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ పరికరాలను రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వ్యవసాయ క్షేత్రాల్లో వినియోగిస్తోంది.

అన్నదాత కోసం ఎన్నో ఆవిష్కరణలు..

రైతుబిడ్డగా పుట్టిన గిరీష్‌కు రైతుల  పాట్లన్నీ తెలుసు.  ఇందులో ప్రధానమైనది నీటి సమస్య. భూగర్భ జలాలే ఆధారంగా వ్యవసాయం సాగే ప్రాంతాల్లో రైతులు బోర్లు వేసి నీరు పడక చివరకు ఉన్న మడి చెక్కలను అమ్ముకున్న వారు అనేకులు. అందుకే  భూగర్భంలోని నీటిని తెలుసుకునేందుకు బోర్‌వెల్ స్కానర్ అనే పరికరాన్ని రూపొందించాడు. అనంతరం పంటలకు పక్షుల బెడదను తప్పించేందుకు బర్డ్ రిపెల్లంట్‌ను తయారు చేశాడు.  తరువాత క్రమంలో లీడ్ సెన్సర్  ఇరిగేషన్ కంట్రోల్‌ను కనుక్కున్నాడు. ఇది పంటకు నీరవసరమైనప్పుడు బోర్ మోటార్ తనకు తానుగా స్టార్టయ్యేటట్లు చేస్తుంది. ప్రస్తుతం బోర్‌వెల్ స్కానర్‌ను మరింత ఆధునీకరించి బోర్‌వెల్ స్కానర్ రెండో వర్షన్ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు.

బోర్‌వెల్ స్కానర్: సాధారణంగా భూమిలో స్టాక్‌వాటర్, రెగ్యులర్ వాటర్ అని రెండు రకాల నీటి నిల్వలుంటాయి. వీటిలో  స్టాక్‌వాటర్ ఉన్నచోట బోరు వేస్తే మొదట నీళ్లు పడినట్టే కనిపిస్తాయి కానీ...ఆ నీళ్లు వారంరోజుల్లో అయిపోయి బోర్ ఫెయిలవుతుంది. అందుకే రెగ్యులర్ వాటర్ ఉన్న చోట బోరు వేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాటర్ ఎక్కడుందో కనిపెట్టడానికే ‘బోర్‌వెల్ స్కానర్’ ఉపయోగపడుతుంది. బోరు వేయాలనుకున్న ప్రాంతంలో కనీసం ఐదు నుండి పది అడుగుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. అనంతరం బోర్‌వెల్ స్కానర్‌కు అమర్చిన ఒక కేబుల్‌ను బోర్‌లోకి, మరో కేబుల్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తారు.  స్కానర్‌లో అమర్చిన మైక్రో చిప్‌ల ద్వారా ఆ బోర్‌లో ఎంత లోతున నీళ్లు ఉన్నాయి, నీళ్లుంటే అవి నిలువనీరా? ఊట నీరా? అనే  వివరాలు ల్యాప్ టాప్ నమోదవుతాయి.  ఈ సమాచారంతో నీటి లభ్యత వివరాలు తెలిసిపోతాయి. ఈ బోర్‌వెల్ స్కానర్ ధర రూ. 82 వేలు. వ్యవసాయ శాఖ అధికారులే ముందుకొచ్చి రైతు ప్రయోజనాలను సంరక్షించేందుకు ఈ స్కానర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
 లీడ్ సెన్సర్  ఇరిగేషన్ కంట్రోల్: ఇది మోటార్‌కు బిగించే పరికరం. పంటకు నీటి అవసరం ఏర్పడినపుడు పొలంలో అమర్చిన సెన్సర్లు నేలలో తడిని గుర్తించి మోటారుకు సంకేతాలు అందిస్తాయి. దాంతో మోటారు తనకు తానుగా స్టార్టయి నీరు విడుదల చేస్తుంది. ఇందులో ఉష్టోగ్రత నమోదు చేసే పరికరం, నేలలోని తేమను కొలిచే సెన్సర్ లీడ్ సెన్సర్  అనే పరికరాలు అమర్చి ఉంటాయి.  ఈ పరికరం ధర రూ.26,000. విద్యుత్ కోతల సమయంలో పడిగాపులు కాసి పంటకు నీరు పెట్టాల్సిన బాధ ఈ పరికరం తీరుస్తుంది.
 ఆసక్తి గల రైతులు  గిరీష్‌ను 09902133996 ద్వారా సంప్రదించవచ్చు.                                           
  - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement