Rajnish Kumar
-
ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!
MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్‌కార్డ్ ఇండియన్ యూనిట్‌కు కుమార్‌ను చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట. వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్‌గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం రజనీష్ కుమార్ FY 2023లో హీరో మోటోకార్ప్ ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్ అండ్ టీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్‌కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్‌తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది. 2023 మార్చి 30న బోర్డులో నియమితులైన రజనీష్ కుమార్ తప్ప మిగిలిన వారికి మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది. ఎల్ అండ్ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా రూ.1 లక్ష చెల్లించింది.ఎస్బీఐ 2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు. అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్బీఐ వివిధ హోదాల్లో సేవలందించిన రజనీష్ కుమార్ స్టార్టప్ భారత్‌పైకి ఛైర్మన్‌గా ఉన్నారు. కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌షిప్‌తో సహా డైరెక్టర్‌గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్‌గా ఉండవచ్చు. -
ఎస్బీఐ మాజీ చైర్మన్‌కు అంతర్జాతీయ సంస్థలో కీలక పదవి
బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ (Rajnish Kumar) ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా (Mastercard India) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్ కార్డ్ ఇండియా తాజాగా ప్రకటించింది. కంపెనీలో ఆయన అత్యంత కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలందిస్తారని మాస్టర్ కార్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మాస్టర్ కార్డ్ దక్షిణాసియా , కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్, ఇండియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని సౌత్ ఆసియా ఎగ్జిక్యూటివ్ నాయకత్వ బృందానికి రజనీష్ కుమార్ మార్గనిర్దేశం చేస్తారు. మాస్టర్ కార్డ్ 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రజనీష్ కుమార్‌కు ఎస్బీఐలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. భారత్‌తోపాటు యూకే, కెనడా దేశాల్లో బ్యాంక్ కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. తన హయాంలో బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ‘యోనో’ను తీసుకొచ్చి విస్తృత ప్రచారం కల్పించారు. ఎస్బీఐ చైర్మన్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని 2020 అక్టోబర్‌లో ముగించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్‌లో విశేష నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ హెచ్ఎస్బీసీ ఆసియా పసిఫిక్, ఎల్అండ్టీ, బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ దిగ్గజాల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు. భారత్‌పే బోర్డుకు, గుర్గావ్లోని ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎండీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
భారత్‌పే బోర్డు సభ్యులపై ఆశ్నీర్ గ్రోవర్ ఊరమాస్ పంచ్‌లు!
భారత్‌పే బోర్డులో మొదలైన ముసలం ఇంకా చల్లారడం లేదు. అవినీతి ఆరోపణలపై బోర్డు నుంచి బయటకు నెట్టబడిన ఆ కంపెనీ మాజీ ఫౌండర్ ఆశ్నీర్ గ్రోవర్ ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యులపై వరుసగా పంచ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఊరమాస్ పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాదికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల భారత్‌పే ప్రకటించింది. ఈ ఫలితాల్లో క్షీణత కనిపించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆశ్నీర్ గ్రోవర్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. భారత్‌పే ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. రజనీష్‌కుమార్, సుహైల్ సమీర్ వంటి అసమర్థుల నాయకత్వంలో భారత్‌పే ఫలితాలో క్షీణత కనిపిస్తోంది. కంపెనీ నిధులు ఆవిరైపోతున్నాయి. తాళాలు దొంగలించడం. కార్నర్లో బడ్డీ కొట్టు నిర్వహించడం రెండు ఒకటి కాదు. మీ నాన్నమ్మ గుర్తుకు వస్తుందా? మార్కెట్ మీకు అసలైన పరీక్ష పెడుతుంది. నిజాన్ని పట్టి చూపుతుంది అంటూ పంచ్ విసిరారు. భారత్‌పే స్టార్టప్‌ను 2018లో ఆశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు స్థాపించారు. ఆ తర్వాత 2020లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సుహైల్ సమీర్ భారత్‌పే గ్రూపు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత క్రమంగా భారత్‌పే బోర్డులో లుకలుకలు మొదలయ్యాయి. చివరకు 2022 జనవరిలో భారత్‌పే నుంచి అశ్నీర్‌గ్రోవర్‌ను బలవంతంగా బయటకు పంపారు. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా అశ్నీర్ గ్రోవర్ పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా భారత్‌పే సీఈవో సుహైల్ సమీర్, చైర్పర్సన్ హోదాలో ఉన్న రజనీష్ కుమార్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. So I just heard @bharatpeindia closed it’s first quarter of ‘degrowth’ and ‘maximum cash burn’ under able (sic) leadership of Rajnish Kumar and Suhail Sameer. ‘Chaabi chheenna and hatti chalana do alag alag skills hai !’ Ab Nani yaad aayegi - markets are the ultimate test & truth — Ashneer Grover (@Ashneer_Grover) April 7, 2022 చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ? -
కార్పొరేట్ల చేతుల్లో బ్యాంకులు వద్దు: రజనీష్‌కుమార్
ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రిలేటెడ్ పార్టీ (బ్యాంకు యాజమాన్యాలతో సంబంధం కలిగిన వారితో లావాదేవీలు) లావాదేవీలు పరంగా ఉండే రిస్క్ నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘నా వరకు భారత్ వంటి దేశంలో బ్యాంకులను కలిగి ఉండేందుకు కార్పొరేట్లను అనుమతిస్తే పెద్ద రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమాన్యాలతో, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే మనకు కావాలి’’ అని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. -
పురోగమనంలో యస్ బ్యాంకు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌కుమార్ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్ ఉన్న విషయం గమనార్హం. యస్ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్ తాజాగా మాట్లాడారు. ‘‘యస్ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్బీఐ ఆదుకున్న సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. ‘ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్’ పేరుతో రజనీష్‌కుమార్ తాను రచించిన పుస్తకంలోనూ యస్ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్బీఐకి రాదనుకున్నాను. ఎస్బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్ సేత్ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్ తెలిపారు. ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది.. ‘‘యస్ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంకులో ఎస్బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు. ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్ బ్యాంకు ఘోష్‌కు కాల్ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు. -
రుణానుబంధానికి మించి కార్పొరేట్‌తో సంబంధం!
