అందరికీ ఆదర్శం అద్వానీ
సందర్భం
ఆజాద్, బోస్, జేపీ లాంటి నాయకుల తర్వాత దేశం గర్వించ దగ్గ రాజకీయ నాయకులు అరుదు. అద్వానీ నేటి తరాలకు లివింగ్ లెజెండ్ మాత్రమే కాదు నడుస్తున్న చరిత్ర కూడా.
సువిశాలమైన పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్ నుంచి ఎంపీల లైబ్రరీ గదివైపు వచ్చి, రూమ్ నెంబర్ 5 సమీపంలో వరం డాలో నడుచు కుంటూ పక్కనే ఉన్న ఎన్డీఏ, బీజేపీ కార్యాలయంలోకి ఆరడుగుల ఎల్‌కే అద్వానీ నెమ్మ దిగా నడుచుకుంటూ వెళుతుంటే.. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు, సందర్శకులు అంతా చేతు లెత్తి నమస్కరిస్తుంటారు. అందరికీ ప్రతి నమస్కారం చేస్తూ చిద్విలాసంగా ఆయన వెళుతుంటారు. లోక్‌సభలో తొలి వరుస బెంచీల్లో కూర్చుని కార్యకలాపాలను ఆసాంతం వినటం, పార్టీ ఎంపీలకు సల హాలు, సూచనలు ఇవ్వటం ఆయనకు రివాజు.
ప్రతి రాష్ట్రంతోనూ, దాదాపు ప్రతి ప్రాంతంతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయని, స్వయంగా ఆయన ఆ ప్రాంతా లన్నిటిలో తిరిగారని అంటే నమ్మలేకపో వచ్చు. స్వాతంత్య్ర కాలం నాటి గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి నాయ కులను పక్కనపెడితే.. ఆ తర్వాత దేశం యావత్తూ గర్వించదగ్గ రాజకీయ నాయ కులు పెద్దగా కనబడరు. 89వ వసంతంలోకి అడుగు పెడుతున్న అద్వానీ నేటి తరాలకు లివింగ్ లెజెండ్, నడుస్తున్న చరిత్ర.
అద్వానీ అఖండ భారత్‌లో, నేటి పాకిస్తాన్‌లో కరాచీలో పుట్టారు. ఉన్నత విద్య కోసం ముంబై వచ్చారు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, పద్నా లుగేళ్ల ప్రాయంలోనే జీవితాన్ని జాతి సేవకు అంకితం చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి, రెండేళ్ల పాటు అద్వానీని జైల్లో పెట్టారు. 1970లో తొలిసారి రాజ్య సభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగు పెట్టిన ఆయన నాలుగుసార్లు రాజ్యసభకు, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ నిర్మాణంలో అద్వానీ పాత్ర అనన్య సామాన్యం. ముఖ్యంగా 80, 90 దశకాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయితో కలసి ఆయన బీజేపీకి సుస్థిరమైన పునాదులు వేశారు. ఆయన కృషి, పట్టుదల ఫలితమే రెండు లోక్‌సభ స్థానాలుగల బీజేపీ 1989 ఎన్ని కల్లో 86 సీట్లు గెల్చుకుంది. ఆ తర్వాత 121, 161.. ఇలా స్థానాలు పెంచుకుంటూ ఢిల్లీ గద్దెను సొంతం చేసుకుంది. సొంత బలంతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన మాట కూడా 2014లో సాకారమైంది.
63 ఏళ్ల వయసులో అద్వానీ తన మొదటి రథయాత్ర.. రామ్ రథయాత్రను 1990లో ప్రారంభించారు. 1993లో రెండు ముసాయిదా చట్టాలను వ్యతిరేకిస్తూ.. జనా దేశ్ యాత్ర, స్వాతంత్య్రం సిద్ధించి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 1997లో స్వర్ణ జయంతి రథయాత్ర, దేశ చరిత్రలో తొలిసారి ఐదేళ్ల సుపరిపాలన అందించి, వృద్ధిని పరుగులె త్తించిన నేపథ్యంలో 2004లో భారత్ ఉదయ్ యాత్ర, తీవ్రవాదం, మైనార్టీ రాజకీ యాలు, అవినీతి, అధిక ధరలు, రాజ్యాంగ పరిరక్షణల కోసం 2006లో భారత్ సురక్ష రథయాత్ర, కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతి రేకంగా 2011లో జన చేతన యాత్ర జరి పారు.
నైతిక విలువలు పాటిస్తూ రాజ కీయాల్లో మచ్చలేని మనిషిగా ఇన్నేళ్లు గడ పటం మామూలు విషయం కాదు. జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యా యల లాగా వాజ్‌పేయి, అద్వానీలు ఐదు దశాబ్దాలపాటు పని చేశారు. దేశ రాజకీ యాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మొదలైన నేటి తరం నాయ కులను తొలినాళ్లలోనే గుర్తించి, వారి ప్రతి భను ప్రోత్సహించినది కూడా అద్వానీయే. ఆరు దశాబ్దాల ప్రజా జీవితంలో మచ్చలేని ఉక్కుమనిషిగా, విలువలే శ్వాసగా, ప్రజా స్వామ్య పరిరక్షణకు అంకితమై, విశాల జాతీయ దృక్పథంతో మొదట దేశం, తర్వాత పార్టీ... చివరగా వ్యక్తిగతం అని నిన దిస్తున్న కురు వృద్ధుడు ఆయన.
నేడుఎల్‌కే అద్వానీ జన్మదినం
పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
raghuram.bjp@gmail.com