ముంబై: కార్పొరేట్లతో కేవలం రుణాలకు సంబంధించిన సంబంధాలను నెరవేర్చడమే కాకుండా అంతకుమించి సహాయ సహకారాలను బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తుందని చైర్మన్ రజ్నీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన వైఖరిని ఎస్బీఐ రూపొందించుకుందని ఆయన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థ– హిందుస్తాన్ యునిలీవర్‌తో (హెచ్‌యూఎల్) బ్యాంక్ భాగస్వామ్య ప్రకటన సందర్భంగా ఆయన గురువారం మాట్లాడారు. కార్పొరేట్లు, అలాగే వారి సరఫరాల చైన్‌కు సంబంధించి అమ్మకందారులు, పంపిణీదారులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల పరిష్కారాలపై సైతం దృష్టి సారించాలన్న ధోరణిని గత కొన్నేళ్లుగా బ్యాంక్ అవలంభిస్తోందని ఆయన తెలిపారు. ఈ దిశలో హెచ్‌యూఎల్‌తో జరిగిన భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని అన్నారు. రజ్నీష్ కుమార్ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టడానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఎంపికచేసిన మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖేరా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కార్పొరేట్ సొల్యూషన్స్ గ్రూప్’’ను కూడా ఎస్బీఐ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హెచ్‌యూఎల్‌తో బ్యాంక్ భాగస్వామ్యం ప్రకారం, ఆ సంస్థ వద్ద రిజిస్టర్ అయిన రిటైలర్లకు కూడా రూ.50,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని బ్యాంక్ కల్పించనుంది. ఎస్బీఐతో హెచ్‌యూఎల్ ఒప్పందం చిన్నస్థాయి రిటైలర్లు మరింత సులువుగా రుణాలను పొందేందుకు ఎస్బీఐ బ్యాంక్ తో ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన శిఖర్ యాప్‌ను వినియోగించే హెచ్‌యూఎల్ రిటైలర్లు ఇకపై ఎస్బీఐ యోనో యాప్ నుంచి సులువుగా రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సందర్భంగా హెచ్‌యూఎల్ చైర్మన్ సంజీవ్ మెహతా మాట్లాడుతూ... ‘‘దేశవ్యాప్తంగా కోటి మంది రిటైలర్లు ఉన్నారు. వారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నందున రుణ సదుపాయ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకునేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపరు. నేడు ఎస్బీఐతోకుదుర్చుకున్న ఒప్పందం ద్వారా రిటైలర్లు తెల్లకాగితం అవసరం లేకుండా సులభమైన పద్దతిలో చాలా త్వరగా రుణాలను పొందగలరు. దీని ద్వారా రిటైలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాధ్యమైనంత వరకు సమిసిపోతుందని ఆశిస్తున్నాము’’ అన్నారు. ఈ ఒప్పందం చిన్నదైనప్పటికీ మిలియన్ల రిటైలర్లకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. -
హైదరాబాద్‌లో ఎస్బీఐ యోనో తొలి బ్రాంచ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్బీఐ బ్యాంక్ హైటెక్ సిటీలో తొలి యోనో బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్‌లు వర్చువల్ పద్ధతిలో ఈ బ్రాంచిని ఆవిష్కరించారు. ఇది సౌతిండియాలో మొదటిదికాగా, దేశంలో 4వది కావడం విశేషం. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనుంది. బ్రాంచి ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ ‘‘యోనో కేవలం ప్రొడెక్ట్ మాత్రమే కాదు. దాదాపు అన్ని బ్యాంక్ సేవలను అందించే వేదిక’’ అన్నారు. -
ఎస్బీఐ పోర్టల్‌లో రుణ పునర్వ్యవస్థీకరణ సమాచారం
ముంబై: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణ గ్రహీతలకూ తమ రుణాలను ఒక్కసారి పునర్వ్యవస్థీకరించుకునే సదుపాయాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. రిటైల్ కస్టమర్లు తమ రుణ పునర్వ్యవస్థీకరణకు తాము అర్హులా, కాదా తెలుసుకునే సదుపాయాన్ని ఎస్బీఐ పోర్టల్‌లో ఏర్పాటు చేసినట్టు బ్యాంకు ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు. రుణ పునర్ వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకు శాఖలను సందర్శించడానికి బదులుగా ఆన్లైన్లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకు శాఖకు వెళితే సరిపోతుందన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటే, మిగిలిన చెల్లింపుల కాలానికి అదనంగా 0.35 శాతం వార్షిక వడ్డీని రుణదాతలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకు పోర్టల్‌ను 3,500 మంది సందర్శించగా, వారిలో 111 మంది రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్నవారిగా చెప్పారు. రిస్క్‌కు విముఖం కాదు.. డిమాండ్ లేదంతే.. బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు వెనకాడవని, అదే సమయంలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన వివేకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రజనీష్ మాట్లాడారు. -
అందరికీ మారిటోరియం అనవసరం: ఎస్బీఐ చీఫ్
ఆగస్ట్ తర్వాత అన్ని రంగాలకు మారిటోరియం కొనసాగింపు అవసరం లేదని ఎస్బీఐ ఛైర్మన్ రజినీష్ అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మారిటోరియం కొనసాగింపుపై ఆర్బీఐ సెక్టార్లవారీగా విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని రజనీష్ తెలిపారు. ఎస్బీఐ నిర్వహించిన 2రోజుల వర్చువల్ ఇంటర్నల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్బీఐ వద్ద మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి గణాంకాలు ఉన్నాయి. ఈ లెక్కలు ఆధారంగానే ఆర్బీఐ మారిటోరియం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. అత్యవరసమని భావించిన కొన్ని రంగాలకు తప్ప మారిటోరియం అనవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో విధించిన మారిటోరియంను డిసెంబర్ వరకు కొనసాగించే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నదని కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావించిన నేపథ్యంలో రజినీష్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఎస్బీఐలో మారిటోరియం తక్కువే: ఎస్బీఐలో మారిటోరియం ఆప్షన్ ఎన్నుకొన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని రజనీష్ తెలిపారు. మే చివరినాటికి ఎస్బీఐ మారిటోరియం ఉపయోగించుకున్న ఖాతాలు సుమారు 20శాతమని, రెండోదశ మారిటోరియంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆరునెలల మారిటోరియం ఒక మినిరీకన్స్ట్రక్చన్ అని, కోవిడ్-19 కారణంగా నష్టాలను చవిచూసిన కంపెనీలకు వాస్తవ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు. ‘‘ఏదైనా ఉపశమనం మూడు విధాలుగా చూడాలి. ఒకటి వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అంచనా వేయడం, టర్మ్ లోన్ రిలీఫ్ ద్వారా క్యాష్‌ఫ్లోను సరిచేయడం, నష్టాలను చవిచూస్తున్న కార్పొరేట్లకు పటిష్టమైన పునర్ వ్యవస్థీకరణ చేయడం’’ అని రజనీష్ వివరించారు. జూన్‌లో రికవరి బాగుంది : ఫైనాన్షియల్ యాక్టివిటి ఏప్రిల్ కంటే మేలో మెరుగ్గా ఉంది. జూన్‌లో మంచి రికవరీని చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రికవరి బాగుంది. అయితే పారిశ్రామిక హబ్‌లైన మహారాష్ట్ర, గుజరాత్, నేషనల్ క్యాపిటల్ రీజనల్(ఢిల్లీ, హర్యనా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్)లో కోవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది.’’ అని రజనీష్ అన్నారు. -
లాక్డౌన్ ఎంతో కాపాడింది: రజనీష్‌కుమార్
కోల్‌కతా: లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ.. దేశాన్ని రక్షించిందని, కేసుల సంఖ్య అదుపులోనే ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఎంతో సహనం కావాలి. వైరస్ వ్యాప్తి, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న నమ్మకం ఏర్పడక ముందే ఆయుధాన్ని కిందకు దించకూడదు’’ అని రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉంటాయని, డిమాండ్ మాత్రం ఆర్థిక వ్యవస్థలో నిలిచే ఉంటుందన్నారు. ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే వైరస్ త్వరగా అదుపులోకి వస్తుందన్నారు. -
ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఉపశమన ప్యాకేజీని తీసుకొచ్చిందని ఎస్బీఐ చీఫ్ రజనీష్‌కుమార్ అన్నారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంటుందని రజనీష్‌కుమార్ అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితుల్లో ఉందని, భారత్ ఇందుకు మినహాయింపేమీ కాదన్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన మార్గం చూపుతుంది. ఇది చక్కగా రూపొందించిన ప్యాకేజీ. బలహీన వర్గాలు కనీస వసతుల విషయంలో ఇబ్బంది పడకూడదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది’’అని రజనీష్ అన్నారు. అవసరమైన చర్యలు.. బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ప్యాకేజీ అవసరమైనంత సాయం అందిస్తుందని ఇండియన్ బ్యాంకు ఎండీ పద్మజ చుండూరు అభిప్రాయపడ్డారు. ‘‘ఆరోగ్య సంరక్షకులకు బీమా రక్షణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు సాయం, ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు ఎంతో అవసరమైనవి’’ అని పద్మజ తెలిపారు. -
ఎస్బీఐ చీఫ్‌ను అవమానించిన ఆర్థిక మంత్రి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనంటూ నిర్మలా సీతారామన్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఎస్బీఐ జాలి లేని బ్యాంకంటూ ఆక్షేపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్ కుమార్‌ను నిర్మలా సీతారామన్ ఘోరంగా అవమానించినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 27న గువాహటిలో ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు, రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) ఖండించింది. ఎస్బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని పేర్కొంది. -
ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్
న్యూఢిల్లీ: ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ప్రసక్తే లేదని, కేవలం దాంట్లో వాటాను కొంటామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువుందన్నారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్ స్కీంపై తమ బ్యాంక్ న్యాయబృందం పనిచేస్తోందన్నారు. ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని స్పష్టంచేశారు. ‘యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను ఎస్బీఐ కొనుగోలు చేస్తే రూ.2,400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. పెట్టుబడి పథకాన్ని చూశాక 23 మంది ఇన్వెస్టర్లు ఎస్బీఐని సంప్రదించారు’ అని చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐ 49 శాతం కొంటుందా? లేక 26 శాతం తీసుకుంటుందా? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తిని పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్‌దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్‌కు లుక్ అవుట్ నోటీసు -
‘యస్’బీఐ..!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను ఆర్బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికిగానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ చర్యలు తీసుకుందని, ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని భరోసా నిచ్చారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్ బ్యాంక్ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా మార్చాలని ఆర్బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు. ‘ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్ చేసేందుకు ఎస్బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు. ఆందోళనలో కస్టమర్లు.. విత్డ్రాయల్స్పై ఆంక్షలతో యస్ బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు. నెట్ బ్యాంకింగ్ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్ హెల్ప్‌లైన్ హోరెత్తింది. కొందరు ట్విట్టర్ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్లో ఫిర్యాదులు చే శారు. షేరు 85 శాతం క్రాష్.. యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయడం, విత్ డ్రాయల్స్‌పై ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం యస్ బ్యాంక్ షేర్ కుప్పకూలింది. శుక్రవారం ఒకానొక దశలో 85 శాతం దిగజారి రూ.5.55ను తాకింది. చివరకు 55 శాతం నష్టంతో రూ.16.55 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి యస్ బ్యాంక్ షేర్ రూ.47గా ఉంది. షేర్ ధర భారీగా నష్టపోవడంతో ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. ఎల్ఐసీ మార్క్–టు–మార్కెట్ నష్టాలు రూ.617కోట్ల మేర ఉండగా, మ్యూచువల్ ఫండ్స్ మార్క్–టు–మార్కెట్నష్టాలు కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,162 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.3,300 కోట్లు నష్టపోయారు. ఇక హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నష్టాలు రూ.239 కోట్లుగా ఉన్నాయి. త్వరలో పరిష్కారమవుతుంది: ఎస్బీఐ చీఫ్ రజనీష్ కుమార్ ‘యస్ బ్యాంక్ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమస్య కాదు. యస్ బ్యాంక్ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది‘ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్ బ్యాంక్ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్ చెప్పారు. డిజిటల్ పార్ట్నర్స్కు సెగ.. యస్ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్టñ క్ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్ బ్యాంక్ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్లపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆంక్ష లు విధించింది. ఇక, యస్ బ్యాంక్ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. మరోవైపు, యస్ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి. పూరీ జగన్నాథునికీ కష్టాలు... యస్ బ్యాంకులో పూరీ జగన్నా«థ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్ బ్యాంకులో జగన్నాథుడి నిధులను డిపాజిట్ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్ ప్రియదర్శి పట్నాయక్ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. -
బ్యాంకుల విలీనంలో ఐటీ కీలక పాత్ర..
ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియపై ఎస్బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ స్పందించారు. గురువారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బ్యాంకుల విలీన ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టీ) సమన్వయంతో ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో బ్యాంకుల విలీన ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని రజినీష్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
యస్ బ్యాంకుపై ఎస్బీఐ చీఫ్ కీలకవ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వివాదాలు, సమస్యలసుడిగుండంలో చిక్కుకున్న ప్రయివేటు బ్యాంకు యస్‌బ్యాంకుపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయంటూ సానుకూల సంకేతాలిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యస్‌బ్యాంకును కుప్పకూలనివ్వమని, ఏదో ఒక పరిష్కారం తప్పక లభిస్తుందని వ్యాఖ్యానించారు. మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్బీఐ ఛీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్బీఐని కోరవచ్చన్న అంచనాలకు రజనీశ్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్‌తో మార్కెట్లో కీలకమైన బ్యాంకుగా ఉన్న యస్‌బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. అంతేకాదు యస్‌బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదంటూ రజనీశ్ పేర్కొనడం గమనార్హం. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీశ్ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. కాగా గత నెల్లో యస్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్ వెల్లడించడం గమనార్హం. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రానా కపూర్ ఆకస్మికంగా నిష్క్రమించిన తరువాత బ్యాంకు తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. ఆస్తి నాణ్యత క్షీణించడం, ఎన్పిఏ, మూలధన పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గత సంవత్సరంలో యస్ బ్యాంకు 80 శాతానికి పైగా పడిపోయాయి. జనవరి 10 న జరిగిన బోర్డు సమావేశం రుణదాత అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యూఐపి) లేదా, ఏదైనా ఇతర ప్రైవేటు ఈక్విటీ లేదా అప్పు ద్వారా రూ .10,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ నిధుల సేకరణపై చర్చించడానికి, అంతకుముందు రూ .800 కోట్లుగా ఉన్న అధికారిక మూలదనాన్ని రూ .1,100 కోట్లకు విస్తరించేందుకుగాను, ఫిబ్రవరి 7 న తన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. -
ఎస్బీఐ వినూత్న గృహ రుణ పథకం
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్బీఐ తెలిపింది. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్ బుక్ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందేంత వరకు అమల్లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
ఎస్బీఐ లాభం... ఆరు రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4.5% వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని, ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది. స్టాండ్అలోన్ లాభం రూ.3,012 కోట్లు స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212%)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఉంటుందన్నారు. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95% నుంచి 7.19%కి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి దిగొచ్చాయి. నికర లాభం మూడు రెట్లు పెరగడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 7.5 శాతం లాభంతో రూ.282 వద్ద ముగిసింది. -
అంతా ఆ బ్యాంకే చేసింది..!
లేహ్: ఆల్టికో క్యాపిటల్‌లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్ దేశీయ బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు తాజా ఎన్పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్డ్ డిపాజిట్)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్ కుమార్ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్ కుమార్ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్పోజర్ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. సమష్టిగా వ్యవహరించాలి... బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్ కుమార్. అతిపెద్ద ఎన్పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్ యూఏఈకి చెందిన మాష్‌రెక్ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు రూ.200 కోట్లు, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్‌రెక్ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్‌ను ఇండియా రేటింగ్స్, కేర్ రేటింగ్స్ జంక్ కేటగిరీకి డౌన్‌గ్రేడ్ చేశాయి. క్లియర్‌వాటర్ క్యాపిటల్ పార్ట్నర్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వర్దే పార్ట్నర్స్ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
డెబిట్ కార్డులకు ఇక చెల్లుచీటీ..!
ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాలు తెలిపారు. ‘డెబిట్ కార్డులను పూర్తిగా తొలగించాలని మేం భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ ’యోనో’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడగలవన్నారు. అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ’59 నిమిషాల్లోనే రుణ మంజూరీ పథకం’పై చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాహనాలకు.. ముఖ్యంగా కార్లకు కూడా ఈ రుణాలను వర్తింపచేసే అంశాన్ని బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. రూ. 25 కోట్ల దాకా టర్నోవరు ఉండే వ్యాపారవేత్త ఈ పథకం కింద కేవలం 59 నిమిషాల్లోనే రూ. 5 కోట్ల దాకా రుణాలకు సూత్రప్రాయంగా ఆమోదం పొందవచ్చని రజనీష్ కుమార్ వివరించారు. -
ఎస్బీఐ లాభం 2,312 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు... నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్ఎంఈ రుణాలు ఎన్పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి. రూ. 5,769 కోట్ల రికవరీలు... మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్గ్రేడ్లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది. రూ.7,000 కోట్ల సమీకరణ.... అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు. రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్బీఐ షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు. -
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేస్తాం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్‌కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్‌ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్)లో 800 మంది, జేఏఎమ్ఈవీఏ(జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్ టేకోవర్‌కు సంబంధించిన బిడ్లు దాఖలు చేసే గడువు తేదీ దాటిపోయింది. టేకోవర్‌కు అర్హత సాధించే కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు. -
కొత్త ఇన్వెస్టర్ రూ.4,500 కోట్లు తేవాలి
న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల అధీనంలోకి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించి, ఏప్రిల్ 30 నాటికి బిడ్లను ఆహ్వానించాలన్నది బ్యాంకుల ప్రణాళిక. ‘‘ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్‌లైన్ లేదా నరేష్ గోయల్ లేదా ఎతిహాద్ ఎవరైనా కావొచ్చు. ఎయిర్‌లైన్‌ను సొంతం చేసుకునేందుకు ఎవరినీ నిషేధించలేదు’’ అని రజనీష్ కుమార్ అన్నారు. జీతాలు ఇవ్వండి బాస్.. పెండింగ్‌లో ఉన్న తమ జీతాలను వెంటనే ఇప్పించాలంటూ జెట్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను కోరింది. జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సేవలను నిలిపివేస్తామని 1,100 మంది ఉద్యోగులతో కూడిన ఈ సంఘం హెచ్చరించడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్కు రూ.1,500 కోట్ల అత్యవసర లిక్విడిటీని అందించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి నూతన యాజమాన్యానికి విన్నపాలు పెరిగినట్లు తెలుస్తోంది. -
మాల్యా నుంచి ఆఫర్ రాలేదు
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి సెటిల్మెంట్కు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి ఆఫర్ రాలేదని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టంచేశారు. ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తోంది. మాల్యా భారత్‌కు తిరిగి వస్తే రుణాల రికవరీ ప్రక్రియ వేగం కాగలదని చెప్పారాయన. తీసుకున్న రుణాల్లో అసలును తిరిగి ఇచ్చేస్తానని తాను ఆఫర్ చేస్తున్నా బ్యాంకులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల్యా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ.9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ అక్కడి కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. రుణాలు ఎగ్గొట్టిన వారు ఎక్కడికి పారిపోయినా తప్పించుకోలేరనడానికి మాల్యా ఉదంతం నిదర్శనం కాగలదని కుమార్ చెప్పారు. ‘రుణాల రికవరీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. రుణాలు ఎగ్గొట్టేసి, దేశం నుంచి పారిపోయినా తప్పించుకోలేరన్నది మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు తీర్పు ద్వారా స్పష్టమవుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. నీరవ్‌ను కూడా తెప్పించే అవకాశాలు.. మాల్యా ఉదంతం నేపథ్యంలో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను రప్పించే ప్రక్రియ కూడా వేగవంతం కాగలదని రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మాల్యా అప్పగింతతో మొత్తం రుణదాతలు, రుణగ్రహీతల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారాయన. ‘దేశానికి పెట్టుబడులు అవసరం. ఇటు రుణదాతలకు, అటు గ్రహీతలకు రుణ లావాదేవీలు ముఖ్యం. కానీ ఇవి పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉండాలి. బ్యాంకులు కూడా దేనికోసం రుణాలిస్తున్నాయో ఒకటికి రెండు సార్లు చూసుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని రజనీష్ చెప్పారు. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. పటేల్ తప్పుకున్న దరిమిలా.. ఒక్క రోజు డిఫాల్ట్ అయినా మొండిబాకీగా పరిగణించాలంటూ ఆర్బీఐ విధించిన నిబంధనల్లో మార్పులుంటాయా లేదా అన్నది అంచనా వేయడం కష్టమన్నారు. మొండిబాకీలు పేరుకుపోయిన విద్యుత్ కంపెనీలకు సంబంధించి.. ఆరు లేదా ఏడు సంస్థల కేసులు త్వరలో పరిష్కారం కాగలవని రజనీష్ తెలియజేశారు. -
ఎస్బీఐ మళ్లీ లాభాల బాట
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొండిబకాయిల సమస్య నుంచి నెమ్మదిగా మళ్లీ గాడిలో పడుతోంది. గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలను ప్రకటిస్తున్న బ్యాంక్ ఇప్పుడు లాభాల బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018–19, క్యూ2) స్టాండెలోన్ ప్రాతిపదికన (బ్యాంకింగ్ కార్యకలాపాలు) రూ.945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.1,582 కోట్లతో పోలిస్తే 40% తగ్గింది. అయితే, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ1) వచ్చిన రూ.4,876 కోట్ల భారీ నష్టంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా బ్యాంక్ మళ్లీ లాభాల్లోకి రావడం గమనార్హం. మార్చి క్వార్టర్లో కూడా రూ.7,718 కోట్ల నికర నష్టాన్ని ఎస్బీఐ మూటగట్టుకోవడం తెలిసిందే. మరోపక్క, సెప్టెంబర్ క్వార్టర్లో(క్యూ2) అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చిన రూ.5,436 కోట్ల భారీ వన్‌టైమ్ ఆదాయం ఎస్బీఐకి కలిసొచ్చింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, కేటాయింపుల(ప్రొవిజనింగ్) భారం శాంతించడం కూడా బ్యాంక్ మెరుగైన పనితీరుకు తోడ్పడింది. క్యూ2లో ఎస్బీఐ రూ.225 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.65,429 కోట్ల నుంచి స్వల్ప పెరుగుదలతో రూ.66,608 కోట్లకు చేరింది. 1.8% వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్‌గా ఇలా... ఎస్బీఐ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్, కార్డ్స్, మ్యూచువల్ ఫండ్... ఈ అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ క్యూ2లో రూ.576 నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.1,841 కోట్లతో పోలిస్తే 69 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం 5.8 % వృద్ధితో రూ.74,949 కోట్ల నుంచి రూ.79,303 కోట్లకు పెరిగింది. మొండిబకాయిలు తగ్గాయ్... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు క్యూ2లో రూ.2,05,864 కోట్లుగా (9.95 శాతం) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు రూ.1,86,115 కోట్లుగా (9.83 శాతం) ఉన్నాయి. అయితే ఈ ఏడాది క్యూ1లో రూ. 2,12,840 కోట్లుతో (10.69%) పోలిస్తే సీక్వెన్షియల్‌గా దిగొచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు వార్షిక ప్రాతిపదికన, సీక్వెన్షియల్‌గా కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం. గతేడాది క్యూ2లో రూ.97,896 కోట్లుగా(5.43%) ఉన్న నికర ఎన్పీఏలు ఈ ఏడాది క్యూ2లో రూ.94,810 కోట్లకు (4.84%) తగ్గాయి. ఈ ఏడాది క్యూ1లో ఇవి రూ. 99,236 కోట్లుగా (5.29%) ఉన్నాయి. మరోపక్క, మొండిబాకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్) కూడా భారీగా తగ్గాయి. గతేడాది క్యూ2లో రూ.16,842 కోట్లను కేటాయించగా... ఈ ఏడాది క్యూ2లో 39% తగ్గుదలతో ప్రొవిజనింగ్ రూ.10,381 కోట్లకు దిగి వచ్చింది. కాగా, క్యూ2లో స్థూలంగా రూ.10,888 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో మొండి బకాయిలుగా మారిన రూ.14,349 కోట్లతో పోలిస్తే భారీగా అడ్డుకట్టపడినట్లు లెక్క. రైటాఫ్ చేసిన రుణ ఖాతాల్లో సుమారు రూ. 1,327 కోట్లను రికవరీ చేసుకున్నామని.. 14.6% వృద్ధి నమోదయిందని బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) క్యూ2లో 12.5 శాతం వృద్ధి చెంది రూ.18,586 కోట్ల నుంచి రూ.20,906 కోట్లకు ఎగబాకింది. n నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.59 శాతం నుంచి 2.88 శాతానికి మెరుగుపడింది. ♦ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ క్వార్టర్లో 9 శాతం వృద్ధితో రూ.19.57 లక్షల కోట్లకు చేరాయి. దేశీ రుణ వృద్ధి 1%గా నమోదైంది. ఇందులో కార్పొరేట్, రిటైల్ రుణాలు 14% వృద్ధి చెందాయి. ♦ డిపాజిట్లు 7 శాతం పెరుగుదలతో రూ.28.07 లక్షల కోట్లకు చేరాయి. ♦ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం ఎస్బీఐ షేరు పరుగులు తీసింది. ట్రేడింగ్ మరో పావు గంటలో ముగుస్తుందనగా.. ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బీఎస్ఈలో 5 శాతం దూసుకెళ్లి రూ.299.90ని తాకింది. చివరకు 3.45 శాతం లాభంతో రూ.295 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.8,791 కోట్లు ఎగబాకి రూ. 2,63,543 కోట్లకు చేరింది. సెస్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ఐఎల్ఎఫ్ఎస్కు రూ.4,250 కోట్ల రుణాలు... రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌స్ గ్రూప్ మొత్తానికి తాము దాదాపు రూ.4,250 కోట్ల మేర రుణాలిచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇందులో రూ.4,000 కోట్లు ఐఎల్ఎఫ్ఎస్కు చెందిన 13– 14 ప్రత్యేక సంస్థలకు (ఎస్పీవీ) ఇవ్వగా... మరో రూ.250 కోట్లను మాతృ సంస్థ అయిన హోల్డింగ్ కంపెనీకి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఒక్క ఖాతా మాత్రమే మొండిబకాయిగా మారిందని.. దీనికి రూ.56 కోట్ల కేటాయింపులు జరిపామని రజనీష్ పేర్కొన్నారు. కాగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) తామిచ్చిన రుణాల పరిమాణం రూ.1.5 లక్షల కోట్లు ఉన్నట్లు వివరించారు. ‘ఈ రుణాలకు సంబంధించి వ్యవస్థాగత రిస్కులేవీ లేవు. సంక్షోభం మొదలైన ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. అక్టోబర్ నెలలో సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఎన్బీఎఫ్సీ రుణాలను టేకోవర్ చేశాం. మరో రూ.15,940 కోట్ల రుణాలను చేజిక్కించుకునే పనిలో ఉన్నాం. మార్చి నాటికి రూ.45,000 కోట్ల రుణాలు, ఆస్తుల కొనుగోలు లక్ష్యాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉంది’ అని ఎస్బీఐ చైర్మన్ పేర్కొన్నారు. క్యూ2లో నికర లాభం తక్కువగానే ఉన్నప్పటికీ... బ్యాంక్ పనితీరు బాగా మెరుగుపడింది. రానున్న కాలంలో లాభాలు మరింత పుంజుకుంటాయన్న విశ్వాసం ఉంది. మొండిబకాయిలు, కేటాయింపులు కూడా భారీగానే దిగొస్తాయని భావిస్తున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
ఎన్పీఏల సమస్యను అధిగమించే స్థాయికి బ్యాంకులు
న్యూయార్క్: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ఎక్కువగా స్టీల్, విద్యుత్ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది ఉందని, అయితే, ఎక్కువ శాతం ప్రభావం ముగిసిందని చెప్పారాయన. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఆస్తుల నాణ్యత సవాలును ఎదుర్కొంటున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగింది. కానీ, ఈ సమస్య విషయంలో చివరి దశలో ఉన్నాం’’ అని కుమార్ తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్పీఏలను బ్యాంకులు ఇప్పటికీ పరిష్కరించుకునే స్థితిలో లేవన్నారు. అయితే, దివాలా బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) బ్యాంకులకు మేలు చేస్తున్నదని, ప్రస్తుతం ఓ పరిష్కారం అనేది అందుబాటులో ఉందని చెప్పారాయన. బ్యాంకులకు, రుణదాతలకు ఐబీసీ అన్నది మంచి సాధనంగా పేర్కొన్నారు. చమురు ధరలు స్థిరపడితే, రూపాయి కూడా కుదురుకుంటుందని చెప్పారు. ‘‘దేశీయంగా ఆర్థిక రంగం మంచి పనితీరులో ఉంది. కానీ పెరుగుతున్న చమురు ధరలు అతిపెద్ద అవరోధంగా తయారయ్యాయి. ఎందుకంటే ఇది దేశ కరెంటు ఖాతా లోటుపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన అన్నారు. -
ఎన్బీఎఫ్సీల్లో లిక్విడిటీపై ఆందోళనల్లేవు
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ విషయంలో ఆందోళనలేవీ లేవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఆ సంస్థలకు రుణపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఐఎఫ్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్‌లో రుణ సంక్షోభం నేపథ్యంలో రజనీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల ఆరంభంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్.. సిడ్బీకి చెల్లించాల్సిన రూ.1,000 కోట్ల స్పల్పకాలిక రుణాల్లో డిఫాల్ట్ కావడం, మరో సబ్సిడరీ 500 కోట్ల మేర డిఫాల్ట్ అయినట్లు బయటపడటం తెలిసిందే. దీంతో రేటింగ్ ఏజెన్సీలు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ బాండ్లను జంక్ గ్రేడ్‌కు డౌన్‌గ్రేడ్ చేయడంతో ఈ సమస్యలు ఇతర ఎన్బీఎఫ్సీలకూ పాకొచ్చని... వాటి నిధుల సమీకరణ వ్యయం ఎగబాకి, లాభదాయకతలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న భయాలు మార్కెట్లను చుట్టుముట్టాయి. దీంతో గత శుక్రవారం ఆయా కంపెనీల షేర్లలో తీవ్రమైన అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ ఏకంగా 60 శాతం కుప్పకూలగా.. ఇతర ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు కూడా భారీగానే పడిపోయాయి. మనీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గడం, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై స్పష్టత లేకపోవడం వల్లే ఎన్బీఎఫ్సీ షేర్లు పడిపోయేందుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. ‘ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాల విషయంలో ఎస్బీఐ తటపటాయిస్తుందోందంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థంపర్థం లేదు. అవన్నీ వదంతులే. నిబంధనలలకనుగుణంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీలన్నింటికీ ఎస్బీఐ రుణాల మద్దతు కొనసాగుతుంది’ అని ఎస్బీఐ చైర్మన్ స్పష్టం చేశారు. -
ఈ ఏడాది లాభాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. జూన్ త్రైమాసికంలో బ్యాంకు రూ.4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,006 కోట్ల లాభాలను ఆర్జించింది. 2018–19 సెప్టెంబరు త్రైమాసికం అనంతరం నుంచి లాభాలను చూస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో బ్యాంకు నిర్వహించిన సీఎస్ఆర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రానిబాకీల కోసం చేసిన కేటాయింపుల వల్లే లాభాలపై ప్రభావం చూపింది. 2017–18లో ఈ కేటాయింపులు రూ.70,000 కోట్లు. అంత క్రితం ఏడాది ఇవి రూ.55,000 కోట్లు. ఈ ప్రొవిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టనున్నాయి. ఇచ్చిన రుణాలు బ్యాడ్ లోన్స్ కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నాం. ఎన్సీఎల్టీ వద్ద ఉన్న మొండి బకాయిల కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. మొత్తంగా ఈ ఏడాది బ్యాంకు లాభాల్లోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. రుణాల్లో 10 శాతం వృద్ధి.. ఈ ఏడాది రుణాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని రజనీశ్ కుమార్ వెల్లడించారు. కంజ్యూమర్ లోన్స్ అయిన కార్ లోన్స్, హోమ్, పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఎస్ఎంఈ విభాగంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది కార్పొరేట్ రుణాలు పుంజుకుంటాయి. ఈ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సిమెంట్, రోడ్స్, ఆటో, ఆటో కాంపోనెంట్, రెనివేబుల్ ఎనర్జీ, ఆయిల్ తదితర రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి’ అని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరపడుతున్నాయని, రానున్న రోజుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అన్నారు. కొత్తగా 8,000 మందిని నియమిస్తున్నట్టు చెప్పారు. -
రేపటి వరకు క్యాష్ క్రంచ్ మటుమాయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నగదు కొరత(క్యాష్ క్రంచ్)తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇక్కట్లు రేపటికి మటుమాయమైపోనున్నాయట. దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరత రేపటి వరకు(శుక్రవారం వరకు) పరిష్కారమైపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం తెలిపారు. నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు ఇప్పటికే కరెన్సీ పంపిచినట్టు చెప్పారు. సిస్టమ్‌లో నగదు కొరత రూ.70వేల కోట్లకు పెరిగిందని ఎస్బీఐ అంతకముందు తెలిపిన సంగతి తెలిసిందే. ఇది ఏటీఎంల నుంచి నెల వారీ విత్‌డ్రా చేసుకునే మొత్తాల్లో మూడవ వంతుగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి దాదాపు రూ.15,291 బిలియన్లు విత్‌డ్రా అయినట్టు రీసెర్చ్ నోట్ కూడా అంచనావేసింది. ఇది గత ఆరు నెలలతో పోలిస్తే 12.2శాతం ఎక్కువగా పేర్కొంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఈ నగదు కొరత ఏర్పడింది. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతకముందే రజనీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇలా అసాధారణంగా కొరతను సృష్టించడంలో ఆదాయపు పన్ను అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కర్నాటకలో 30 నుంచి 35 రైడ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లను ఐటీ ఎక్కువగా ఫోకస్ చేసింది. మరోవైపు రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను ప్రభుత్వం ఐదింతలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్ తెలిపారు. -
దివాలా చట్టంతో ఫలితాలొస్తాయ్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నూతన చట్టంతో ఎదురయ్యే సవాళ్లు లక్ష్యానికి అడ్డంకి కాబోవని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ఇది కొత్త చట్టమని, ఫలితాలు రావాల్సి ఉందని చెప్పిన రజనీష్... ఇది నిరాశపరచబోదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తుది నిర్ణయం మాత్రం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పరిధిలోనే ఉందన్నారు. భారీ రుణ ఎగవేత కేసులను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద పరిష్కరించడానికి ఎన్సీఎల్టీకి ప్రతిపాదించించేందుకు ఆర్బీఐ గతేడాది అనుమతించిన విషయం తెలిసిందే. ఐబీసీ కింద రుణదాతల కమిటీ ఆమోదించిన పరిష్కార ప్రణాళికే తుది నిర్ణయం కాదన్న రజనీష్‌కుమార్... అంతిమంగా ఇది న్యాయపరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఆర్బీఐ రెండు జాబితాల్లో చర్యల కోసం సూచించిన కేసుల నుంచి 40 శాతం బకాయిలు వసూలు కావచ్చని చెప్పారు. వసూళ్లకు సంబంధించి కచ్చితమైన అంచనాలేవీ ఉండవన్నారు. రూ.8 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల భారాన్ని దేశీయ బ్యాంకులు మోస్తున్న విషయం తెలిసిందే. దీంతో సమస్యాత్మక రుణాన్ని 180 రోజుల్లోగా పరిష్కరించుకోని పక్షంలో ఎన్సీఎల్టీకి ప్రతిపాదించాలని ఆర్బీఐ గత నెలలోనే బ్యాంకులను ఆదేశించింది. విద్యుత్ రంగానికి పునర్వైభవం... విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాల వసూళ్లలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరిస్తామని రజనీష్ కుమార్ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు రుణదాతలు సమష్టిగా వ్యవహరిస్తారని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో విద్యుత్‌కు కొరత ఏర్పడుతుందని, దీంతో ఉన్న ప్లాంట్లకు మెరుగైన విలువ సమకూరుతుందని పేర్కొన్నారు. తద్వారా విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు సమస్యాత్మకం కాబోవన్న సంకేతమిచ్చారు. మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వరంగంలో ఎక్కువ బ్యాంకులు అవసరం లేదన్న దానితో ఏకీభవిస్తున్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య తగ్గితే వినియోగదారులకు నష్టం జరగదంటూనే... ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు ఇది సరైన తరుణం కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కస్టమర్ల సేవల అనుభవం, పరిపాలన మెరుగుపడేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు. -
మొండి బాకీల్లో వ్యత్యాసాలకు చెక్..
ముంబై: మొండి పద్దుల వర్గీకరణలో రిజర్వ్ బ్యాంక్ లెక్కలకు, తమ లెక్కలకు మధ్య ఇకపై వ్యత్యాసాల (డైవర్జెన్స్) సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. మార్చితో ముగిసే పూర్తి ఆర్థిక సంవత్సరం లెక్కల్లో ఎటువంటి తేడాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తామని ఆయన చెప్పారు. ఇటీవల డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా.. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ. 23,000 కోట్ల మేర మొండి బకాయిల డైవర్జెన్స్ చూపిన నేపథ్యంలో రజనీష్ కుమార్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. వర్గీకరణలో ’కాలవ్యవధిపరమైన’ అంశాల కారణంగానే మొండిబాకీల లెక్కల్లో వ్యత్యాసాలు తలెత్తాయని కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వాస్తవానికి 2017 మార్చి నాటికే సదరు రుణాలను మొండిబాకీల కింద గుర్తించినప్పటికీ.. అధికారికంగా వర్గీకరణ జరగకపోయి ఉండొచ్చని ఆయన తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ భారీ మొత్తంలో ఎన్పీఏలను తక్కువగా చూపించినట్లు ఆర్బీఐ తనిఖీల్లో బైటపడిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో సవరించిన నిబంధనల ప్రకారం ఎన్పీఏల విషయంలో ఆర్బీఐ లెక్కలకు, బ్యాంకు లెక్కలకు మధ్య 15 శాతం పైగా వ్యత్యాసం ఉన్న పక్షంలో రిజర్వ్ బ్యాంక్‌కు కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఎస్బీఐ లెక్కల్లో 21 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో.. వీటన్నింటికి కేటాయింపులు పెంచాల్సి రావడంతో డిసెంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ. 1,887 కోట్ల నికర నష్టం ప్రకటించాల్సి వచ్చింది. భారీ పద్దులకు పరిష్కారం.. సుదీర్ఘకాలం మొండిబాకీలుగా కొనసాగుతున్న కొన్ని ఖాతాల మూలంగా ప్రొవిజనింగ్ సైతం అధిక స్థాయిలోనే ఉంటోందని రజనీష్ కుమార్ చెప్పారు. అయితే, భారీ మొండి పద్దులను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా పరిష్కార చర్యల ద్వారా గానీ లేదా రైట్ డౌన్ రూపంలో గానీ ఖాతాల నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలంగా ఎన్పీఏగా ఉన్న ఖాతాకు మరింత ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఎస్బీఐ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 1.86 లక్షల కోట్ల నుంచి రూ. 1.99 లక్షల కోట్లకు, నికర ఎన్పీఏ నిష్పత్తి 9.83 శాతం నుంచి 10.35 శాతానికి పెరిగింది. మరోవైపు, రిటైల్ విభాగం ఊతంతో వచ్చే ఆర్థిక సంవత్సరం రుణ వృద్ధి 10 శాతం మేర ఉండొచ్చని రజనీష్ కుమార్ అంచనా వేశారు. అయితే, కార్పొరేట్ రుణాల విషయంలో మాత్రం ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వివరించారు. -
ఎస్బీఐపై ‘మొండి’బండ!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మొండిబకాయిలు షాక్ ఇచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్, క్యూ3) అత్యంత నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. అనుబంధ సంస్థలన్నిటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ రూ.1,887 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎస్బీఐ రూ.2,152 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. ప్రధానంగా అధిక మొండిబకాయిలతో కేటాయింపులు పెరిగిపోవడం, వడ్డీయేతర ఆదాయం పడిపోవడం వంటివి లాభాల్లోనుంచి నష్టాల్లోకి జారిపోవడానికి కారణమయ్యాయి. ఎస్బీఐ 17 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా క్యూ3లో నికర నష్టాన్ని ప్రకటించడం మొండిబకాయిల తీవ్రతకు నిదర్శనం. మార్కెట్ వర్గాలు ఎస్బీఐ క్యూ3లో రూ.2,507 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశాయి. కాగా, క్యూ3లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.74,191 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.75,537 కోట్లతో పోలిస్తే 1.79 శాతం తగ్గింది. కాగా, కొత్త చైర్మన్ రజనీష్ కుమార్ హయాంలో తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం గమనార్హం. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఎస్బీఐ క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. క్రితం ఏడాది క్యూ3లో బ్యాంక్ స్టాండెలోన్‌గా రూ.2,610 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.53,587 కోట్ల నుంచి రూ.62,887 కోట్లకు పెరిగింది. 17.3 శాతం వృద్ధి నమోదయింది. మొండిబకాయిలు పైపైకి... ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) క్యూ3లో భారీగా పెరిగాయి. బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2017 డిసెంబర్ నాటికి (క్యూ3) 10.35 శాతానికి చేరి రూ.1,99,141 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది క్యూ3 చివరికి స్థూల ఎన్పీఏలు 7.23 శాతం (రూ.1,08,172 కోట్లు) మాత్రమే. కాగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే (9.83 శాతం) సీక్వెన్షియల్‌గా కూడా స్థూల ఎన్పీఏలు పెరగడం గమనార్హం. నికర ఎన్పీఏలు సైతం గతేడాది క్యూ3లో 4.24 శాతం (రూ.61,430 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ3లో 5.61 శాతానికి (రూ.1,02,370 కోట్లు) ఎగబాకాయి. ఈ ఏడాది క్యూ2లో నికర ఎన్పీఏలు 5.43 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు 145 శాతం అప్... మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) డిసెంబర్ క్వార్టర్లో (క్యూ3) ఏకంగా 145 శాతం ఎగబాకి రూ.7,244 కోట్ల నుంచి రూ.17,760 కోట్లకు పెరిగాయి. క్యూ2లో ఈ పెరుగుదల 6.2 శాతం మాత్రమే. ఇందులో రూ.6,000 కోట్ల ప్రొవిజన్స్ పాతవాటికి సంబంధించి తాజాగా చేయడం వల్ల పెరిగినవే. కాగా, క్యూ3లో కొత్తగా రూ.25,830 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. ఇందులో కార్పొరేట్ కంపెనీలకు చెందినవి రూ.21,823 కోట్లు (విద్యుత్ రంగం రూ.14,422 కోట్లు) ఉన్నాయి. కాగా, ఎన్పీఏగా మరే అవకాశం ఉన్న జాబితాలో (వాచ్‌లిస్ట్) రూ.10,834 కోట్ల రుణాలున్నాయి. దివాలా కేసుల్లో చిక్కుకున్న కంపెనీల మొండిబకాయిలకు (40 ఖాతాలకు చెందిన రూ.78,000 కోట్లు) సంబంధించి 60 శాతం మేర కేటాయింపులు చేసినట్లు బ్యాంక్ తెలిపింది. క్యూ3 ఆర్థిక ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహపరిచేవే. క్యూ4లో కూడా మొండిబకాయిలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నా. కాగా, ఆర్బీఐ మదింపులో బయటపడిన మొండిబకాయిల్లో 90 శాతాన్ని ఇప్పటికే ఎన్పీఏలుగా గుర్తించాం. ఇందులో దాదాపు రూ.10,000 కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. రానున్న కాలంలో ఈ రంగానికి చెందిన రుణాల్లో మరిన్ని ఎన్పీఏలుగా మారే అవకాశాలున్నాయి. గడచిన 9 నెలల కాలంలో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2018–19)లో వీటిని 2 శాతం లోపునకే పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ఎన్‌పీఏల్లో భారీ తేడాలు... గడచిన ఆర్థిక సంవత్సరంలో (2016–17) ఎస్బీఐ భారీ మొత్తంలో ఎన్పీఏలను తక్కువగా చూపించినట్లు ఆర్బీఐ తనిఖీల్లో బయటపడింది. 2017 మార్చినాటికి ఎస్బీఐ స్థూల ఎన్పీఏలను రూ.1,12,342 కోట్లుగా ప్రకటించింది. అయితే, ఆర్బీఐ మదింపులో మాత్రం ఇవి రూ.1,35,582 కోట్లుగా లెక్కతేలాయి. అదే విధంగా నికర ఎన్పీఏలు కూడా ఆర్బీఐ రూ.75,796 కోట్లుగా లెక్కతేల్చగా, ఎస్బీఐ మాత్రం రూ.58,277 కోట్లుగా చూపింది. ప్రొవిజనింగ్(కేటాయింపులు) కూడా రూ.5,720 కోట్ల మేర ఎస్బీఐ తగ్గించింది. వీటన్నింటినీ తాజాగా మొండిబకాయిలుగా చూపడంతోపాటు తగిన కేటాయింపులు కూడా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది నికర లాభాన్ని తొలుత ప్రకటించిన రూ.10,484 కోట్ల నుంచి రూ.6,743 కోట్లకు సవరించడం విశేషం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 5.17% వృద్ధితో రూ.18,688 కోట్లకు పెరిగింది. ♦ క్యూ3లో వడ్డీయేతర ఆదాయం 29.75 శాతం దిగజారి రూ.11,507 కోట్ల నుంచి రూ.8,084 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా ట్రెజరీ కార్యకలాపాల్లో నష్టాలు(మార్క్–టు–మార్కెట్) దీనికి కారణంగా నిలిచాయి. ♦ ఫీజుల రూపంలో ఆదాయం 5.71 శాతం పెరుగుదలతో రూ.4,710 కోట్ల నుంచి రూ.4,979 కోట్లకు చేరింది. ♦ ఫీజులు కాకుండా ఇతర ఆదాయం మాత్రం 18.38 శాతం క్షీణించి రూ.14,401 కోట్ల నుంచి రూ.11,755 కోట్లకు దిగజారింది. ♦ క్యూ3లో రుణ వృద్ధి అత్యంత స్వల్పంగా 2.52 శాతం మాత్రమే నమోదైంది. దీంతో డిసెంబర్ చివరికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.19.24 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ రుణాల్లో 13.59 శాతం, వ్యవసాయ రుణాల్లో 5.88 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. కార్పొరేట్ రుణాలు మాత్రం 4.22 శాతం తగ్గింది. ♦ ఇక బ్యాంక్ డిపాజిట్లు కూడా క్యూ3లో నామమాత్రంగా 1.86 శాతం వృద్ధితో రూ.26.51 లక్షల కోట్లకు చేరాయి. ♦ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 0.26 శాతం దిగజారి 2.45 శాతానికి చేరింది. ♦ శుక్రవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు ధర 1.68 శాతం నష్టంతో రూ.296 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. -
రైతులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు
కోల్‌కతా: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన ‘ఫామ్కార్ట్’, ‘డీలర్ బంధు’ యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుంది’ అని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని రజనీష్ తెలిపారు. ఇతర ఎస్బీఐ కార్డులలాగే వీటిల్లోనూ వడ్డీ రేట్లు సాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే రైతులు నిర్ణీత కాలంలో చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టలేకపోతే సంస్థ వసూలు చేసే పెనాల్టీలు ఇతర ఎస్బీఐ కార్డుల కన్నా చాలా తక్కువగా ఉంటాయన్నారు. ఇక రైతులు వారి కార్డులోని క్రెడిట్ లిమిట్లో 20 శాతాన్ని కన్సూమర్ ప్రొడక్టుల కొనుగోలుకు వెచ్చించవచ్చని పేర్కొన్నారు. మిగిలిన బ్యాలెన్స్‌తో అగ్రికల్చర్ ఇన్‌పుట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మరొకవైపు వ్యవసాయ రంగంలో ఈ– కామర్స్ వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
ఆర్‌కామ్–జియో డీల్ బ్యాంకులకు మంచిదే
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో మధ్య కుదిరిన డీల్ ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ‘ఆర్‌కామ్–జియో డీల్ బ్యాంకులకు ప్రయోజనకరమైనది. పూర్తి రక్షణ లభిస్తుంది. టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ వీటికి దాదాపు ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఇతర కంపెనీల ప్రమోటర్లకు ఈ డీల్ ఒక మంచి ఉదాహరణలాంటిదని పేర్కొన్నారు. కాగా ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.24,000– 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆర్‌కామ్‌కు రూ.45,000 కోట్లమేర రుణాలున్నాయి. ఎస్బీఐ సహా పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి డజనుకుపైగా బ్యాంకులు ఆర్‌కామ్‌కు రుణాలిచ్చాయి. -
ఎస్బీఐ మేనేజిమెంట్‌లో కీలక మార్పులు!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దీనికోసం టాప్, మధ్య స్థాయి మేనేజ్మెంట్ను పునర్వ్యవస్థీకరించి... ఎన్పీఏల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎండీ హోదా ఉన్న అధికారి దీనికి సారథ్యం వహిస్తారు. ఇటీవలే చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రజనీష్ కుమార్.. హోల్‌టైమ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలోని వివిధ వ్యాపార విభాగాల్లో పలు మార్పులు చేశారు. ‘అనుబంధ బ్యాంకుల విలీనం తరవాత వ్యాపారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు, ఎన్పీఏల రికవరీపై మరింతగా దృష్టి పెట్టేందుకు, మొండిబాకీల సమస్యను పరిష్కరించుకునేందుకు పైస్థాయి మేనేజ్మెంట్లో మార్పులు అవసరమని నిర్ణయించాం’’ అని ఈ నెల 7న సంస్థ సిబ్బందికి అంతర్గతంగా పంపిన లేఖలో కుమార్ పేర్కొన్నారు. క్యూ1లో దాదాపు రెండంకెల స్థాయికి పెరిగిన ఎన్పీఏలపై దృష్టి పెట్టేందుకు రజనీష్ కుమార్.. ఎండీ ఆధ్వర్యంలో నడిచేలా స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్ (ఎస్‌ఏఆర్‌జీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎండీ హోదాలో ఎవరికి బాధ్యతలిస్తారనేది వెల్లడించలేదు. మేనేజ్మెంట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కార్పొరేట్, గ్లోబల్ బ్యాంకింగ్ విభాగానికి ఎండీగా నియమితులైన బి. శ్రీరామ్... కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎంపికయ్యే దాకా ఎస్‌ఏఆర్‌జీ విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. జూన్ ఆఖరు నాటికి ఎస్బీఐ స్థూల ఎన్పీఏలు 7.40 శాతం నుంచి 9.97 శాతానికి, నికర ఎన్పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి పెరిగాయి. మూడీస్ అనలిటిక్స్‌తో జట్టు..: రుణాల మంజూరుకు సంబంధించి మదింపు ప్రక్రియలో ఉద్యోగులకు తగు శిక్షణ ఇచ్చేందుకు మూడీస్ అనలిటిక్స్‌తో ఎస్బీఐ ఒప్పందం చేసుకుంది. దీని కింద.. దేశీ బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన సర్టిఫికెట్ ఇన్ కమర్షియల్ క్రెడిట్ (సీఐసీసీ) ప్రోగ్రాంలో ఎస్బీఐ సిబ్బందికి మూడీస్ శిక్షణనిస్తుంది. ముంబైలో ఇన్నోవేషన్ సెంటర్.. బ్యాంకింగ్ కార్యకలాపాల్ని విస్తరించి, నవకల్పనలను ప్రోత్సహించే దిశగా.. నవీ ముంబైలో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్బీఐ ఇన్నోవేషన్ విభాగాధిపతి సిదోన్ బరావ్కర్ తెలిపారు. సుమారు రూ.100 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీ ఆర్థిక సేవల సంస్థల ఇన్నోవేషన్ కేంద్రాలన్నింట్లో ఇదే అతి పెద్దది అవుతుందన్నారు. ‘‘భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేలా బ్యాంకును సిద్ధం చేసే క్రమంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదిరత టెక్నాలజీల కోసం ప్రత్యేకంగా 40 జోన్లుంటాయి’’ అని బరావ్కర్ వివరించారు. -
మొండిబాకీలే టార్గెట్!
ముంబై: కొండలా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను సత్వరం పరిష్కరించడం, లాభదాయకతను మెరుగుపర్చడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్‌గా నియమితులైన రజనీశ్ కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఎన్పీఏలు తగ్గుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘మొండిబాకీల సమస్యను పరిష్కరించడానికి బ్యాంకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేది కావడంతో.. అత్యవసర ప్రాతిపదికన దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది‘ అని విలేకరుల సమావేశంలో రజనీశ్ తెలిపారు. ‘కార్పొరేట్ల రుణాలపై తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు బ్యాంకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల పరిణామాలు చూడొచ్చు‘ అని చెప్పారు. ప్రస్తుతం రిటైల్ బ్యాంకింగ్ విభాగం ఎండీగా ఉన్న రజనీష్ కుమార్ (59).. ఎస్బీఐ 25వ చైర్మన్‌గా బుధవారం నియమితులైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ఎస్బీఐ స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) 7.40 శాతం నుంచి 9.97 శాతానికి, నికర ఎన్పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి ఎగిశాయి. రిటైల్ ఎన్పీఏలు 1.56 శాతం పెరిగి రూ.7,632 కోట్లకు, వ్యవసాయ రుణాల్లో నిరర్ధక ఆస్తులు 9.51% ఎగిసి రూ. 17,988 కోట్లకు చేరాయి. ప్రస్తుత చైర్మన్ అరుంధతీ భట్టాచార్య స్థానంలో బ్యాంకు పగ్గాలు చేపడుతున్న కుమార్ తక్షణం ఎదుర్కొనబోయే సవాలు మొండిబాకీల పరిష్కారమేనని విశ్లేషకులు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సీనియర్ మేనేజ్మెంట్ తరచూ మారిపోతుండటం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొనే పెద్ద సమస్యని, అయితే ఎన్పీఏల పరిష్కారంపై జరిగిన చర్చల్లో కుమార్ కూడా ఇప్పటికే పాలుపంచుకుని ఉండటం వల్ల మొండిబాకీల సమ స్య ఆయనకు కొత్తది కాబోదని వారి అభిప్రాయం. డిపాజిట్లనూ బెంచ్‌మార్క్ రేటుకు అనుసంధానించాలి.. ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను మరింత ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ఇతర బెంచ్‌మార్క్ రేట్లను ప్రవేశపెట్టాలన్న ఆర్బీఐ ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్లు కుమార్ తెలిపారు. అయితే, రుణాలకు మాత్రమే కాకుండా డిపాజిట్లను కూడా సదరు బెంచ్‌మార్క్ రేటుకు అనుసంధానించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. లేకపోతే సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఒకవేళ రుణ వితరణ వ్యయాలు అధిక స్థాయిలో ఉంటే.. వాటిని తట్టుకునేందుకు బ్యాంకులకు తగినంత నికర వడ్డీ మార్జిన్లు (నిమ్) కూడా ఉండాలి. అందుకే రుణాలనే కాకుండా డిపాజిట్లను కూడా బెంచ్‌మార్క్ రేటుకు అనుసంధానించాల్సి ఉంటుంది. వ్యవస్థ ఒత్తిడిలో ఉండి, రుణ వితరణ వ్యయాలూ పెరిగితే.. ఇక వడ్డీ మార్జిన్లను తగ్గించుకునే అవకాశం ఉండదు. దాన్ని తగ్గించుకుంటే వ్యయాలను ఎలా భర్తీ చేసుకోగలుగుతాం, మొండిబాకీలకు కేటాయింపులు ఎలా చేయగలుగుతాం? కాబట్టే ఆస్తులు, అప్పులనూ బెంచ్‌మార్క్ రేటుకు అనుసంధానించాల్సి ఉం టుంది‘ అని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకు పటిష్టానికి కసరత్తు.. కేవలం బ్యాంకు పరిమాణాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆర్థికంగా మరింత పటిష్టం చేయడంపైనా దృష్టి సారించనున్నట్లు కుమార్ చెప్పారు. ‘గడిచిన కొన్నాళ్లుగా ప్రొవిజనింగ్ అవసరాల కారణంగా బ్యాంకు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతూ వచ్చింది. ఇకపై బ్యాంకు వ్యాపార పరిమాణంపరంగా ఎదగడం మాత్రమే కాకుండా లాభదాయకతను కూడా పెంచుకునేలా కృషి చేస్తాము‘ అని ఆయన వివరించారు. ఇందులో భాగంగా మధ్య స్థాయి మేనేజ్మెంట్ బృందంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేపట్టొచ్చని కుమార్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది సమయం చాలామటుకు మొండిబాకీల సమస్యల పరిష్కారానికే వెచ్చించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. దీన్ని సరిచేసే దిశగా రాబోయే రోజుల్లో మొండిబాకీల పర్యవేక్షణకోసం ఒక బృందాన్ని, రుణవితరణ కార్యకలాపాల కోసం మరో టీమ్‌ను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. రుణ వితరణకు సంబంధించి రిటైల్, మౌలిక రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని కుమార్ చెప్పారు. ‘అండర్‌రైటింగ్ ప్రమాణాలు చాలామటుకు మారాయి. మేము మరింత జాగ్రత్త వహించనున్నాం. ఇప్పటికీ మంచి ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రుణాలందించే అవకాశాలు పరిశీలిస్తూనే ఉన్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత మూలధనంతో రుణాల వృద్ధి మెరుగుపర్చుకోగలమని, 2019 మార్చి దాకా తమకు మరింత మూలధనం అవసరం ఉండబోదని కుమార్ వివరించారు. -
బెస్ట్ ప్రైస్ నుంచి మరో 50 ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాష్ అండ్ క్యారీ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెస్ట్ ప్రైస్ ఔట్లెట్ల సంఖ్యను నాలుగైదేళ్లలో ప్రస్తుతమున్న 20 నుంచి 70కి పెంచనుంది. ఇందుకోసం రూ.3,000-3,600 కోట్లు వ్యయం చేయనుంది. భారత్‌లో 1,000 స్టోర్లు ఉండేంతగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని సంస్థ కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజ్నీష్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. సమయం వచ్చినప్పుడు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు రూ.60-72 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అనువైన ప్రాంతం ఎంపిక, స్థల సేకరణ, అనుమతులు వెరశి స్టోర్ కార్యరూపం దాల్చడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. కొత్త ప్రభుత్వం రాకతో ఈ సమయం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. రిటైల్‌లోకి సిద్ధం.. ప్రభుత్వం 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తే మల్టీబ్రాండ్ రిటైల్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నామని రజ్నీష్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యూహంతోనే భారత్‌లో ప్రవేశించామని అన్నారు. క్యాష్ అండ్ క్యారీ విభాగంలో భారత్‌లో తమ సంస్థ మార్కెట్ లీడర్‌గా ఉందని చెప్పారు. 9 లక్షలకుపైగా కస్టమర్లున్నారని పేర్కొన్నారు. వీరిలో 70 శాతంపైగా కిరాణా వ్యాపారులు ఉన్నారని చెప్పారు. ఏటా 20 శాతం వృద్ధి కనబరుస్తున్నామని వివరించారు. హైదరాబాద్, లక్నో కస్టమర్ల కోసం ఇ-కామర్స్ విధానాన్ని పరిచయం చేశామని, ఇతర స్టోర్లకు దీనిని విస్తరిస్తున్నట్టు తెలిపారు. ‘95 శాతం ఉత్పత్తులను దేశీయంగానే సేకరిస్తున్నాం. రైతులకు, తయారీదారులకు మార్కెట్ కంటే మంచి ధర చెల్లిస్తున్నాం. మా విక్రయ ధర కూడా తక్కువగానే ఉంటుంది’ అని వివరించారు. 9 శాతం వృద్ధి.. రిటైల్ వ్యాపారం భారత్‌లో రూ.25.2 లక్షల కోట్లుంది. ఇందులో హోల్‌సేల్ వ్యాపారం రూ.18 లక్షల కోట్లు. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం 9 శాతం వృద్ధితో రూ.3 లక్షల కోట్లుంది. ఆధునిక రిటైల్ వాటా 8 శాతం మాత్రమే. ఈ రంగం ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. సంప్రదాయ వ్యాపారం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో బెస్ట్ ప్రైస్ స్టోర్లున్నాయి. బిజినెస్ టు బిజినెస్ విధానంలో అంటే కిరాణా దుకాణాల వర్తకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల నిర్వాహకులకు మాత్రమే బెస్ట్ ప్రైస్ ఔట్లెట్లలో సరుకులను విక్రయిస్తారు. 5 వేలకుపైగా రకాలను అందుబాటులో ఉంచారు.